తమిళ రాజకీయ నేతలకు బోలెడంత ఊరట..!

పరువునష్టం దావా.. ఈ పిటిషన్ ను విచ్చలవిడిగా ఆయుధంగా వాడుకున్న రాజకీయ నేత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ప్రత్యేకించి క్రితం సారి సీఎం అయినప్పటి నుంచి జయలలిత లెక్కకు మించిన స్థాయిలో పరువునష్టం దావాలను వేస్తూ పోయారు. ఎవ్వరు విమర్శలు చేసినా.. పరువు నష్టం దావాలే! ప్రతి ప్రెస్ మీట్ కూ ఒక పరువు నష్టం దావా.. పబ్లిక్ లో ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడినా.. నోటీసులు అందుకోవడానికి రెడీ అయిపోవాల్సిందే.

డీఎంకే చీఫ్ కరుణానిధి, ఆ పార్టీ ముఖ్య నేత స్టాలిన్, డీఎండీకే అధినేత విజయ్ కాంత్, కొంతమంది కాంగ్రెస్ నేతలు, తమిళనాడు కమ్యూనిస్టు పార్టీ నేతలు… ఇది వరకూ జయలలిత తరపు నుంచి దాఖలైన పరువు నష్టం కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రతి రాజకీయ విమర్శకూ పరువు నష్టం దావాలు వేయడం ఒక అలవాటుగా మారడంతో జయలలిత ప్రత్యర్థులకు తంటాలు తప్పలేదు.

రెండు రోజుల కిందట కూడా డీఎండీకే అధినేత విజయ్ కాంత్, ఆయన భార్యలపై తమిళనాడు కోర్టు ఒకటి అరెస్టు వారెంటు జారీ చేసింది. జయలలిత వీరిపై పరువునష్టం దావా వేశారు. ఇలాంటి దావాలేమీ కొత్త కాదు అన్నట్టుగా విజయ్ కాంత్ దంపతులు దాని విచారణ విషయంలో కోర్టుకు హాజరు కాలేదు. దీంతో అంతిమగా అరెస్టు వారెంటు వరకూ వచ్చింది పరిస్థితి. ఇది వరకూ స్టాలిన్ తదితరులు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎన్నో పడ్డారు.

తమపై జారీ అయిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ల పై సుప్రీం కోర్టుకు వెళ్లారు విజయ్ కాంత్ దంపతులు. వీరిపై పరువు నష్టం దావా దాఖలవ్వడం వెనుక రీజన్ ను చూసి సర్వోన్నత న్యాయస్థానం  ఆశ్చర్యపోయింది. రాజకీయ విమర్శలపై ఇలాంటి పిటిషన్ దాఖలైందని తెలిసి కోర్టు తలంటింది. పరువు నష్టం దావాలు రాజకీయ ఆయుధం కారాదని  స్పష్టం చేసింది. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఇన్ని రోజులూ అమ్మ చేతిలో ఆయుధంగా ఉండిన పరువు నష్టం దావాలపై సుప్రీం కోర్టు స్పందన ఆమెకు ఎదురుదెబ్బతగిలినట్టైంది. మరి ఇక నుంచి జయ రాజకీయ ప్రత్యర్థులు తేలికగా ఊపిరి పీల్చుకోవచ్చేమో!  Readmore!

అలాగే రాజకీయ విమర్శలపై , ఆరోపణలపై పరువు నష్టం దావాలు వేసే అలవాటున్న మరో నేత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. ఇది వరకూ ఈయనకు ఇలాంటి వ్యవహారాల్లో చాలా అనుభవమే ఉంది. మరి అలాంటి వారికి కూడా తాజాగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య ఒకింత అసంతృప్తి కలిగించేదే!

Show comments

Related Stories :