ధూళిపాళ్ళ దీక్షకు బాబు అనుమతిచ్చారా.!

'ప్రత్యేక హోదాపై దీక్షలు చేస్తే జనం నమ్మే పరిస్థితుల్లో లేరు..' అని టీడీపీ నేతలే వెటకారం చేస్తారు.. అదే టీడీపీ నేతలు, ప్రత్యేక హోదా కోసం దీక్షలు, ఆందోళనలు చేస్తామంటారు. అంతే అది తెలుగుదేశం పార్టీ.. ఆ పార్టీ నేతలు ఎలాగైనా మాట్లాడొచ్చు.. ఏమైనా అనొచ్చు.! 

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్‌ వేదికగా ఆందోళనలు చేపట్టారు. ఓ సారి నిరాహార దీక్ష కూడా చేశారు. ఢిల్లీలోనూ జగన్‌ పోరాటం చేసిన విషయం విదితమే. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ బంద్‌కి పిలుపునిచ్చింది. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఇచ్చిన బంద్‌ పిలుపుకి మంచి స్పందన వస్తోంది. 

'ప్రత్యేక హోదా కోసం పోరాటం గల్లీలో కాదు. ఢిల్లీలో చెయ్యాలి.. జగన్‌ సహా వైఎస్సార్సీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో దొంగ దీక్షలు మానుకోవాలి..' అంటూ టీడీపీ నేతలు ఇప్పుడు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఔను మరి, జగన్‌ చెయ్యకూడదు.. టీడీపీ నేతలే చెయ్యాలి. అధికారంలో వున్నదీ వాళ్ళే, ఆందోళన చేసేదీ వాళ్ళే. వాట్‌ ఏ పిటీ.! 

టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ళ నరేంద్ర, తాజాగా ఈ రోజు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష (ఒక్కరోజే లెండి.. అది కూడా ఉదయం నుంచి సాయంత్రందాకా..) ప్రారంభించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు.. అంటూ నినదించేశారు ధూళిపాళ్ళ నరేంద్ర. టీడీపీ శ్రేణులు పెద్దయెత్తున ఆయనకు మద్దతు పలికేందుకు వెళ్ళాయి కూడా. అంతా బాగానే వుందిగానీ, ధూళిపాళ్ళ ఢిల్లీలో దీక్ష చేయకుండా, ఆంధ్రప్రదేశ్‌లో దీక్ష ఎందుకు చేస్తున్నట్లు.? 

ఓ పక్క, వైఎస్సార్సీపీ సహా కాంగ్రెస్‌, వామపక్షాలు ఇచ్చిన బంద్‌ పిలుపుకి జనం స్వచ్ఛందంగా మద్దతిస్తోంటే, బంద్‌ని అణచివేయడానికి ప్రభుత్వం తరఫున ప్రయత్నాలూ జోరుగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ధూళిపాళ్ళ నరేంద్ర దీక్షకు మాత్రం పోలీసులు పరోక్షంగా సహకరిస్తున్నారు. అంతే మరి, ఎంతైనా అధికార పార్టీకి చెందిన నేత కదా.! ఇంతకీ, ధూళిపాళ్ళ నరేంద్ర దీక్షకు అనుమతి వుందా.? లేకపోవడమేంటి.. చంద్రబాబే కదా.. దీక్ష వైపు ఆయన్ని ఉసిగొల్పింది. ఈ కుయుక్తులన్నీ వైఎస్సార్సీపీ ఆందోళనల్ని పలుచన చేయడానికే.

Show comments