నారాయణ సంపాదన వెనుక 'కష్టం'.!

నారాయణ నారాయణ.. ప్రపంచంలో ఆయనలా ఎవరైనా కష్టపడగలరా.? చాలా కష్టపడి ట్యూషన్లు చెప్పి, దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు నడిపే స్థాయికి ఎదిగారాయన. తద్వారా ఆర్జించిన సొమ్ముతో తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించి, మంత్రి పదవిని 'కొట్టేశారు'. పరిచయం అక్కర్లేని పేరది. నారాయణ అంటే ఓ పేరు కాదు, ఓ బ్రాండ్‌. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. 

ఔను నారాయణ అంటే ఓ బ్రాండ్‌. ఔను, నారాయణ అంటే అక్రమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌. విద్యార్థుల్ని అధిక ఫీజులతో వేధించడం దగ్గర్నుంచి, విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల దాకా.. ఒకటేమిటి, చాలా విషయాల్లో నారాయణ ఓ సూపర్‌ బ్రాండ్‌. నారాయణ విద్యా సంస్థలో ఏం జరిగినాసరే, కేసులు నమోదైనా సరే, క్షణాల్లో మాయమైపోతుంటాయి. అదంతే, దటీజ్‌ నారాయణ. 

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అయ్యాక, నారాయణ తన విద్యా సంస్థల్ని ఇంకా అద్భుతంగా నడిపించేస్తున్నారు. పైగా, దానికి 'కష్టం' అనే కలరింగ్‌ ఇస్తున్నారు. అసలంటూ విద్యా వ్యవస్థలో 'దోపిడీ' అన్న మాట పుట్టిందే, నారాయణ విద్యా సంస్థల నుంచి. పెన్సిల్‌, పేపర్‌.. అన్నీ నారాయణ విద్యా సంస్థల్లోనే కొనుగోలు చేయాలి. ఇదిప్పటి మాట కాదు.. అసలు ఈ విధానాన్ని ప్రారంభించిందే నారాయణ విద్యా సంస్థలు. 

ఇంతలా కష్టపడితే తప్ప, మంత్రి స్థాయికి నారాయణ ఎగదలేదు. అఫ్‌కోర్స్‌.. కష్టపడితే పదవులొచ్చే రాజకీయాలు కావివి. ఆ కష్టం, డబ్బు రూపంలో వుండాలి. ఎన్నికల సమయంలో నారాయణ, టీడీపీ తరఫున ప్రచారం చేయలేదు. కానీ, ఆయనకు మంత్రి పదవి దక్కింది. నారాయణ కష్టమేంటో చంద్రబాబుకి మాత్రమే తెలుసు. అందుకే, ఆ కష్టానికి తగ్గ ఫలం మంత్రి పదవి రూపంలో అందించారు. 

'ఎన్నికల్లో ఖర్చు చేశారు కదా, దాన్ని రాబట్టుకోవడానికి రాజధాని పనుల్ని నారాయణకి చంద్రబాబు అప్పగించారు..' అన్న విమర్శలు వెల్లువెత్తుతోంటే, నారాయణ తూచ్‌ అనేస్తున్నారు. సొంత పార్టీలోనే నారాయణపై తీవ్రమైన వ్యతిరేకత వుంది. సొంత పార్టీలో వచ్చే వ్యతిరేకతనే నారాయణ లెక్క చేయడంలేదు. విపక్షాల నుంచి వ్యతిరేకత వస్తే ఊరుకుంటారా.? తిప్పి కొట్టేస్తారు మరి.! ఆయన చేస్తున్నది అదే. 

పద్ధతిగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తాను సంపాదించాననీ, విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్నాననీ, నిబంధనల ప్రకారమే పన్నులు కడుతున్నాననీ నారాయణ సెలవిచ్చారు. ఔనాండీ.. నిజమాండీ.. నిజమే అయ్యుంటుంది లెండి.. ఎందుకంటే మీరు నిప్పు నెంబర్‌ 2 కదా.!

Show comments