నారావారి శాసనసభ.!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎక్కడ.? రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాలేదెందుకు.? కనీసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా కన్పించలేదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి.. ఇంకొందరు ప్రముఖులు.. ఇంతేనా.?

పండగ చేయాల్సిన చోట తుస్సుమనిపించడం.. అవసరం లేని చోట పండగ చేయడం.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారికి అలవాటే. అప్పుడెప్పుడో విజయదశమినాడు అమరావతికి శంకుస్థాపన 'ఈవెంట్‌'ని ఘనంగా నిర్వహించేశారు. దానికి ప్రధాని నరేంద్రమోడీ వచ్చారు. కోట్లు ఖర్చయ్యాయి ఆ ఈవెంట్‌ కోసం. అంత ఖర్చు అవసరమా.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తే, ప్రధాని నరేంద్రమోడీ చెంబుడు నీళ్ళు, గుప్పెడు మట్టి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌ మొహాన కొట్టారు. సిగ్గు సిగ్గు.. అని జనం అనుకున్నాసరే, చీమూ నెత్తూరూ లేదన్నట్టు ఆ అవమానాన్ని లైట్‌ తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.


శంకుస్థాపనకు అలా.. ప్రారంభోత్సవానికి ఇలా.!

శంకుస్థాపన చిన్న ఈవెంట్‌.. ప్రారంభోత్సవం పెద్ద ఈవెంట్‌. అది కూడా తెలియని చంద్రబాబు, ముఖ్యమంత్రి ఎలా అయ్యారట.? శాసనసభ, శాసనమండలి ప్రారంభోత్సవం అత్యంత పేలవంగా జరిగింది. చంద్రబాబు, కోడెల, చక్రపాణి, పలువురు మంత్రులు, టీడీపీ నేతలు చిన్నపాటి హడావిడి చేశారు. నామ్‌ కే వాస్తే అక్కడో బహిరంగ సభ. ఇదంతా ప్రభుత్వ కార్యక్రమంలా కాదు, ప్రైవేటు కార్యక్రమంలా జరిగింది. అవును, ఇదేదో నారా చంద్రబాబునాయుడు ఇంట్లో ఫంక్షన్‌ అన్నట్లే నిర్వహించారు. ఇంట్లో ఫంక్షన్లకైనా, ప్రతిపక్ష నేతను ఆహ్వానిస్తారేమో.! ప్రతిపక్ష నేతని ఆహ్వానించకుండా రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభోత్సవమేంటట.? నవ్విపోదురుగాక మనకేటి.? అన్న చందాన వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ విషయంలో. 'ప్రతిపక్షం నుంచి ఎవరో ఒకరైనా వచ్చి వుంటే బావుండేది.. పిలిచినా ఎందుకు రాలేదో అర్థం కావడంలేదు..' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించేశారు. మంత్రి యనమల రామకృష్ణుడుగారిదీ ఇదే దారి.


ప్రతిపక్షానికి పిలుపు ఇలాగేనా.?

అసెంబ్లీ కార్యదర్శి ద్వారా ప్రతిపక్షానికి సమాచారమిచ్చారట. విపక్షాల్నీ ఆహ్వానించేశారట. ఎలా.? అనడక్కండి. ఫోన్‌ చేసి, రమ్మని చెప్పారట. అలాగని, అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి నివేదిక ఇచ్చారు. ఇదెక్కడి చోద్యం.? ఐదు రూపాయలు ఖర్చు చేస్తే, ఓ ఆహ్వాన పత్రిక వచ్చేస్తుంది. ప్రతిపక్ష నేత కోసం ఆ మాత్రం ఖర్చు చేయలేరా.? మంత్రుల బృందాన్ని ప్రతిపక్ష నేత వద్దకు పంపి వుంటే, ఆ గౌరవం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, తద్వారా ప్రభుత్వాధినేత చంద్రబాబుకే దక్కి వుండేది. కానీ, ఆయన అలా చేయలేదు. ప్రతిపక్ష నేతను పిలవకుండా అసెంబ్లీ ప్రారంభోత్సవమేంటి.? అని అంతా విమర్శించేసరికి, తప్పిదాన్ని అధికారుల మీదకు నెట్టేయడానికి, ముఖ్యమంత్రి నివేదిక తెప్పించుకున్నారట. 'ప్రతిపక్షాన్ని పిలిచారా లేదా.?' అని ఒక్క రోజు ముందయినా, వారిని ముఖ్యమంత్రి ప్రశ్నించి వుండాలి. ప్రశ్నించలేదంటే, దానర్థం చంద్రబాబుకి ప్రతిపక్ష నేత అసెంబ్లీ ప్రారంభోత్సవంలో కన్పించడం ఇష్టం లేదనే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయినా, అమరావతి శంకుస్థాపనకే ప్రతిపక్ష నేత రాలేదు.. పిలిచినా లెక్క చేయలేదు.. అనేసి, ఇప్పుడు అధికార పార్టీ బుకాయిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?


అమరావతి.. ఆత్మగౌరవం.. అంటే.!

అమరావతి అంటే ఆత్మగౌరవమట. అది నిజమే, అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మగౌరవం. దురదృష్టవశాత్తూ అమరావతితో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సంబంధం లేకుండా పోతోంది. ముఖ్యమంత్రి, అధికార పార్టీ నేతలు ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌లా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రారంభోత్సవాన్ని జరిపేస్తే, ఇక అమరావతి - ఆత్మగౌరవం అన్న మాటలో అర్థం వెతకడం అసాధ్యం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మొదటి నుంచీ అమరావతిపై అనుమానాలున్నాయి. అది ప్రజా రాజధాని కాదు, ప్రైవేటు రాజధాని అని. అదే ఇప్పుడు నిజమన్పిస్తోంది. మొన్నీమధ్యన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాని, మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సుకి ఆహ్వానించి ఆమెను అడ్డగించి, అవమానించినట్లే.. రేప్పొద్దున్న అసెంబ్లీ సమావేశాల విషయంలోనూ అదే స్ట్రాటజీని అధికార పార్టీ అమలు చేయదన్న గ్యారంటీ ఏముంది.? ఎలాగూ, అసెంబ్లీ, మండలి భవనాల ప్రారంభోత్సవానికి తమను పిలవలేదని ప్రతిపక్షం నిలదీస్తుంది శాసనసభ సమావేశాల్లో. సమాధానం చెప్పడానికి అధికార పార్టీ దగ్గర 'మేటర్‌' ఎటూ లేదు. సో, ఎదురుదాడితో  ప్రతిపక్షం నోరు మూయించేయడానికి ఇప్పటికే రంగం సిద్ధమైపోయి వుండాలి.


సొమ్ములెవరివి.. సోకులు ఎవరివి.!

సొమ్ము జనాలది.. సోకులేమో చంద్రబాబుకి.. ఇదీ వరస. ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి, మంత్రులు, సభాపతులు, ప్రతిపక్ష నేత, విపక్షాలకు చెందిన ఇతర ముఖ్య నేతలు.. వీళ్ళంతా కన్పించి వుంటే ఎంత బావుండేది.? 'ఇదీ మన అమరావతి - మన ఆత్మగౌరవం. మన రాష్ట్రంలో మన అసెంబ్లీ.. ఇదెంతో గర్వకారణం' అని ప్రతి ఒక్కరూ భావించేవారే. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలూ కన్పిస్తే, అది రాష్ట్రానికి సంబంధించిన పండగలా వుండేది. ఆ వేడుక సాక్షిగా, రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి ముఖ్య నేతలంతా మాట్లాడితే, ఆ కిక్కే వేరప్పా. కానీ, ఆ అదృష్టాన్ని రాష్ట్ర ప్రజలకు లేకుండా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 'పూర్తిగా ఇది ప్రైవేటు ఈవెంట్‌..' అన్నట్లుగానే చేసేసి, చేతులు దులిపేసుకుని.. ఇప్పుడేమో, ఫోన్లు చేశాం.. మెసేజ్‌లు పెట్టాం.. అంటూ తప్పించుకోడానికి మార్గాలు వెతుక్కోవాల్సిన ఖర్మ కొనితెచ్చుకున్నారాయన. ఇంతకన్నా సిగ్గు చేటైన విషయం బహుశా ఇంకేమీ వుండకపోవచ్చు.

అహో చంద్రబాబు.. దేశ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకెవరూ వుండరన్పించేసినందుకు మీకు శతకోటి వందనాలు. దేశ చరిత్రలో ఏం ఖర్మ, ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి పాలకుడ్ని ఇంకెక్కడా చూడలేం. ప్రజలతో అవసరం లేదు, ప్రతిపక్షంతో పని లేదు.. ప్రభుత్వమంటే జస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అనే మీ గట్టి నమ్మకానికి జోహార్లు అనాలా.? ఇంకేమన్నా అనాలా.?

- సింధు

Show comments