తెలంగాణకి భద్రాద్రి ఎలా దక్కిందంటే.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఎందుకు రెండుగా విడిపోయింది.? ఆ విభజన వెనుక శాస్త్రీయత ఏంటి.? అసలు ఈ విభజన వెనుక కారణమేంటి.? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే అదో పెద్ద ప్రసహనం. తెలంగాణ వాదుల దృష్టిలో అది చారిత్రక అవసరం. సమైక్యవాదుల దృష్టిలో అదొక పాశవిక రాజకీయ చర్య. 

తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ ఏర్పడింది. ఇందులో ఇంకో వాదనకు తావు లేదు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ సర్వనాశనమయ్యింది. అంటే, 13 జిల్లాల్ని చంపేసి, 10 జిల్లాలకు స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పడం సబబేమో.! ఇంత కటువుగా ఎవరన్నా మాట్లాడితే, తెలంగాణ వాదులకు కోపం రావొచ్చుగాక. కానీ, బాధితుల ఆవేదన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 

అయితే, విభజన విషయంలో కాంగ్రెస్‌ అనుసరించిన వైఖరిని మాత్రం చరిత్ర క్షమించదుగాక క్షమించదు. విభజన సందర్భంగా ఇరువురికీ న్యాయం చేయడం సాధ్యం కాదని కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికీ సన్నాయి నొక్కులు నొక్కుతూనే వున్నారు.. పుండు మీద కారం చల్లిన చందాన. తాజాగా, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు విభజన విషయంలో. 

తెలంగాణకు భద్రాద్రి (భద్రాచలం) ఎందుకు కేటాయించాల్సి వచ్చిందన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, భద్రాచలం అభివృద్ధికి నిజాం కృషి చేశారు గనకనే.. అని చెప్పుకొచ్చారు జైరాం రమేష్‌. ఫలానా వ్యక్తి ఫలానా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే, దానికి వీలుగా ఆ ప్రాంతాన్ని ఇష్టమొచ్చినట్లు రాసిచ్చేయొచ్చా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందిక్కడ. భద్రాచలంలో రాములోరి దేవస్థానం మినహా ఏం అభివృద్ధి జరిగిందో జైరాం రమేష్‌కే తెలియాలి. 

భద్రాచలం ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనిది. ఇది జగమెరిగిన సత్యం. చరిత్రను చింపేయడానికి వీల్లేదు. అయ్యిందేదో అయిపోయింది. భద్రాచలం విషయంలో ఇప్పుడిక పంచాయితీకి తావు లేదు. భద్రాచలం తెలంగాణలో వుంది. ముంపు ప్రాంతం పేరుతో కొంత భాగం ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. ఆ కలిసిన భాగం కూడా ఒకప్పుడు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడకముందు) తూర్పుగోదావరి జిల్లాలోనిదే. విభజన జరిగిపోయాక, తెలుగు ప్రజలంతా సఖ్యతతో వుంటున్న సమయంలో, జైరాం రమేష్‌ ఈ వింత వాదనలు తెరపైకి తీసుకురావడం వెనుక ఉద్దేశ్యమేంటి.? 

అన్నట్టు, విభజన ప్రక్రియలో జైరాం రమేష్‌దే కీలక పాత్ర. విభజన చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌లో, ఆ విభజన సక్రమంగా చేయనందుకు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని ఓటర్లు పాతరేసేశారు. అయినా, కాంగ్రెస్‌ నేతలకు తత్వం బోధపడ్డం లేదు. తెలుగు ప్రజల విషయంలో కాంగ్రెస్‌ ఎందుకు ఇంకా విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తోందో ఏమో.!

Show comments