మోడీని చంద్రబాబు పొగిడారా? తిట్టారా?

500, 1000 రూపాయల నోట్ల రద్దుపై కేంద్రాన్ని అభినందిస్తున్నా.. 

- ఇది చంద్రబాబు నిన్నటి ప్రకటన 

500, 1000 రూపాయల నోట్ల రద్దీ మంచిదే.. ప్రధాని మంచి నిర్ణయం తీసుకున్నారు 

- ఇది చంద్రబాబు నేటి ప్రకటన 

తేడా ఏముందనుకుంటున్నారా.? రెండో ప్రకటనకి కొనసాగింపు వుంది. వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడం బాగుంది. కానీ, 2000 రూపాయల నోట్లను చెలామణీలోకి తీసుకురావడమే బాగోలేదు. దీనిపై చర్చ జరగాల్సి వుంది. ఈ నోట్ల రాకతో పరిస్థితి 'పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయ్యింది..' అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇంతకీ, ప్రధాని నరేంద్రమోడీని చంద్రబాబు పొగిడారనుకోవాలా.? తిట్టారనుకోవాలా.? రెండోదే కరెక్ట్‌. నిజానికి 500 రూపాయల నోట్లు రద్దు కాలేదు. జస్ట్‌ మార్పిడి జరుగుతోందంతే. వెయ్యి రూపాయల నోట్లు మాత్రం రద్దయ్యాయి. రెండు వేల రూపాయల నోట్లు వచ్చేస్తున్నాయి. అంటే, దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్న నల్లధనం చేతుల్లోకి ఆయుధంగా కత్తి నుంచి తుపాకీ వచ్చిందనుకోవాలేమో.! 

'మేం ముందే చెప్పాం.. మేం డిమాండ్‌ చేశాం.. మా డిమాండ్‌కి కేంద్రం సానుకూలంగా స్పందించింది..' అని నిన్న చంద్రబాబు స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు. మరి, ఈ రోజు ఏమయ్యింది.? బహుశా చంద్రబాబు కోరిక మేరకే కేంద్రం, 2 వేల రూపాయల నోట్లను రంగంలోకి దించుతోందనుకోవాలేమో.! అలా జనం అనుకుంటారనే, చంద్రబాబు ఇలా కంగారుపడ్డారు. 

సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. 'జియో' పేరుతో దేశాన్ని షాక్‌కి గురిచేసిన రిలయన్స్‌ సంస్థ, డిసెంబర్‌ 31 వరకూ అపరిమిత ఉచిత డేటా, కాలింగ్‌ని అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్‌ 31 తర్వాత జియో 'మర్మం' ఏంటనేది తెలుస్తుంది. అంటే, ముందస్తుగానే జియో పేరుతో వేల కోట్ల పెట్టుబడుల్ని దారి మళ్ళించారేమో. ఇదంతా ఆన్‌లైన్‌లో ప్రచారంలో వున్న వార్త సారాంశం. సేమ్‌ టు సేమ్‌ అలాంటిదే తెలుగునాట కూడా జరిగింది. హెరిటేజ్‌ సంస్థ ఫ్యూచర్‌ గ్రూప్‌లోకి వెళ్ళింది.. అదీ కరెన్సీ మార్పిడికి కొద్ది రోజుల ముందు. దానికీ దీనికీ ఏమన్నా సంబంధం వుందా.? ఏమో మరి, కాలమే సమాధానం చెప్పాలి. 

కొసమెరుపు: త్వరలో 200 రూపాయల నోట్లు కూడా రానున్నాయని చంద్రబాబు సెలవిచ్చారు. అంతలోనే, అసలు కరెన్సీ నోట్లతో పనేంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. అలాగా.? ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు ఎలా కొనుగోలు చెయ్యాలి.? రైతు బజార్లలో కూరగాయల మాటేమిటి.? అన్నీ, ఆన్‌లైన్‌లో కుదరవు కదా.!

Show comments