'పవర్‌' చూపించిన కేసీఆర్‌

అధికార పార్టీకి సంబంధించిన బహిరంగ సభలు ఎలా వుంటాయ్‌.? ఒకప్పుడు చంద్రబాబు హయాంలో హైద్రాబాద్‌లో జరిగిన మహానాడు.. అప్పట్లో ఓ చరిత్ర. ఇప్పుడు వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ కూడా ఓ చరిత్రే. 16 ఏళ్ళ పండుగని టీఆర్‌ఎస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలోని అన్ని గ్రామాల్లోంచీ జనాల్ని రప్పించేలా 'వ్యూహం' రచించింది. మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా జనం వరంగల్‌ బహిరంగ సభకు తరలివచ్చారు. 

జనం.. జనం.. ఎటు చూసినా జనం. ఒక్క మాటలో చెప్పాలంటే, వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన బహిరంగ సభా ప్రాంగణమంతా జన సంద్రాన్ని తలపించింది. అధికారం చేతిలో వుంది గనుక, అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదు టీఆర్‌ఎస్‌. ప్రభుత్వ యంత్రాంగమంతా అక్కడే మోహరించిందా.? అన్నట్టు కన్పించిందక్కడి పరిస్థితి. ఎక్కడా ఏ చిన్న అపశృతీ దొర్లకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం గమనార్హమిక్కడ. అదే సమయంలో, సభకి వచ్చినవారెవరూ నిరాశ చెందకుండా పక్కా ఏర్పాట్లు జరిగాయి. ఆ రకంగా, టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పొచ్చు. 

సైకిళ్ళ దగ్గర్నుంచి ఎడ్ల బళ్ళదాకా.. టూ వీలర్ల నుంచి పెద్ద పెద్ద లారీలదాకా.. ఎలా కుదిరితే అలా, వాహనాల్లో జనం తరలి వచ్చేశారు. అలా వచ్చేందుకు వీలుగా స్థానిక నేతలు 'ప్లాన్‌' చేశారు. ముఖ్య నేతలంతా 'కూలీ' చేసి, లక్షలకు లక్షలు సంపాదించేశాక, ఈ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, కేసీఆర్‌ షరామామూలుగానే తెలంగాణకు ఏం చేశారో చెప్పారు, ఏం చేయబోతున్నారో చెప్పారు. అన్నిటికీ మించి విపక్షాలకు అల్టిమేటం ఇచ్చేశారు. 'చెవులు కోసుకుంటామన్నారు.. ఇంకేదో కోసుకుంటామన్నారు.. 2019 ఎన్నికల్లోనూ అధికారం మనదే, ఏమేం కోసుకుంటారో చూద్దాం..' అంటూ తనదైన స్టయిల్లో కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అంతేనా, తన ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్‌ 'దద్దమ్మ' అంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఓవరాల్‌గా కేసీఆర్‌, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ బహిరంగ సభలో తన 'పవర్‌' చూపించేశారన్నది నిర్వివాదాంశం.

Show comments