సీఆర్డీఏలో బదిలీలు.. అసలు కథేంటి..?

సీఆర్ డీఏ ఏర్పడి సరిగా రెండేళ్లు కాలేదు.. బాబుగారి బృహత్ యజ్ఞం కోసం ప్రత్యేకంగా అధికారులను ఒకచోటకు చేర్చి దీంట్లో నియమించారు. బాబుగారి విజన్ ను అందుకోగల సమర్థులంటూ దీంట్లో నియామకాలు జరిగాయి. రాజధానికి భూ సమీకరణ లో ఈ అధికారులదే కీలక పాత్ర. అత్యంత వివాదాస్పదమైన వ్యవహారం అది. కొన్నివేల రైతుల కుటుంబాలతో కొన్ని లక్షల ఎకరాల భూమిని సమీకరించడానికి పటిష్టమైన టీమ్ ను ఏర్పాటు చేశారు.

ఇప్పటి వరకూ ఈ విషయంలో విజయవంతం అయిన టీమ్ లో అప్పుడే బదిలీలు ఏమిటి? అది కూడా ఐఏఎస్ స్థాయి అధికారులను ఉన్నఫలంగా బదిలీ చేశారెందుకు.. అప్పుడే వారిపై ముచ్చట తీరిపోయిందా? అంటే.. దీని వెనుక ఆసక్తికరమైన అంశాలే వినిపిస్తున్నాయి.  ప్రధానంగా స్విస్ ఛాలెంజ్ అంశం పై బయట పూర్తి స్థాయి చర్చజరగడం.. ఇది పూర్తిగా సింగపూర్ సంస్థల ప్రయోజనాల కు ఉపయోగపడుతుంది.. అసలు రాజధాని ప్రాంత అభివృద్ధికి స్విస్ ఛాలెంజ్ సరైన పద్ధతి కాదు… సుప్రీం కోర్డు పాత డైరెక్షన్లు కూడా స్విస్ ఛాలెంజ్ కు వ్యతిరేకం.. అనే అంశాలపై బయట చర్చ జరగడంలో సీఆర్డీఏలో నిన్నటి వరకూ పనిచేసిన అధికారుల పాత్ర ఉందని బాబు ప్రభుత్వం అనుమానించిందట!

స్విస్ ఛాలెంజ్ లోగుట్టు వారి వల్లనే పూర్తిగా లీకయ్యిందని.. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన పద్ధతితో ఒప్పందాలను కుదుర్చుకోవడం పై చర్చ ప్రజావ్యతిరేకతను పెంచుతోంది.. కాబట్టి ఆ లీకేజీలకు బాధ్యులైన అధికారులను బదిలీ చేశారనే ప్రచారం జరుగుతోంది. 

పాలనా వ్యవహారాల్లో సమర్థుడైన ఒక అధికారిని బదిలీ చేసి.. అతడి కన్నా పదేళ్ల జూనియర్ ను తెచ్చుకోవడం, అది కూడా తెలుగుదేశాధినేత స్వకులస్తుడిని తెచ్చుకోవడంతో ఈ లీలలపై అనేక మంది దృష్టి పడింది. ఈ బదిలీలో పారదర్శకత లేదు.. అత్యంత కీలకమైన రాజధాని వ్యవహారంలో ఏర్పడిన సీఆర్ డీఏ విషయంలో ఇలాంటి బదిలీలు జరగడం ఏమిటి? తన పాలనతో అంతా పారదర్శకంగా ఉంటుందనే బాబు గారు ఇలా చేయడం ఏమిటి? అనే ఆశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి.

Show comments