బీజేపీకి తన మీద తనకే అసహనం!

నెలకొకసారి మీటింగ్ పెట్టుకుని తమ పార్టీ తీరు మీద తామే అసహనం వ్యక్తం చేసుకోవడం భారతీయ జనతా పార్టీకి అలవాటుగా మారినట్టుంది! ఏపీకి చెందిన ఈ పార్టీ ముఖ్యనేతలంతా ఎక్కడో ఒక చోట సమావేశం కావడం.. తాము చేస్తున్న పొరపాట్ల గురించి తామే చెప్పుకోవడం! తాము తెలుగుదేశం పార్టీకి బాగా చులకన అయ్యామని వీళ్లు ఆవేదన వ్యక్తం చేస్తారు.. ఆ పార్టీకి సమాధానం చెప్పాలంటారు. మన పార్టీని బలోపేతం చేసుకుందామని పిలుపునిస్తారు.. ఏపీ ప్రభుత్వ విధానాల్లోని లోటు పాట్ల పై పోరాడటంతోనే అది సాధ్యం అవుతుందంటారు! అయితే ఆ ముచ్చట అంతా ఆ మూడు నాలుగు గంటలకే పరిమితం!

మళ్లీ ఉదయం లేస్తే.. ప్రతి చోటా బాబుకు భజనే. కొంతమంది బీజేపీ నేతలైతే.. తెలుగుదేశం కన్నా వీర స్థాయిలో వైకాపాపై శివాలెత్తుతూ ఉంటారు. ఇలా కాకుండా.. గుళ్ల ధ్వంసం వంటి వ్యవహారాల్లో ప్రభుత్వ తీరును నిరసించి కూడా కమలనాథులు సాధించింది ఏమీ లేకపోయింది! స్వాములోరు అందరినీ కదిలించి సమావేశం ఏర్పాటు చేయగా.. అందులో కొంతమంది బాబుకు శాపనార్థాలు పెట్టారు, మరికొందరు కమలనాథులు అక్కడ కూడా బాబు భజనే చేశారు!

ఇక ఏపీ విభాగానికి అధ్యక్షుడిని నియమించడానికి కమలం పార్టీ అధినాయకత్వం పడుతున్న కష్టాల గురించి చెప్పనలవి కాదు! ఇప్పటి వరకూ ఆ నియామకం కోసం నాలుగైదు మీటింగులు జరిగాయి! ప్రతి సారీ ఇదిగో.. ప్రకటనే తరువాయి అనడం.. ఆ తర్వాత మళ్లీ మామూలే!

ప్రధానమంత్రి విదేశాల్లో ఉన్నాడు.. అందుకని ఏపీ బీజేపీ విభాగానికి అధ్యక్షుడెవరో ప్రకటించడం కొంచెం లేటవుతుంది అన్నారామధ్య. మరి మోడీ విదేశాల నుంచి వచ్చి చాన్నాళ్లు అయిపోయాయి, పార్టీ తరపు నుంచి ప్రకటన వచ్చే లోపు మళ్లీ ఆయన మళ్లీ విదేశాలకు వెళ్లిపోతారేమో! జనవరిలో అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి పదవీ కాలం అయిపోతే.. ఆగస్టు వస్తున్నా.. మరో వ్యక్తిని ఆ పదవిలో నియమిస్తూ ప్రకటన చేయలేకపోతున్నారంటే.. ఏపీ విభాగంపై జాతీయాధ్యక్షుడికి ఉన్న పట్టేమిటో స్పష్టం అవుతోంది. Readmore!

ఏపీకి సంబంధించి కమలం పార్టీకి ఉన్న కష్టాలేమిటో బయటికే తెలిసిపోతున్నాయి.  అక్కడ బీజేపీ అనుకూల బృందం ఒకటి ఉంటే, బాబు లాబీ మరోటి ఉంది. నిఖార్సైన కాషాయవాదులు, హిందుత్వ వాదులు.. బీజేపీ గ్రౌండ్ లెవల్లో బలోపేతం చేద్దామని అంటుంటే, తెలివిగా అక్కడ చేరిపోయిన ఒక కులం నేతలు మాత్రం.. ఆ అవసరం లేదు, బాబుకు భజన చేస్తూ తరించేద్దాం అంటున్నారు. అధినాయకత్వం వాళ్లనూ వదులుకోలేకపోతోంది, వీళ్లనూ వదులుకోలేకపోతోంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఏపీలో బీజేపీ బలోపేతం అనేది కేవలం వీర కాషాయవాదుల కల మాత్రమే అనేది సుస్పష్టమైన అంశం.  

Show comments

Related Stories :