అజిత్‌.. మౌనమేలనోయీ.!

అసలు అజిత్‌కీ, రాజకీయాలకీ ఏంటి సంబంధం.? తమిళనాడులో జయలలిత మరణానంతరమే కాదు, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడూ సినీ నటుడు అజిత్‌ పేరు తెరపైకి వచ్చింది. జయలలిత రాజకీయ వారసుడు అజిత్‌.. అంటూ ప్రచారం జరిగింది. దాన్ని అజిత్‌ ఇప్పటిదాకా ఎప్పుడూ ఖండించలేదు. 

నిజానికి, 'రాజకీయాలపై నాకు పెద్దగా ఆసక్తి లేదు.. అలాగని రాజకీయాలంటే ఇష్టం లేదని కాదు.. రాజకీయాల్ని ఫాలో అవుతుంటాను.. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించను.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలని మాత్రం చెబుతాను.. సినిమా కెరీర్‌పై పూర్తి సంతృప్తితో వున్నాను.. నటుడిగా కెరీర్‌లో ఇంకా ఉన్నతమైన శిఖరాల్ని అధిరోహించాలి..' అంటూ చాలా సందర్భాల్లో రాజకీయాలపై స్పందించాడు అజిత్‌. 

తమిళనాడులో రాజకీయాలు చిత్రంగా వుంటాయి. కొత్త రాజకీయ పార్టీ పెడతాడనుకున్న రజనీకాంత్‌, రాజకీయ పార్టీ పెట్టలేదు.. బీజేపీతో ఆయన సన్నిహితంగా వుంటాడు.. కాంగ్రెస్‌తోనూ అంతే. రుణానిధి అన్నా రజనీకాంత్‌కి ఇష్టం. జయలలిత అంటే అదే అభిమానం. రజనీకాంత్‌ మాత్రమే కాదు, చాలామంది నటీనటుల పరిస్థితి ఇంతే. రాజకీయాల్లో వున్నవారు మాత్రం, ఓ పార్టీకి ఫిక్సయిపోవడం మామూలే. 

అజిత్‌ కూడా, జయలలితకు అత్యంత సన్నిహితుడు.. అలాగని ఇతర పార్టీలకు విరోధి కాదు. జయలలిత మరణం గురించి తెలుసుకున్న అజిత్‌, బల్గేరియా నుంచి హుటాహుటిన చెన్నయ్‌కి వచ్చాడు.. జయలలిత సమాధి వద్ద భార్యతో కలిసి ఘనంగా నివాళులర్పించాడు. ఈ సందర్భంగా, రాజకీయాలపై స్పందించమని మీడియా అడిగితే, సింపుల్‌గా 'నో కామెంట్‌' అనేశాడు. కానీ, తమిళ రాజకీయ వర్గాల్లో మాత్రం, జయలలితకు వారసుడు అజిత్‌ మాత్రమేనని ప్రచారం జరుగుతోంది. 

రాజకీయాల గురించి స్పందించడానికి అజిత్‌కి ఇంతకు మించిన సందర్భం ఇంకోటి దొరకదు. రాజకీయాలపై ఆసక్తి వుందా.? లేదా.? జయలలిత వారసుడన్న ప్రచారంలో నిజమెంత.? అన్నాడీఎంకే పార్టీ పగ్గాల్ని అజిత్‌ స్వీకరిస్తారా.? లేదా.? ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పి తీరాల్సిందే. మౌనం, నో కామెంట్‌.. ఇవేవీ అజిత్‌పై వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు కానే కావు.

Show comments