మారాజా...మీ ఖజానాకు ఎముక లేదా?

ఈ తరంవారంతా మహారాజులు, చక్రవర్తుల గురించి చరిత్ర పుస్తకాల్లో చదువుకోవడమో, సినిమాల్లో చూడటమో జరుగుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా కొందరు రాజులు అంటే సంస్థానాధీశులున్నారు. కాని అప్పటికే వారి వైభవం అంతరించింది. బాపు తీసిన 'అందాల రాముడు' సినిమాలోని రాముడేమన్నాడోయ్‌ అనే పాటలో 'నాడు రాజులంతా మంత్రులైతే మెచ్చుకున్నాడో...నేడు మంత్రులు మారాజులైతే నొచ్చుకున్నాడోయ్‌'..అని రాశారు ఆరుద్ర. ప్రస్తుత ప్రజాస్వామ్యంలో మంత్రులంతా రాజులు. ముఖ్యమంత్రి చక్రవర్తి. ఆయన ఏం చేసినా చెల్లుతుంది. ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా పీకేవారుండరు. ప్రజాధనం కోట్లకు కోట్లు మంచినీళ్లలా ఖర్చు చేసినా 'మారాజు చేతికి ఎముక లేదు' అని మెచ్చుకుంటారే తప్ప తనది కాని సొమ్ము  ఖర్చు చేస్తున్నాడని కుర్చీ నుంచి దింపేయరు. ఇది తప్పని ప్రతిపక్షాలు గోల చేసినా వారి గొంతులు అంతగా పైకి లేచే అవకాశం లేకుండా చేస్తారు. సాధారణ ఎన్నికలు జరగడానికి మరో రెండేళ్లకు మించి లేదు. కొన్ని సామాజిక వర్గాలను సంతృప్తిపరచడంతోపాటు ఎమ్మెల్యేలకూ ఆనందం కలిగించాలి కదా. సంతృప్తి, ఆనందం కలిగించడం కేసీఆర్‌ దృష్టిలో 'సంక్షేమం'.

ఉద్యమ నాయకుడు అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రత్యేక రాష్ట్రం ఎంతవరకు బంగారు తెలంగాణగా మారిందో తెలియదుగాని 'భవనాల తెలంగాణ'గా మారిందని చెప్పొచ్చు. పూర్వ కాలంలో రాజులు గుళ్లు గోపురాలు విపరీతంగా కట్టడంతో 'రాజుల సొమ్ము రాళ్లపాలు' అన్నారు. తెలంగాణ సర్కారు వివిధ వర్గాలకు భవనాలు కట్టిస్తుండటంతో 'ప్రజాధనం భవనాలపాలు' అని చెప్పుకోవచ్చు. దాదాపు ప్రతి సామాజిక వర్గానికి ఓ భవనం వాగ్దానం చేశారు. హైదరాబాదులో నివశిస్తున్న వేరే రాష్ట్రాలవారికీ (వారి సంఘాలకు) భవనాలు కట్టిస్తానన్నారు. చివరకు ఎన్‌ఆర్‌ఐల కోసం కూడా భవనం కడతానని చెప్పారు. ఇక తెలంగాణలోని ఎమ్మెల్యేలను చూస్తే మారాజు కేసీఆర్‌కు జాలేసింది. వారు ప్రజాప్రతినిధులుగా సర్వశక్తులు ధారపోసి ప్రజలకు సేవ చేస్తున్నప్పటికీ వారి సొంత నియోజకవర్గాల్లో ఇళ్లు, కార్యాలయాలు లేవట....! దీంతో నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు వసతి లేక, కార్యకర్తలు, నాయకులు, అధికారులతో సమీక్షా సమావేశాలు జరపడం వీలుకాక యమ ఇబ్బంది పడుతున్నారట...! వీరి కష్టాలు తొలగించి మహారాజ వైభవం కల్పించాలని గత ఏడాది ప్రథమార్ధంలో కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు.

ప్రతి ఎమ్మెల్యేకు నియోజకవర్గ కేంద్రంలో రాజభవనాన్ని తలదన్నేలా ఖరీదైన ఇల్లు కమ్‌ ఆఫీసు కట్టించాలని డిసైడయ్యారు.  రెండంతస్తుల భవనం.  మూడు బెడ్‌రూముల ఇంట్లో  అన్ని ఆధునిక సౌకర్యాలుంటాయి. పైన నివాసం. కింద కార్యాలయం. కార్యాలయంలో మీటింగులు నిర్వహించుకోవడానికి కాన్ఫరెన్స్‌ హాలు, సాంకేతిక సౌకర్యాలు వగైరా హంగులుంటాయి. భవనం నిర్మించే స్థల విస్తీర్ణం  500 గజాలని, ఎకరా అని రెండు విధాలుగా వార్తలొచ్చాయి. ఒక్కో రాజభవనానికి  కోటి రూపాయల ఖర్చు.  ఈ ఆలోచన వచ్చిన వెంటనే భవనాల నిర్మాణం కోసం తగిన భూమిని ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. కేసీఆర్‌ నిర్ణయం ప్రకారం మొదటి రాజభవనం వరంగల్‌ జిల్లా పరకాలలో ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కట్టించి ఇచ్చారు. ఈమధ్యనే రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం ఈ భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కోటి రూపాయల ఖర్చుతో భవన నిర్మాణమంటే సాధారణ ప్రజలకు చిన్న విషయం కాదు. వామ్మో అని గుడ్లు తేలేస్తారు. 

అయితే కొందరు ఎమ్మెల్యేలు కోటి రూపాయల ఖర్చేనా...? అని పెదవి విరుస్తున్నారట....! ఈ బడ్జెటు ఏం చాలుతుందని అంటున్నారట...! ఇంకొందరు ఎమ్మెల్యేలు జిమ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, ఇండోర్‌, ఔట్‌డోర్‌ ఆటల కోసం ఏర్పాట్లు ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారట...!  వీరికి కోటి రూపాయల ఖర్చుతో ఖరీదైన ఇళ్లు నిర్మించడం అవసరమా? భారీగా జీతాలు పెంచాక ఇంకా ఈ రాజభవనాలు నిర్మాణం ఎందుకు? ఈ భవనాల నిర్ణయానికి ముందే ఎమ్మెల్యేల జీతాలు రూ.1.25 లక్షల నుంచి 2.75 లక్షల వరకు పెరిగాయి.  నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు ఇళ్లు లేవా? సమావేశాలు నిర్వహించుకోవడానికి పార్టీ  కార్యాలయాలు లేవా? ఇప్పటివరకు ఇళ్లు, కార్యాలయాలు లేకుండానే గడుపుతున్నారా? పేద ప్రజలకు సహాయం అందించే విషయంలో సవాలక్ష నిబంధనలు, ఆంక్షలు విధించే పాలకులు రాజకీయ నాయకులకు స్వేచ్ఛగా ఖర్చు పెడతారు. ఇక మారాజు కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.

Show comments