కేసీఆర్‌ మీదా 'ఆంధ్రోళ్లు' అస్త్రమేనా?

'చావుకు పెళ్లికి ఒకటే మంత్రం' అనే సామెత తెలిసిందే. 'మల్లును ముల్లుతోనే తీయాలి' అనే నానుడీ తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యతిరేకుల తీరు ఇలాగే ఉంది. తెలంగాణను సాధించడానికి కేసీఆర్‌తోపాటు అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలవారు 'ఆంధ్రోళ్లు' అనే అస్త్రాన్ని వాడారు.     

తెలంగాణను ఆంధ్రోళ్లు దోచుకున్నారని, తెలంగాణ ప్రజల మీద ఆంధ్రా భాష రుద్దారని, ఈ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేశారని, నిధులు, నీళ్లు, నియామకాల్లో అన్యాయం చేశారని...ఇలా అనేక ఆరోపణలతో ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. ఆంధ్రా వ్యతిరేకతను తెలంగాణలోని సామాన్య ప్రజల బుర్రల్లోకి బాగా ఎక్కించేశారు. దాన్ని బలమైన సెంటిమెంటుగా మార్చారు. కేసీఆర్‌ ఈమధ్య కొంతకాలంగా ఆంధ్రోళ్లను తిట్టడం తగ్గించారుగాని జీహెచ్‌ఎంసీ  ఎన్నికల ముందువరకూ నానా దుర్భాషలాడారు. లంకలో రాక్షసులన్నారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు పీకేసీ ప్యాక్‌ చేసి పంపుతానన్నారు. చెప్పుకుంటే ఈ చరిత్ర చాలా పెద్దది. ఎప్పుడైతే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కనీవినీ ఎరుగని మెజారిటీ సాధించిందో అప్పటినుంచి ఆంధ్రోళ్లపై నోరు పారేసుకోవడంలేదు.

ఇందుకు కారణం? ఆంధ్రోళ్లు మూకుమ్మడిగా టీఆర్‌ఎస్‌కు ఓట్లు గుద్ది గెలిపించడమే. అధికార పార్టీలోకి ఫిరాయించినవారిలో ఆంధ్రా మూలాలున్న పలువురు టీడీపీ ఎమ్మెల్యేలూ ఉన్నారు. ఇలా పలు కారణాలతో ఆంధ్రా వ్యతిరేకతను బహిరంగంగా తగ్గించారు. దాన్ని కేసీఆర్‌ తగ్గించిన తరువాత క్రమంగా కేసీఆర్‌ వ్యతిరేకులు అందిపుచ్చుకున్నారు. అంటే కేసీఆర్‌ను దెబ్బ తీయాలంటే ఆయన 'ఆంధ్రావారికి అనుకూలం' అనే అభిప్రాయం ప్రజల్లో కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆంధ్రా వ్యతిరేకత అస్త్రంతో కేసీఆర్‌ ఉద్యమం నడిపి రాష్ట్రాన్ని సాధించగా, అదే సెంటిమెంటును ఉపయోగించి కేసీఆర్‌ దెబ్బ తీయడానికి, ఆయన ఆంధ్రావారికి అనుకూలుడనే భావన కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఈ పనిని కేసీఆర్‌ బద్ధ శత్రువైన తెలంగాణ టీడీపీ నాయకుడు రేవంత్‌ రెడ్డి మొదలుపెట్టారు. పెద్ద ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ ఆంధ్రావారికే ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారికి, సమైక్యాంధ్రను సమర్ధించినవారికి మంత్రి పదవులు (తలసాని, తుమ్మల వగైరా) ఇచ్చారని దుయ్యబట్టారు. 

టీడీపీకి ఆంధ్రా పార్టీ అనే పేరుంది. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ నాయకులు ఈ విమర్శ చేస్తుంటారు.  తెలంగాణీయులకు ఆ పార్టీపై ద్వేషం కలిగేందుకు ఆంధ్రా పార్టీ అని అంటుంటారు. టీ-టీడీపీ నాయకులు తమది తెలంగాణ పార్టీయేనని చెప్పుకునేందుకు కేసీఆర్‌ ఆంధ్రావారిని చేరదీస్తున్నారని, వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తుంటారు. టీడీపీపై ఆంధ్రా ముద్ర పోగొట్టేందుకు ఇలా మాట్లాడుతుంటారు.

రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ను విమర్శిస్తూ 'తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆంధ్రాకు చెందిన చినజీయర్‌ స్వామిని ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టి తెలంగాణ అమరవీరులను అవమానిచారు'...అని విమర్శించారు. కేసీఆర్‌ తన కొత్త క్యాంపు కార్యాలయం, నివాసభవనం గృహప్రవేశం సందర్భంగా తన ఆధ్యాత్మిక గురువైన చినజీయర్‌ స్వామిని ముఖ్యమంత్రి అధికారిక కుర్చీలో ముందుగా కూర్చోబెట్టి ఆయన ఆశీస్సులు తీసుకొని, ఆ తరువాత తాను కూర్చున్న సంగతి తెలిసిందే. 

తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ రైతు సమస్యలపై నివేదిక ఇస్తానంటే అపాయింట్‌మెంట్‌ ఇవ్వని కేసీఆర్‌ ఆంధ్రా ఆడబిడ్డ అయిన  పీవీ సింధుకు నాలుగు కోట్ల రూపాయల నజరానా ఇచ్చి మూడు గంటలసేపు ముచ్చటించారని అన్నారు. ఇలాంటవే ఇంకా ఉన్నాయనుకోండి. ఇప్పుడు తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ కూడా రేవంత్‌ బాటలోనే నడుస్తున్నారు. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రతిపక్షాలు భావిస్తున్న కోదండరామ్‌ కొంతకాలంగా అనేక విషయాల్లో కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు.

ఆయన తాజాగా విమర్శలు చేస్తూ తెలంగాణలో ఇప్పటికీ ఆంధ్రా పెట్టుబడిదారుల పెత్తనమే కొనసాగుతోందన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకే దక్కాయన్నారు. ఆంధ్రా కార్పొరేట్‌ విద్యా సంస్థలు దోపిడీ చేస్తున్నా టీఆర్‌ఎస్‌ సర్కారు చర్యలు తీసుకోవడంలేదన్నారు. తెలంగాణ పరిశ్రమల్లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావడంలేదన్నారు. సో...ఉమ్మడి రాష్ట్రంలో దోపిడీ చేసింది ఆంధ్రావారే. తెలంగాణ రాష్ట్రంలో పెత్తనం చేస్తున్నదీ ఆంధ్రావారేనని తెలంగాణ నాయకులు చెబుతున్నారు. ఈ ప్రచారం ఇంకెంతకాలం చేస్తారో....!

Show comments