అబ్జర్వేషన్‌: కూల్చేయడం అంత తేలికా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి సచివాలయం కూల్చివేత విషయంలో షాక్‌ తప్పేలా లేదు. సచివాలయం కూల్చివేతకు సంబంధించి కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ కేసులో, హైకోర్టు తెలంగాణ సర్కార్‌కి చిన్న ఝలక్‌ ఇచ్చింది. విచారణ పదిరోజులపాటు వాయిదా వేసిన న్యాయస్థానం, ఈలోగా ఎలాంటి కూల్చివేతలూ చేపట్టరాదంటూ తేల్చి చెప్పింది. 

సచివాలయాన్ని కూల్చేసి, కొత్త సచివాలయం కట్టాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన. కారణం వాస్తు సమస్యలు. వాస్తు - జ్యోతిష్యం మీద కేసీఆర్‌కి వున్న నమ్మకం అంతా ఇంతా కాదు. ఆ నమ్మకాలు ఆయన వ్యక్తిగతం. కానీ, ఆ నమ్మకాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా.? ఇదే ఇప్పుడు న్యాయస్థానంలో కీలక వాదన కానుంది. ఇంకో కారణం ఏదన్నా చెప్పి, సచివాలయాన్ని కూల్చేసి కొత్త సచివాలయం కట్టాలనే నిర్ణయానికి తెలంగాణ సర్కార్‌ వచ్చి వుంటే పరిస్థితి ఇంకోలా వుండేది. 

ఏ ఉద్దేశ్యంతో అయినాసరే, కోట్లాది రూపాయలు వృధా చేయడం అంటే అది చిన్న విషయం కాదు. అటూ ఇటూగా ఓ వెయ్యి కోట్లు వెచ్చిస్తే తప్ప కొత్త సచివాలయాన్ని నిర్మించడం వీలు కాదు. అంత వృదా ఖర్చు అవసరమా.? ఆ ఖర్చుతో, విద్యార్థుల ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ చెల్లించొచ్చు.. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా మేలు చేయొచ్చు.. ఇంకా ఇంకా చాలా కార్యక్రమాలు చేయొచ్చు. కానీ, వాటన్నిటికన్నా కేసీఆర్‌కి వాస్తు - జ్యోతిష్యాలు అనే 'మూఢ' వ్యవహారమే ముఖ్యమైతే ఎలా.? 

పోనీ, 'అబ్బే.. వాస్తు పిచ్చితో కాదు.. కూల్చివేతకు ఇంకో కారణం వుంది..' అని తెలంగాణ సర్కార్‌ హైకోర్టుకి తేల్చి చెప్పాలనుకుంటే, కేసీఆర్‌ పరువు పోతుంది. ఇదిప్పుడు ప్రెస్టీజ్‌ ఇష్యూ అయిపోయి కూర్చుందాయె. 'నేను మోనార్క్‌ని..' అనుకునే కేసీఆర్‌, ఈ విషయంలో వెనక్కి తగ్గుతారా.? ఛాన్సే లేదు. 'కూల్చొద్దు..' అని హైకోర్టు ఒకవేళ పూర్తిస్థాయి ఆదేశాలు జారీ చేస్తే, సుప్రీంకోర్టుని ఆశ్రయించడం తప్ప ఇంకో మార్గం వుండదు. ఈలోగా కూల్చివేతలకు ఛాన్సే వుండదాయె. 

అయినా, సచివాలయాన్ని అక్కడే కట్టాలని అనుకుంటే ఎలా.? ఇంకో చోట ఎక్కడన్నా ప్లాన్‌ చేసుకోవచ్చు కదా.! ఆ మధ్యన ఎర్రగడ్డలోని ఓ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. హైద్రాబాద్‌ నడిబొడ్డునే ఇంకొన్ని చోట్ల అయితే బావుంటుందని అనుకున్నారు. అదీ కుదరలేదాయె. వేరే చోట కొత్తగా కట్టుకుంటే ఎవరికీ పెద్దగా సమస్య వుండదు. ఇప్పుడున్న సచివాలయాన్ని ఇంకోరకంగా ఉపయోగించుకునే అవకాశం వుంటుంది గనుక.! 

ఏదిఏమైనా పాలకులన్నవారెవరైనాసరే, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాల్సి వుంటుంది.. తమ పిచ్చి నమ్మకాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తామంటే ఎలా.? అది చంద్రబాబు అయినా, కేసీఆర్‌ అయినా ఇంకొకరైనా.. అది ఏమాత్రం పాలకుడికి తగని పని.

Show comments