కడియం సీటు కిందకు నీళ్లు?

తెలంగాణలో రెండో సారి మంత్రుల వికెట్లు పడే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి. మొదటి సారి ఉపముఖ్యమంత్రి రాజయ్యపై వేటు పడగా ఇప్పుడు అదే స్థానాన్ని ఆక్రమించిన విద్యాశాఖా మంత్రి, ఉపముఖ్యమంత్రి అయిన కడియ శ్రీహరిపై వేటు పడుతుందా అన్నది చిన్న అనుమానంగా వుంది. వరంగల్ కు చెందిన టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరినప్పుడే కడియం శ్రీహరిపై ఎప్పటికైనా వేటు పడుతుందని ఊహాగానాలు వినిపించాయి. 

కాని అలా చేస్తే అప్పట్లో రాజయ్యను తొలగించినప్పుడు దళిత సామాజిక వర్గం నుంచి కేసీఆర్ విమర్శులు ఎదుర్కున్నారు. ఇప్పుడు కూడా అదే వర్గానికి చెందిన కడియంను తొలగించడం, అది కూడా కేసీఆర్ తన సామాజిక వర్గానికి చెందిన దయాకర్ రావు కోసం చేస్తే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతాయని కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే కేసీఆర్ అదృష్టాన్ని నడుముకుని చుట్టుకుని తిరుగుతున్నారు.

 రానేరాదన్న తెలంగాణ సాధన దగ్గర నుంచి ఇఫ్పటి వరకు ఆయన ఏది అనుకుంటే అది అయిపోతూ వస్తోంది. కాగల కార్యాన్ని గంధర్వులే నెరవేర్చారు అన్నట్లుగా ఉంది కేసీఆర్ వ్యవహారం. ఇప్పుడు కడియం విషయంలోనూ అదే జరిగింది. విద్యాశాఖపై గత కొంత కాలంగా రాష్ట్రంలో పలువర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇవేం పాఠశాలలు, ఇంత దారుణమా అంటూ సుప్రీం కోర్టే చీవాట్లు పెట్టి సంస్కరించాలని ఆదేశించింది. ఇలా కడియం శాఖపై ఆయన నిర్వహణ తీరుపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కడియం చుట్టూ తప్పించుకోలేనంత ఉచ్చు చుట్టుకుంది. 

ఎంసెట్ 2 లీకేజీ బహిర్గతం కావడం, ఎంసెట్ 1 కూడా లీకేజీ అయినట్లు వార్తలు వెలుబడుతున్నాయి. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలతో పాటు పలు సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖపైనే విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్నే ఎండగడుతూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంలో నైతిక భాద్యత వహించి మంత్రి కడియం తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని పట్టుపడుతున్నారు. 

ఈ తరుణంలో కడియం రాజీనామా చేయడమో, లేదా ఆయనను ఈ వ్యవహారానికి బాధ్యుడిని చేసి ముఖ్యమంత్రే ఆయనను తొలగించడమో చేయాలి. లేకపోతే ఈ అపవాదు కేసీఆర్ భరించాల్సి వస్తుంది. నిజానికి ఎంసెట్ లీకేజీలో కడియంతో పాటు దాదాపు అంతే తప్పును మూటగట్టుకున్నాడు వైద్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డి. ఇప్పటికే తప్పు తమది కాదు మీదంటే, మీదని కడియంకు లక్ష్మారెడ్డికి మధ్య వివాదం రగులుతోంది. 

ఈ తరుణంలో కడియం ఒక్కనిపైనే వేటు వేస్తే దళితుడు కాబట్టి వేసాడు, లక్ష్మారెడ్డి అగ్రకులానికి చెందిన వారు కాబట్టి వేయలేదు అని దళిత సంఘాలు విమర్శించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వేస్తే ఇద్దరిపైనా వేయాలి లేదూ అంటే లేదు.  ఈ విషయంలో మరి కొద్ది రోజుల్లో  క్లారిటీ రావచ్చు.

Show comments