కాకాని వర్సెస్‌ సోమిరెడ్డి.. న్యూ ట్విస్ట్‌

వైఎస్సార్సీపీ నేత కాకాని గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలతో విరుచుకుపడ్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వెయ్యి కోట్లకుపైగా ఆస్తులున్నాయంటూ కాకాని చేసిన ఆరోపణలతో వివాదం రాజుకుంది. ఆరోపణలకు తగ్గ ఆధారాలు తన వద్ద వున్నాయంటూ కాకాని సంచలన వ్యాఖ్యలు చేయడంతో, సోమిరెడ్డి షాకయ్యారు. 

ఇక, షరామామూలుగానే సోమిరెడ్డి, కాకానిపై విరుచుకుపడ్డారు. కాకాని గోవర్ధన్‌రెడ్డిపై చాలా కేసులున్నాయనీ, ఫోర్జరీ చేయించడంలో దిట్ట అనీ, కల్తీ మద్యం కేసులూ అతనిపై వున్నాయనీ ఎదురుదాడికి దిగారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. అక్కడితో ఆగకుండా సోమిరెడ్డి, పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇంకో అడుగు ముందుకేసి, డీజీపీని కలిసి కాకానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేయడం గమనార్హం. 

టీడీపీ అనుకూల మీడియాలో మొదట జరిగిన ప్రొజెక్షన్‌ ఏంటంటే, కాకాని చేసిన ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చాలని సోమిరెడ్డి, డీజీపీని కోరారని. కానీ, ఇక్కడ జరిగింది వేరు. సోమిరెడ్డి, కాకాని అక్రమాలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇంకేముంది, పోలీసులు రంగంలోకి దిగి, కాకానిపై సోమిరెడ్డి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు కూడా షురూ చేసేశారట. ఆరు బృందాలు అప్పుడే రంగంలోకి దిగాయన్న ప్రచారం జరుగుతోంది. 

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజాతి సహజం. అదే సమయంలో, పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి ఒకలా, విపక్షాలకు ఇంకోలా వ్యవహరించడమూ మామూలే. మొత్తమ్మీద, ఈ ఎపిసోడ్‌లో కాకాని కార్నర్‌ అయిపోయారు. పోలీసులు విచారణలో ఏం తేల్చుతారోగానీ, సోమిరెడ్డి వర్గం ఇప్పుడు ఫుల్‌ ఖుషీగా కన్పిస్తోంది.

Show comments