ఒకటే లుక్కు..రెండు స్కాములు

తెలుగు రాష్ట్రం రెండు ముక్కలయినా, పోలికలు, పరిపాలన, ఇంకా చాలా విషయాల్లో పోలికలు మాత్రం వీడడం లేదు. అసలు ముఖ్యమంత్రుల ఇద్దరి పేర్లలోనూ సారూప్యం వున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ వారసులను నిర్మొహమాటంగా వేదికపైకి తెచ్చేసారు. ఇలా స్టార్టవుతుంది పోలికల జాబితా. ఏకరవు పెడితే చాలా వుంది. ఇప్పుడు స్కాముల విషయంలో కూడా పోలికలు బాగానే వున్నాయి

హైదరాబాద్ లో అతి పెద్ద భూ భాగోతం, అటు విశాఖలో తెలుగుదేశం జనాల భూ భాగోతం రెండూ ఒకేసారి బయటకు వచ్చాయి. హైదరాబాద్ లో టీఆర్ఎస్ తన కంట్రోల్ లోనే స్కాముపై దర్యాప్తు సాగిస్తోంది. అక్కడ చంద్రబాబు కూడా అంతే. తను, తన మంత్రులు కలిసి విశాఖ భూ భాగోతం అంతు చూసే ప్రయత్నంలో వున్నారు.

ఇవి మాత్రమే కాదు ఈ రెండు స్కాములకు చాలా పోలికలు వున్నాయి. తెలంగాణ భూ భాగోతంలో టీఆర్ఎస్, టీడీపీ నాయకులు, టీఆర్ఎస్ సన్నిహితులు వున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖలో జరిగిన భూ భాగోతం అంతా తెలుగదేశం ప్రజా ప్రతినిధుల నిర్వాకమే అని రుజువు, సాక్ష్యాలతో వైకాపా బయటపెడుతోంది.

ఇప్పుడు ఈ రెండు భూ భాగోతాల నుంచి బయపడేందుకు ఆయా ప్రభుత్వాలు కిందా మీదా అవుతున్నాయి. సిఐడి విచారణ, కమిటీలు అంటూ మెల్లగా కాలయాపన చేయడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. పోనీ ఈ వ్యవహారాలు ఏమన్నా చిన్నవా అంటే అదీ కాదు. విశాఖలో వేలాది ఎకరాల రికార్డులే కనిపించడం లేదు. తెలంగాణలో వేలాది ఎకరాలు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి.

అందువల్ల ఈ చిక్కుముడి అసలు, కొసరు అంత సులువుగా అంతుచిక్కేదికాదు. అలా అని చెప్పి ప్రతిపక్షాలు కోరినట్లు సిబిఐ విచారణకు అప్పగించేదీ కాదు. అలా అని సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించేది వుండదు. మరో రెండేళ్లు ఇలా తోసేయడం తప్ప మరో గత్యంతరం వుండదు. పైగా ప్రభుత్వం ఏం చేసినా, చిక్కుముడులు పడిపోయిన ఈ భూ దందాలు అప్పుడే క్లియర్ కావు. కోర్టులు, ఆ పై కోర్టులు వుండనే వుంటాయి.

కానీ ఎటొచ్చీ ఒకటే సమస్య బాధితులు ఎవరైతే వుంటారో వాళ్లు మాత్రమే అధికార పార్టీలకు దూరం అవుతారు. దగ్గరి నాయకుల వల్ల వచ్చే సదుపాయాలతో పోల్చుకుంటే, ఈ దూరమయ్యే ఓట్లు పెద్ద లెక్కలోకి రావు. పోనీ ఈ విషయం జనంలోకి పాకుతుందేమో అన్న భయమూలేదు. ఎందుకంటే మీడియా అంతా మనవాళ్లే కదా. అదీ ధీమా.

Show comments