కేసీఆర్‌ కంటె జాస్తిగా భయపెడుతున్న చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌ సర్వే పేరిట భారీస్థాయిలో సర్వే నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. జనం పుట్టుమచ్చల దగ్గరినుంచీ దాదాపు 80 రకాల వివరాలను సర్కారు వారి రికార్డుల్లోకి ఎక్కించాలని ఇప్పటికి నిర్ణయించారు. తొలుత 60 వరకు రకరకాల వివరాలు నమోదుచేస్తే చాలు అనుకున్నారుట. తర్వాత ఏలినవారికి వచ్చిన కొత్త ఆలోచనలు మొత్తం జత చేసే సరికి 80 అంశాల్లో జనం వివరాలు తమ దగ్గర ఉండాలని అనుకున్నట్లుగా ఉంది. అధికారికంగా ఈ పల్స్‌ సర్వే ప్రారంభం అయ్యే సమయానికి మరిన్ని రకాల అంశాలు జోడింపబడినా కూడా ఆశ్చర్యం లేదు. 

అయితే ఇక్కడ ఒక కీలకాంశాన్ని గమనించాల్సి ఉంది. అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఇలాంటి కసరత్తు ఒకటి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే అని దానికి పేరు పెట్టారు. అన్ని ప్రభుత్వ, ప్రెవేటు కార్యాలయాలకు సెలవు కూడా ప్రకటించి వివరాలు సేకరించారు. కేసీఆర్‌ చేపడుతున్న సర్వే పేరెత్తితేనే అప్పట్లో జనం హడలిపోయారు. అప్పట్లో తెలంగాణలో ఉన్న ఆంధ్రోళ్ల లెక్క తీసి వారిని వెళ్లగొట్టడం లక్ష్యంగా ఈ సర్వే జరుగుతున్నదనే ప్రచారం సాగింది. అంతకంటె ఎక్కువగా.. ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో కత్తెర వేయడానికే ఈ వివరాలు సేకరిస్తున్నట్లుగా కూడా జనం భయపడిపోయారు. 
ఇప్పుడు చంద్రబాబునాయుడు పల్స్‌ సర్వే అనేది సంకల్పిస్తున్నారు. ఇందులో ప్రజల జన్మ నక్షత్రమూ, జాతకచక్రమూ సహా అన్ని వివరాలనూ నమోదు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే సంక్షేమపథకాల్లో కోత, పన్నులు వడ్డించడం, జనం గుట్టుగా ఉంచుకునే తమ వివరాలను రట్టు చేయడం మినహా పల్స్‌ సర్వే వలన పౌరుడికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అనే భయాలు ప్రజల్లో కలుగుతున్నాయి. 

-) ఆస్తులు తదితర వివరాలు మెుుత్తం ప్రభుత్వం తీసుకుంటుంది. ఫరెగ్జాంపుల్‌ ఇళ్లున్న వారు ఇంటి మీద వచ్చే అద్దెలను ఆదాయంలో సాధారణంగా చూపించరు. కానీ ఇప్పుడు అవన్నీ కంప్యూటరైజ్‌ అయితే ఆదాయాలు వంటివి దాచడం అసాధ్యం అవుతుంది. ఒక్కసారి అవన్నీ లెక్కతేలిన తర్వాత.. ఇక సంక్షేమ పథకాలు అందే విషయంలోనూ మార్పు చేర్పులు ఉంటాయి. 

-) ప్రభుత్వం ఎలాంటి నాటకాలు ఆడుతున్నదంటే.. జనం ఆధార్‌ కార్డ్‌ లేదంటే అక్కడికక్కడే బయోమెట్రిక్‌ విధానంలో వారి వేలి ముద్రలు తీసుకుని కార్డు వచ్చే ఏర్పాటు చేస్తారు. బ్యాంకు అకౌంట్‌ లేదంటే.. అక్కడికక్కడే అకౌంట్‌ సృష్టిస్తారు. కానీ రేషన్‌ కార్డు లేదంటే ఆ వివరాల్ని సంబంధిత శాఖకు పంపుతారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని మాత్రం 'అక్కడికక్కడే' చేయరు.. జనం మళ్లీ లంచాలు సమర్పించుకుంటూ.. వారి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చావాలన్నమాట. రేషన్‌ కార్డు లేదంటే అక్కడికక్కడే ఇచ్చేంతటి మంచి బుద్ధితో సర్కారు ఎందుకు పనిచేయకూడదు. అక్కడి కక్కడే కార్డులు ఇచ్చేసి.. ఆ తరువాత, అవేమైనా డూప్లికేట్‌ అయ్యాయో లేదో ప్రభుత్వ రికార్డుల్లో చెక్‌ చేసుకోవచ్చు కదా.. అలాంటి పని మాత్రం చేయరు. 

... ఇలా సర్వే రూపేణా కేసీఆర్‌ జనాన్ని భయటపెట్టిన దానికంటె చంద్రబాబునాయుడు చేయిస్తున్న పల్స్‌ సర్వే 80కి మించిన రకరకాల అంశాలతో.. జనాన్ని మరింతగా బూచిలాగా భయపెడుతున్నది. తమ వివరాలు సమస్తం దాచుకోకుండా చెబితే ఏం నష్టపోతామో, చెప్పకపోతే ఇంకా ఏం కోల్పోతామో అన్నట్లుగా జనం ఈ సర్వే గురించి భయపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో సర్వే అంతిమలక్ష్యాల గురించి ప్రజల్లో ఇలాంటి భయాలు ఉన్నప్పటికీ.. వాటి గురించి ఎక్కడా ప్రచారం రాకుండా చంద్రబాబు కోటరీ తమ మార్కు ప్రచార టెక్నిక్కులను పాటిస్తూనే ఉన్న సంగతి కనిపిస్తోంది. 

Show comments