దటీజ్.. చంద్రబాబు

ఆంధ్ర చీఫ్ మినిస్టర్ గా కన్నా, తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు భలే చతురుడు. ఒకేసారి వంద వ్వవహారాలతో బ్లైండ్ ఫోల్డ్ ఆడేయగలరు. కానీ ఒక్క ఎత్తును కూడా అవతలి వారు పసిగట్టలేరు. పొరపాటున ఎత్తు బయట పడిపోతోంది అనిపిస్తే, తమ వార్తలతో దాన్ని కప్పిపుచ్చేయడానికి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రెడీ గా వుంటుంది.

అమరావతి..నవ్య రాజధాని..సెక్రటేరియట్ నిర్మాణ..ఆఘమేఘాలు..రాజధాని తరలింపు వంటి వాటి వెనుక ఎన్ని అనుమానాలో? అయినా బాబు ఎత్తేమిటో ఇంతవరకు ఎవరికైనా అర్థం అయిందా? అబ్బే కాదు కాక కాదు.

విజయవాడ, మంగళగిరి, గన్నవరం, గుంటూరుల్లో ఆఫీసులు ఏర్పాటు చేయడమే రాజధాని తరలింపు అంటే ఆఘమేఘాల మీద సెక్రటేరియట్ కట్టడం ఎందుకు?  దానికి కూడా ఏదో ఒక బిల్డింగ్ అద్దెకు దొరకదా? గన్నవరం దగ్గర మేథాటవర్స్ వుండనే వుందిగా?

సరే, హైదరాబాద్ లో వుండిపోయిన మన అధికారులంతా, ఉద్యోగులంతా ఆంధ్రకు వచ్చేయండి..హెఆర్ఎ పెంచుతాం..పని దినాలు తగ్గిస్తాం..ఇంకా చాలా చేస్తాం..అన్నింటికి మించి ఇప్పుడు వస్తేనే స్థానికత ఇస్తాం..అనేసారు. అనేసి ఊరుకున్నారా? ఈ స్థానికత కు సంబంధించిన వ్యవహారం కేంద్రానిది కాబట్టి, ఏకంగా రాష్ఠ్రపతి నుంచి ఆఘమేఘాల మీద ఆదేశాలు తెప్పించారు. 

అంతవరకు ఆఘమేఘాలు (ఈ ఆఘమేఘాలు అన్న పదం బాబుగారికి చాలా ఇష్టం. ఆయనకు పనులు అలాగే జరగాలి) గానే జరిగింది అంతా. కానీ రాష్ఠ్రపతి ఆదేశాలకు అనుకుణంగా రాష్ట్రపభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వాలి. కానీ, అది మాత్రం జరగలేదు ఇంతవరకు. కేంద్రం నుంచి ఆఘమేఘాల మీద ఆదేశాలు రప్పించిన బాబు, తన ప్రభుత్వం ఇవ్వాల్సిన మార్గదర్శకాలను ఎందుకు ఆఘమేఘాల మీద ఇవ్వలేదు..ఇవ్వడం లేదు?

అక్కడే వుంది ఏదో ఎత్తుగడ. బహుశా ఉద్యోగసంఘాల నాయకులతో లోపాయికారీ రాజీ ఫార్ములా. ఇప్పుడే మార్గదర్శకాలు ఇస్తే, పిల్లల్ని ఫ్యామిలీలను ఇప్పుడే తరలించి, ఇక్కడి స్కూళ్లలో, కాలేజీల్లో చేర్పించాలి. చాలా మందికి హైదరాబాద్ చదువు కావాలి..ఆంధ్ర లోకల్ కావాలి. అందువల్ల మార్గదర్శకాలు ఒక్క నెల లేటు చేస్తే, మరి ఈ ఏడాదికి అడ్మిషన్లు అయిపోయయి. 

వచ్చే ఏడాది చూసుకుందాం అనొచ్చు. ఏదో ఒంకన ఉద్యోగులను ఆఘమేఘాల మీద ఇక్కడకు తరలించాలన్నది బాబు ఆలోచన కావచ్చు కానీ, వారి ఫ్యామిలీలను కాదేమో? ఫ్యామిలీలు వచ్చేస్తే, ఇక్కడ హోటళ్లు, కర్రీ పాయింట్లు, రెస్టారెంట్లకు బేరాలు ఎలా? బహుశా ఆ దిశగా కూడా బాబు ఆలోచన చేస్తున్నారేమో? అందుకే అప్ డౌన్ కు వీలుగా హైదరాబాద్-విజయవాడకు ట్రయిన్ కూడా వేయించారు కదా?

ఇలా ఆలోచిస్తే చాలా తడతాయి. కానీ ఏది బాబు బుర్రలో ఆలోచన మాత్రం తెలియదు. ఎందుకంటే అలా తెలిసిపోతే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.

Show comments