అడవులు నరకాలని చంద్రబాబు ఆరాటం...!

తెలంగాణను 'ఆకుపచ్చ తెలంగాణ' చేయాలని, చెట్లు లేనిదే వానలు కురవ్వని, దండిగా చెట్లుంటేనే తెలంగాణ బతుకుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ ఎత్తున 'హరితహారం' కార్యక్రమం చేపడితే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వేల ఎకరాల్లో అడవులు నరకడానికి ఆత్రపడిపోతున్నారు. హరితహారం ఎంతవరకు విజయవంతమైతుందో (నాటిన మొక్కలన్ని బతికి చెట్లుగా మారడం) చెప్పలేంగాని కేసీఆర్‌ లక్ష్యాన్ని, నిబద్ధతను అభినందించాలి. ఆయనకున్న చిత్తశుద్ధి అధికారులకు, మంత్రులకు, పార్టీ శ్రేణులకు మాత్రమే కాకుండా ప్రజలకూ ఉండాలి. 

సరే...ఈ విషయం అలావుంచితే చంద్రబాబు భూసేకరణ లేదా భూసమీకరణ ఇప్పట్లో ఆగేలా లేదు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 34 వేల ఎకరాలకు భూమిని సర్కారు సేకరించింది. కాని ఇది చాలదు. ఇంకా...ఇంకా కావాలంటోంది ప్రభుత్వం ఎంత కావాలి? మరో 40 వేల ఎకరాలు (గతంలో 35 వేల ఎకరాలని ఓ ఆంగ్ల పత్రిక రాసింది) కావాలి. ఇప్పటికే రైతులకు రకరకాల ఆశలు చూపించి, బెదిరించి, నయానో భయానో వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వానికి ఇంక రైతులెవరూ భూములిచ్చే పరిస్థితి లేదు. ఈ భూమే రాజధానికి ఎక్కువని కొందరు నిపుణులు చెబతున్నారు. 

కాని బాబు సర్కారు ఆగడంలేదు. ఎందుకు?  బాబు ప్రపంచ దేశాలన్నీ పర్యటిస్తూ అక్కడి పెట్టుబడిదారులను పరిశ్రమలు, కంపెనీలు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని విదేశీ ప్రభుత్వాలను అభ్యర్ధిస్తున్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలను రమ్మంటున్నారు. దేశంలోని ప్రయివేటు యూనివర్శిటీలను ఆహ్వానిస్తున్నారు. బడా కార్పొరేట్‌ ఆస్పత్రులకు రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నారు. వీళ్లంతా తాము ఏపీకి రావాలంటే వందల ఎకరాల భూములు అడుగుతున్నారు. వీరంతా రావడమే మహాప్రసాదమని అనుకుంటున్న చంద్రబాబు 'మీకెందుకు...ముందు రండి. కోరినంత భూమి ఇస్తాం' అని అభయమిస్తున్నారు. 

కాని భూమి ఎక్కుడుంది? అని మనలాంటివాళ్లం అనుకుంటాం. కాని బాబు కళ్లు అడవుల మీద పడ్డాయి. రాజధాని ప్రాంతం చుట్టుపక్కల కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో  దట్టమైన అడవులున్నాయి. ఈ అడవులు సీఆర్‌డీఏ పరిధిలోకే వస్తాయట. అడవుల వల్ల ఏం ఉపయోగం? ముందు పెట్టుబడిదారులొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యం కదా అనుకొని అడవులను నరికేయాలని (డీనోటిఫై చేయాలని) నిర్ణయించుకున్నారు. కాని ఆయన అనుకోగానే సరిపోతుందా?  అడవులు నరకాలంటే కేంద్ర అటవీ శాఖ అనుమతి ఇవ్వాలి. 

ఇష్టమొచ్చినట్లుగా అడవులు నరికేయడం, కొండలు తొలిచేయడంవంటి విపరీతపు చేష్టల కారణంగానే ప్రపంచం సర్వనాశనమైపోతోందని పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు, శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు.  దీంతో వేల ఎకరాల్లో అడవులు నరకడం సమంజసం కాదని కేంద్రం భావించిందేమో బాబు అభ్యర్థనను మొన్నటివరకు అటవీ శాఖ మంత్రిగా ఉన్న ప్రకాశ్‌ జవదేకర్‌  పెండింగులో పెట్టారు. ఇప్పుడు కొత్త అటవీ శాఖ మంత్రిగా అనిల్‌ దవే నియమితులయ్యారు. దీంతో కేసును ఈయన దగ్గరకు తీసుకుపోయారు. 

ఒకచోట అడవులు నరికితే మరోచోట అదే విస్తీర్ణంలో అడవులు పెంచాలనే నిబంధన ఉంది. కేంద్రం రాష్ట్రాన్ని ఈ విషయమై అడిగినప్పుడు ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో అడవులు పెంచుతామంది. కాని కేంద్రం ఎందుకో అడవులను డీనోటిఫై చేయడానికి తాత్సారం చేస్తోంది. అడవుల పెంపకంలో ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏపాటిదో దేశ ప్రజలకు అనుభవమే. వేల ఎకరాల్లో అడవులను నరకాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులకు, సామాజికవేత్తలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

ఈ అడవుల్లో విలువైన అరుదైన వృక్ష సంపద, జంతుజాలం, పక్షి జాతులు, అనేక వన్యమృగాలున్నాయి. అడవులు నరికేస్తే వృక్ష సంపద నశించడమే కాకుండా, జంతుజాలం, పక్షిజాతులు తీవ్ర ప్రమాదంలో పడతాయి. ఇక కేంద్రం అటవీభూమిని ఎలా ఉపయోగిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగింది. ముందు అడవులను డీనోటిఫై చేయండి. ఏడాది తరువాత మాస్టర్‌ ప్లాన్‌ ఇస్తామని చెబుతోంది. ఆ అటవీ భూమిలో ఏఏ పరిశ్రమలు పెడతారో, ఏఏ సంస్థలు ఏర్పాటు చేస్తారో పూర్తి వివరాలివ్వాలని కేంద్రం పట్టుపడుతోంది. కాని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదంటోంది. మరి కొత్త మంత్రి ఎలా వ్యవహరిస్తారో చూడాలి. 

Show comments