'ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను సిద్ధం.. కానీ, పార్టీ ఆదేశించాలి.. మంత్రి పదవి విషయమై ఎలాంటి చర్చా జరగడంలేదు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి వుంటాను.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు..'
- ఇదీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉవాచ.
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడిగా, నారా లోకేష్‌కి పదవులు పెద్ద లెక్క కాదు. కోరుకుంటే మంత్రి పదవి చిటికెలో తన వద్దకు వచ్చేస్తుంది. అది రాష్ట్రంలో అయినా, కేంద్రంలో అయినా. కేంద్రంలో తమ కోటాలో రెండు మంత్రి పదవులున్నాయి గనుక, లోకేష్ కోరుకుంటే అందులో ఒకటి తనకు వచ్చేయకుండా వుంటుందా.? కానీ, కొన్ని సమీకరణాల పుణ్యమా అని, మంత్రి అవ్వాలనే లోకేష్ ఆశలు నెరవేరడంలేదన్నది నిర్వివాదాంశం. దీనికి మరో ముఖ్యకారణం, 'చంద్రబాబులో పెరుగుతున్న అభత్రాభావం' అన్నది టీడీపీ వర్గాల్లో ఆఫ్ ది రికార్డ్‌గా విన్పించే వాదన.
ఇక, పార్టీ ముఖ్య నేతగా లోకేష్ ఏం చేసినా, ప్రజల్లో తనకున్న బలాన్ని నిరూపించుకుంటేనే అతనిలో నాయకత్వ లక్షణాలు బయటపడ్తాయి. అలా జరగాలంటే, లోకేష్ ఎన్నికల్లో పోటీ చేయాలి. ఎలాగూ లోకేష్ కోసం త్యాగం చేసేటోళ్ళు టీడీపీలో చాలామందే వున్నారు గనుక, తన బల ప్రదర్శన కోసం లోకేష్‌ని ఎన్నికలు ఫేస్ చేసేసి వుండొచ్చు. కానీ, ఇక్కడా లోకేష్‌లోనూ అభద్రతాభావమే కన్పిస్తోంది. అందుకే, ఎన్నికల్లో పోటీ విషయమై 'పార్టీదే అంతిమ నిర్ణయం..' అంటూ సెలవిచ్చేస్తుంటారాయన.
ప్రస్తుతానికి కాదుగానీ, 2019 ఎన్నికల నాటికి మాత్రం లోకేష్, ప్రత్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అప్పటికి రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో ఏమో.!