టీఎస్సార్ రుమాలేస్తున్నారా?

అవతల చూస్తే బోలెడు కమిట్ మెంట్లు. అవును, నిజమే చేస్తున్నాం అనే మాట కూడా లేదు. కానీ ఇవతల చూస్తే ఇదిగో సినిమా, అదిగో కథ అంటూ ప్రకటనలు. కళాబంధు, టీ సుబ్బరామిరెడ్డి మల్టీస్టారర్ సినిమా వ్యవహారామే ఇది. త్రివిక్రమ్ చేతిలో రెండు సినిమాలు. పవన్ చేతిలో మూడు సినిమాలు. చిరంజీవి చేతిలో భారీ బడ్జెట్ సినిమా. ఇదీ పరిస్థితి. కానీ టీఎస్సార్ మాత్రం తాను ఆ అన్నదమ్ములతో, త్రివిక్రమ్ డైరక్షన్ లో మల్టీస్టారర్ తీస్తున్నా అంటారు.

అదెలా అంటే, ఇప్పుడు, అప్పుడు అని చెప్పేలేదు కదా? తీస్తారు?ఎప్పుడో అప్పుడు? అనే సమాధానం వస్తుంది జనాల నుంచి. నిజానికి ఓ మల్టీస్టారర్ తీయాలనుకుంటే, టీఎస్సార్ కు పెద్ద కష్టం కాదు. వంద, రెండు వందల కోట్లు ఎడం చేత్తో పెట్టుబడి పెట్టగల కెపాసిటీ వుంది ఆయనకు. కానీ సమస్య అన్నదమ్ములు కలిసి ఓ సినిమాలో నటిస్తారా? ఇప్పటి దాకా అది జరగలేదు.

అలాగే ఇప్పుడున్న బిజీలో ఇది సాధ్యం అవుతుందా? అసలు ఎన్నికల ముందుగా, పవన్ తన కమిట్ మెంట్లు అన్నీ పూర్తి చేయగలరా అన్నదే అనుమానం.  పైగా సుబ్బరామిరెడ్డి టార్గెట్ కూడా 2019 ఎన్నికలే. కోరి రాజ్యసభ ఇస్తామన్నా టీఎస్సార్ ఇష్టపడరు కానీ, విశాఖ నుంచి పార్లమెంటు కు పోటీ చేయమంటే మాత్రం ఆయనకు మహా ఆనందం.

ఆయనకు అదో తృప్తి. పోటీ చేసే, అది కూడా విశాఖ నుంచి పోటీ చేసే పార్లమెంటుకు వెళ్లాలనుకుంటారు. గతంలో అలాగే వెళ్లారు. కానీ పురంధ్రీశ్వరి కాంగ్రెస్ లోకి రావడంతో ఆయనకు ఆ లైన్ తప్పిపోయింది. మళ్లీ ఎలాగైనా అక్కడ పోటీ చేయాలని, గెలవాలని ఆయన కిందా మీదా అవుతున్నారు.

ఇటీవలి కాలంలో సినిమా జనాలను చాలా సార్లు విశాఖ తీసుకెళ్లి సందడి చేసారు.  ఇటీవల రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఫీలర్లు ఏమిటంటే, విశాఖ టికెట్ ఇస్తే, వైకాపాలోకి టీఎస్సార్ వస్తారన్నది. ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అదే ఆఫర్ పురంధ్రీశ్వరి నుంచి కూడా వైకాపాకు వచ్చిందని మరో ఫీలర్.

టీఎస్సార్ అడ్వాంటేజ్ ఏమిటంటే, ఆయనకు అజాతశతృవు అనే టైటిల్ వుంది. చంద్రబాబు అయినా ఆయన మిత్రుడే, జగన్ అయినా మిత్రుడే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కూడా లైన్ లో పెడుతున్నారు. మొన్నటికి మొన్న పవన్ షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కు టీఎస్సార్ స్వయంగా వెళ్లి, కాస్సేపు ముచ్చటించి, ఫొటోదిగివచ్చారు. పనిలో పని ఓ ప్రకటన విడుదలచేసేసారు.

ఇదంతా చూస్తుంటే 2019 ఎన్నికలు-విశాఖ సీటు అనే విషయంలో టీఎస్సార్ చాలా పట్టుదలగానే వున్నట్లుంది. జనసేన తరపున కానీ, లేదా జనసేన కోటాలో కానీ, పోటీకి దిగే ఆలోచన కూడా చేస్తున్నారేమో అన్న అనుమానం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వ్యవహారం స్టడీగా వుండదు. 

జనసేన పార్టీ పెట్టిన కొత్తలో పారిశ్రామిక వేత్త పివిపి బోలెడు పెట్టుబడి పెట్టారు పార్టీ కోసం. కానీ ఏమయింది. విజయవాడ టికెట్ రాలేదు. అందువల్ల టీఎస్సార్ జనసేన వైపు నుంచి కాకుండా, చంద్రబాబు వైపు నుంచి నరుక్కురావడం బెటర్. కానీ అక్కడా సమస్య వుంది. భాజపా సిటింగ్ ఎంపీ వున్నారు అక్కడ. భాజపా-టీడీపీ పొత్తు వీడకపోతే, ఆ సీటు వాళ్లకే వుంటుంది.

అలాంటపుడు జనసేన ఒంటరి పోరు చేస్తేనే టీఎస్సార్ కు అవకాశం వుంటుంది. ఏదైనా ఎందుకైనా పనికి వస్తుంది, వ్యాపార రీత్యా కూడా మంచి ప్రాజెక్టు అవుతుంది. అందుకే టీఎస్సార్ ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టును అలా రుమాలు వేసి వుంచుతున్నట్లు కనిపిస్తోంది.

Show comments