చంద్రబాబు మాటలు - సంచలనాలు సృష్టిస్తున్నాయి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాటల ద్వారా రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడి ఉండరేమో! నంద్యాలలో జరగనున్న ఉపఎన్నిక కోసం ఆయన అప్పుడే పెద్దఎత్తున ఖర్చు చేయడం ఆరంభించారు. అది కూడా ప్రభుత్వ ధనాన్ని వెచ్చింది ప్రచారం చేస్తున్నారు. అది ఒకఎత్తు అయితే ఇప్పుడు ఆయన కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. తన పార్టీకి ఓటు వేయకపోతే తను ఇచ్చిన పెన్షన్లు తీసుకోరాదట.

తన పార్టీకి ఓటు వేయకపోతే తను వేసిన రోడ్డుపై నడవరాదట. ఓటుకు ఐదువేల రూపాయలు అయినా ఖర్చు పెట్టగలరట.. కాని అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిజంగా ఏ మాత్రం అర్ధవంతమైనవి కాదు సరికదా.. ప్రజాస్వామ్య స్పూర్తిని పరిహసించే విధంగా ఉన్నాయి. దీనిని బట్టి చంద్రబాబు నాయుడు కాని, తెలుగుదేశం పార్టీ కాని ఆంధ్రప్రదేశ్‌లో ఎంత బలహీనంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి వందతప్పులు చేస్తారట.

ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు ఆడతారట. అలాగే ఒక ఓటు కోసం ఎన్ని పాట్లు అయిన పడతారని అనుకోవాలి. చివరికి ఓటర్లను బెదిరించే స్థాయికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దిగజారుతున్నారన్న విషయం బాధ కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాక ఎవరికి ఇష్టం ఉన్నా, లేకపోయినా, ప్రజలందరికి ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ఎన్నికైన పార్టీ వారికే ముఖ్యమంత్రి కారు.

ఆ విషయాన్ని నలభై ఏళ్లుగా రాజకీయాలలో ఉండి, తెలుగువారిలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి తెలియకపోవడం దురదృష్టకరం. చంద్రబాబు చెప్పే సిద్ధాంతం ప్రకారం అయితే ఈ దేశంలో కనీసం తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ను తప్ప మరే పార్టీని గెలిపించకూడదనుకోవాలి. ఎందుకంటే శ్రీశైలం, నాగార్జున సాగర్‌ వంటి గొప్ప ప్రాజెక్టులను ఆనాటి నేతలు నిర్మించారు. ఇప్పుడు ఒక వెయ్యి రూపాయల పెన్షన్‌ ఇచ్చి, ఒక గ్రామానికి రోడ్డు వేసి తనకు ఓటు వేయకపోతే, వాటిని తీసుకోవద్దని బెదిరిస్తున్నారు.

ఈ లెక్కన ఆ రెండు భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటితో తెలుగు రాష్ట్రాలు సుసంపన్నమై, ధాన్యరాశులను పండించి ప్రజలకు సిరులు తెచ్చిపెట్టాయి. కాని వాటి నిర్మాణంలో క్రియాశీలకంగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఓటమి చవిచూశారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఓడిపోవలసి వచ్చింది. అంతదాకా ఎందుకు అసలు సంక్షేమ పథకాలకు ఒక విధంగా రూపకర్త వంటి తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు సైతం పరాజయం పాలు కాకతప్పలేదు.

రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక ఇరిగేషన్‌ ప్రాజెక్టులు చేపట్టి, ఆరోగ్యశ్రీ, ఫీజ్‌ రీయింబర్స్‌ మెంట్‌ వంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009లో రెండోసారి 156 సీట్లతోనే అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఆయన తాను ఇవన్ని చేసినా పూర్తి విజయం ఇవ్వలేదు కనుక ప్రజలను దూషించలేదు. పైగా తనకు పాస్‌ మార్కులు మాత్రమే వచ్చాయని, ఈసారి మరింత కష్టపడి, ప్రజలను మెప్పిస్తానని అన్నారు. అది హుందాతనం అంటే. అది మెచ్యూరిటీ అంటే.

కాని డెబ్బైవ పడికి దగ్గరవుతున్న చంద్రబాబు నాయుడు మాత్రం ఆశ్చర్యంగా నేను వేసిన రోడ్డు మీద నడవవద్దు.. నేనిచ్చిన పెన్షన్‌ తీసుకోవద్దని అని అంటున్నారు. నిజానికి ఇవేవి ఆయన కొత్తగా కనిపెట్టిందికాదు. గతం నుంచి అమలులో ఉన్నవే. కాకపోతే జనంలో ఒక భ్రమ కల్పించాలన్నది ఆయన తాపత్రయం కావచ్చు. తాను మాత్రమే రోడ్డు ఎలా వేయాలో కనుగొన్నానని, తాను మాత్రమే విద్యుత్‌ను కనిపెట్టానని, అంతకుముందు ప్రజలంతా అడవిలోనో, చీకట్లలోనో మగ్గుతున్నారని అనుకోవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.

పైగా ఇదంతా ప్రజల సొమ్ము. పన్నుల రూపంలో వసూలుచేసి వాటికి ట్రస్టీగా వ్యవహరించవలసిన ముఖ్యమంత్రి ఇదంతా తన సొంత సొమ్ము అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరమే. ఇదే సొమ్మును తన ప్రత్యేక విమానాలకు తన ఇళ్ల కోసం, ఆడంబరాలకోసం కూడా ఖర్చు చేస్తున్న విషయం కూడా ప్రజలకు తెలుసు. వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు ఏమైనా చెబుతారని సామెత ఈయనకు బాగానే వర్థిస్తుందనిపిస్తుంది. ఇక ఓటుకు ఐదువేల రూపాయలు ఇవ్వగల సత్తా చంద్రబాబుకు ఉందని విపక్షాలు వ్యాఖ్యనిస్తున్నాయి.

నిజానికి ఎన్నికలను ఖరీదైన వ్యవహారంగా మార్చిన చరిత్ర చంద్రబాబుదే. 1996 లోక్‌సభ ఎన్నికలలో విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఆరంభించారు. ఆ తర్వాత జరిగిన ఒక ఉపఎన్నికలో దండు శివరామరాజు అనే టీడీపీ నేత పోటీచేశారు. ఆయన పోలింగ్‌ అయ్యాక హైదరాబాద్‌ వచ్చి మిత్రులతో ఏమన్నారో తెలుసా.. ఇదేం డబ్బురా బాబు.. చంద్రబాబు అన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. సాధారణ ఎన్నికలలో తనవల్ల ఎక్కడ అవుతుందని అన్నారు.

అదే ట్రెండ్‌ను ఆయన ఎప్పటికి కొనసాగిస్తున్నారన్న భావన ఏర్పడుతుంది. చంద్రబాబు మరో వ్యాఖ్య కూడా చేశారు. ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబెల్‌ ప్రైజ్‌ ఇస్తానని అన్నారు. అంతకు ముందు నోబెల్‌ బహుమతి తెస్తే వందకోట్లు బహుమతి అన్నారు. ఈ మద్యకాలంలో చంద్రబాబు కొంత సమతుల్యత తప్పి మాట్లాడుతున్నారన్న భావన ప్రబలుతోంది. ఆయన పొరపాటున మాట్లాడినా ముఖ్యమంత్రి అనేసరికి దానికి ప్రాధాన్యత వస్తుంది. పొరపాట్లు అయితే ఒకరకం.

కాని రాజకీయంగా నంద్యాలలో చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్రమైనవని చెప్పకతప్పదు. ఏది ఏమైనా ఒక పార్టీ వారికే ముఖ్యమంత్రిగా కాకుండా ప్రజలందరికి నేతగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకోవాలి కాని, ఇలా రోజురోజుకు తన ప్రతిష్టను మాత్రమే కాకుండా, ముఖ్యమంత్రి పదవికి ఉండవలసిన హుందాతనాన్ని కోల్పోయేలా చంద్రబాబు వ్యవహరిస్తుండడం దురదృష్టకరం. అందుకే ఏమిటి చంద్రబాబు ఇలా అయిపోతున్నారన్న బాధ కలుగుతుంది.

Show comments