కాషాయ వాచస్పతిపై 'నాటకాలరాయుడు' ముద్ర...!

రాజకీయాల్లో అత్యున్నత స్థానానికి ఎదిగి, మేధావులుగా, గొప్ప వక్తలుగా పేరు తెచ్చుకునే నాయకులు కొన్ని సందర్భాల్లో ప్రజల దృష్టిలో నాటకాలరాయుళ్లుగా, అబద్ధాలకోరులుగా చెలామణి కావొచ్చు. సాధారణంగా రాజకీయ నాయకులు అబద్ధాలు చెబుతారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయితే కొందరిని అందుకు మినహాయింపుగా భావిస్తారు. కాని అలాంటివారి మీద కూడా 'నాటకాలరాయుడు' అనే ముద్ర పడితే ఏమనుకోవాలి? ప్రస్తుతం కేంద్ర మంత్రి, కాషాయ పార్టీ అగ్రగణ్యుల్లో ఒకడైన 'రాజకీయ వాచస్పతి' వెంకయ్య నాయుడు ఏపీ ప్రజల గౌరవం కోల్పోయేలా వ్యవహరిస్తున్నారేమోననిపిస్తోంది. ఏ విషయంలో? ప్రత్యేకంగా చెప్పేదేముంది? ప్రత్యేక హోదా విషయంలో. 

స్పెషల్‌ స్టేటస్‌ విషయంలో వెంకయ్య ఉద్దేశపూర్వకంగా నాటకాలు ఆడుతున్నారని చెప్పలేం. ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్న తీరు కారణంగా తోలు బొమ్మ మాదిరిగా ఆడటం మినహా మరో మార్గం లేదనుకోవాలి.  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు వెంకయ్యకు మనసులో బాధ ఉండేమోగాని దాన్ని బయటపెట్టలేని నిస్సహాయ పరిస్థితి. ఇష్టమున్నా లేకపోయినా మోదీని సమర్థించాల్సిందే. చిలక పలుకులు పలకాల్సిందే. రాష్ట్రాన్ని విభజించే సమయంలో రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం గట్టిగా పట్టుబట్టింది వెంకయ్య నాయుడే. ఆయన ఏపీ నాయకుడు కాబట్టి ఈ విషయంలో పార్టీ ఆయన్నే ముందుకు తోసింది. అందులోనూ మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల వాచస్పతి కదా...!  

ప్రధాని మన్మోహన్‌ ప్రత్యేక హోదా ఐదేళ్లు అంటే కాదు...కాదు పదేళ్లు ఇవ్వాల్సిందేనన్నారు. ఒకవేళ మీరివ్వకపోతే అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి అమలుచేస్తామన్నారు. ఇదే విషయాన్ని మోదీ, వెంకయ్య ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఘంటాపథంగా చెప్పారు. అంతే...! అధికారంలోకి వచ్చాక సీన్‌ రివర్సయింది. ఆనాడు రాజ్యసభలో గట్టిగా మాట్లాడింది వెంకయ్యే కాబట్టి హామీ నెరవేరకపోవడంతో ఆ ప్రభావం ఆయన మీద ఎక్కువగా పడింది. అదీకాకుండా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పెట్టలేదు కాబట్టి ఇప్పుడేం చేయలేమని అనేకసార్లు ముప్పవరపువారు అనేకసార్లు ముద్దుగా చెప్పారు. 

విభజన సమయంలో మాత్రం 'ముందు మీరు బిల్లు ఆమోదించండి. ప్రత్యేక హోదా సంగతి మేం చూసుకుంటాం' అన్నారు. కొన్నిసార్లు హోదా అంశంపై నీతి ఆయోగ్‌ కసరత్తు చేస్తోందన్నారు. దాని నివేదిక వచ్చాక ఇస్తామన్నారు. కొన్నిసార్లు పద్నాలుగో ఆర్థిక సంఘం అంగీకరించడంలేదన్నారు. ఆనాడు రాజ్యసభలో వెంకయ్య పాత్ర లేనట్లయితే ఏపీ ప్రజల దృష్టిలో ఆయన పాపాత్ముడు కాకపోయేవాడేమో...! మాటల చాతుర్యం బాగా ఉన్న ఈ నెల్లూరు నాయకుడు ప్రజలను మభ్యపెట్టడంలో తన వంతు పాత్రను అద్భుతంగా పోషించారు. 

తాజా సమాచారమేమిటంటే...ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదన్న వెంకయ్య మొన్న రాజ్యసభలో చర్చ, పార్లమెంటులో టీడీపీ నిరసన తరువాత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కలిసి 'ఆంధ్రకు ప్రత్యేక హోదా ఎందుకివ్వరు?' అని వాదన వేసుకున్నారట...! ఇవ్వడం ఎందుకు కుదరదో కారణం కూడా చెప్పాలన్నారట...! హోదా ఇవ్వడానికి ఆర్థిక సంఘంతో, దాని సిఫార్సులతో పనిలేదని జైట్లీకి చెప్పారు. జైట్లీ తనకున్న బాధలు, పరిమితులు చెప్పుకున్నా వెంకయ్య వినకుండా విభజన కారణంగా నష్టపోయిన ఏపీకి అన్నివిధాల సాయం చేయాల్సిందేనని గట్టిగా చెప్పారు. 

ఆయన ఎందుకిలా టర్న్‌ అయ్యారు? ఏపీలో వేడెక్కిన రాజకీయ వాతావరణమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. ఏపీ ప్రజలను 'ఇద్దరు నాయుళ్లు' కలిసే మభ్యపెట్టారు. సభల్లో ఇద్దరూ ఒకరినొకరు ప్రశంసించుకునేవారు. కాని చంద్రబాబు నిరసన గళం వినిపించేసరికి తాను ఒంటరి అయ్యానని వెంకయ్య ఫీలవుతున్నారేమో...! ఇంతకాలం బాబు కూడా ప్రత్యేక హోదాపై పది రకాలుగా మాట్లాడి నాటకాలు ఆడటంతో వెంకయ్యకు ఇబ్బంది కాలేదు. ఈయన ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన ప్రజాప్రతినిధి కాకపోయినా, ప్రస్తుతం మరో రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నా ఏపీ ప్రజలు తమను మోసం చేసినవారి జాబితాలో ఈయన పేరూ చేర్చుకుంటారు. దీంతో హోదాపై నాటకాలాడిన నాయకుడిగా నిలిచిపోతారు. 

Show comments