12 లక్షల కోట్లు.. పంచేస్తారా.?

దేశంలో కరెన్సీ మార్పిడి ప్రారంభమై.. వారం రోజులు దాటింది. దేశ ప్రజానీకం ఇంకా ఏటీఎంల వద్దా, బ్యాంకుల వద్దా బారులు తీరి కన్పిస్తున్నారు. కరెన్సీ నోట్ల మార్పిడి పుణ్యమా అని కొన్ని ప్రాణాలూ గాల్లో కలిసిపోయాయి. ఈ మొత్తం వ్యవహారానికి టార్గెట్‌ ఏంటి.? అంటే, నల్లదొంగల్ని పట్టుకోవడం. దానికన్నా ముందు, తీవ్రవాదం రెక్కలు విరిచేయడం. 

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో చిన్న చిన్న ప్రింటింగ్‌ ప్రెస్‌లలో ఫేక్‌ కరెన్సీని ముద్రించేసి, వాటి సాయంతో భారత్‌లోకి తీవ్రవాదుల్ని పంపేసి, దాన్ని చెలామణీ చేయించి.. భారత ఆర్థిక వ్యవస్థని ఛిన్నాభిన్నం చేయాలనే ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. కొంతమేర ఆ ప్రయత్నం సఫలమయ్యింది కూడా. కొత్త కరెన్సీతో ఆ ప్రయత్నాలకు చెక్‌ పడిందా.? అంటే, తాత్కాలికంగా కొంత బెటర్‌మెంట్‌ కన్పించినప్పటికీ, మున్ముందు కొత్త రూపాల్లో తీవ్రవాదం సత్తా చాటడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

పార్లమెంటు సమావేశాల ముందర, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌, కాశ్మీర్‌లో అల్లర్లు తగ్గడానికి కారణం, భారత కరెన్సీ తీవ్రవాదులకు అందకపోవడమేననీ, తద్వారా వేర్పాటువాదులు నిధులు లేక ఇంట్లో కూర్చున్నారనీ వ్యాఖ్యానించారు. ఇది జస్ట్‌ పొలిటికల్‌ స్ట్రేటజీ మాత్రమే అన్న విమర్శలూ లేకపోలేదు. 

ఇంకోపక్క, బీజేపీ నేతలు 12 లక్షల కోట్ల రూపాయల నల్లధనం కాంగ్రెస్‌ నేతల వద్దే మగ్గుతోందని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ పార్లమెంటు సమావేశాల వేళ పొలిటికల్‌ హీట్‌ని పెంచేవే. విదేశాల్లో సుమారుగా 80 లక్షల కోట్లు, అంతకు మించిన నల్లధనాన్ని మన నల్ల కుబేరులు దాచేసుకున్నారంటూ గతంలో బీజేపీ నేతలే ఆరోపించారు. దాన్నంతా తీసుకొచ్చేస్తామని, ఎన్నికల ప్రచారంలో చెప్పారు కూడా. ఏదీ ఎక్కడ.? 80 లక్షల కోట్లు కాదు, కనీసం 80 వేల కోట్లు కూడా రాబట్టలేకపోయారు. 

గడచిన వారం రోజుల్లో సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యాయి. దానర్థం, ఇదంతా బ్లాక్‌ కరెన్సీ అని కాదు. ఇవి కేంద్రానికి దక్కిన సొమ్ములు అసలే కావు. విత్‌ డ్రా చేసుకునేందుకు పరిమితులు వుండడం, ఇతరత్రా కారణాలతో అంత మొత్తం బ్యాంకుల్లో వుందేమోగానీ.. ప్రస్తుత నిబంధనలు కొద్ది రోజులకు సడలింపబడ్తాయి గనుక, ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. 

ఫలానా రాజకీయ నాయకుడు లక్ష కోట్లు దోచేశాడు.. మేం అధికారంలోకి రాగానే, దాన్ని కక్కిస్తాం.. అనే మాటలు వినీ వినీ దేశ ప్రజానీకం అలసిపోయారు. ఒక్క రాజకీయ నాయకుడి నుంచి కూడా ఇప్పటిదాకా అవినీతి సొమ్ముని తిరిగి రాబట్టిన చరిత్ర లేదు. మహా అయితే శిక్ష పడుతుంది.. అది కూడా చాలా చాలా చాలా అరుదైన ఘటన. అలాంటిది, 12 లక్షల కోట్లంటూ.. బీజేపీ చేసిన ఆరోపణల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 

ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవ్‌.. అన్ని పార్టీల్లోనూ నల్లకుబేరులున్నారు.. ఆ మాటకొస్తే, ఇప్పుడు రాజకీయం అంటే అది బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే సొంతం.. అన్నట్టు తయారైంది. అంబానీ గ్రూప్‌ లక్షల కోట్లు బాకీలుపడిందనే విమర్శలున్నాయి.. విజయ్‌ మాల్యా సంగతేంటి.? చెప్పుకుంటూ పోతే కథ చాలానే. ఇది అంతు లేని కథ.!

Show comments