ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఒక్కటైతే.!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఒక్కటైతే ఎలా వుంటుంది.? ఆ ఆలోచనే అద్భుతం కదా.! మళ్ళీ విభజన వ్యవహారం వెనక్కి వెళ్ళిపోవాలని కాదు రెండు రాష్ట్రాలూ ఒక్కటవడమంటే. తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటే.. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్రాలకతీతంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిథులు ఏకమవ్వాలన్నదే ఈ 'ఒక్కటవడం' వెనుక ఉద్దేశ్యం. కానీ, ఇది సాధ్యమేనా.? ఛాన్సే లేదు. 

ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అత్యంత హేయంగా వుంటాయి. అదే తమిళనాడుని తీసుకుంటే, తమ ప్రయోజనాల కోసం అక్కడ పార్టీలు జెండాల్ని పక్కన పడేస్తాయి. వాళ్ళ ఎజెండానే వేరు. అది ప్రజల ఎజెండా. తమిళనాడుకి ఏదన్నా ప్రాజెక్ట్‌ కావాలంటే, అక్కడి రాజకీయ పార్టీలన్నీ ఏకమైపోతాయి. శ్రీలంకలో తమిళుల సమస్య విషయంలో అయినా, ఇంకేదన్నా విషయంలో అయినా, అక్కడి రాజకీయ 'కలయిక' చూడముచ్చటగా వుంటుంది. 

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే ఎప్పుడూ రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కన్పించలేదు. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఐక్యత కన్పిస్తుందా.? ఛాన్సే లేదు. కానీ, ఓ ప్రయత్నమైతే కాంగ్రెస్‌ పార్టీ నుంచి జరుగుతోంది. నమ్మశక్యం కాని విషయమిది. కానీ, నమ్మాల్సిందే. బహుశా చేసిన తప్పుకి ప్రాయిశ్చిత్తం చేసుకోవాలనుకుంటోందేమో కాంగ్రెస్‌ పార్టీ. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు కోరడం ద్వారా కాంగ్రెస్‌ అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. 

కాంగ్రెస్‌ హయాంలోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజిస్తూ చట్టం చేశారు. దురదృష్టవశాత్తూ ఆ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌ సర్వనాశనమైపోయింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా సర్వనాశనమైపోయిందనుకోండి.. అది వేరే విషయం. అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడిక జరగాల్సిన కార్యక్రమం ఇదీ.. అని తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్‌ సరికొత్త ఎత్తుగడలతో ముందుకొచ్చింది. 

ఇక్కడ అభినందించాల్సిన విషయమేంటంటే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం తెలంగాణలోని అధికార పార్టీని కాంగ్రెస్‌ మద్దతు కోరడం. కాంగ్రెస్‌ వ్యూహం ఫలించి, టీఆర్‌ఎస్‌ - ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో మద్దతు పలికితే, అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి తెలుగు రాష్ట్రాల్లో. రేప్పొద్దున్న తెలంగాణకి అవసరమైన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ముందుకొచ్చి, తెలంగాణ తరఫున వకాల్తా పుచ్చుకోడానికి ఆస్కారమేర్పడుతుంది. 

వినడానికీ, కలలుగనడానికీ ఎంతో అద్భుతంగా అన్పిస్తోంది కదూ.! కానీ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీ మధ్య ప్రత్యేక హోదా విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. టీడీపీ - బీజేపీ ఒక్కటయ్యాయి.. ప్రత్యేక హోదాకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. అలాంటప్పుడు టీఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం అనుకూలంగా మాట్లాడుతుందని ఎలా అనుకోగలం.?

Show comments