బాబు చావు తెలివితేటలు వర్సెస్ ప్రత్యేక హోదా

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ఎలా వీగిపోయింది.? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించే దిశగా వైఎస్సార్సీపీ వ్యూహాలు ఎలా బెడిసి కొట్టాయి.? అంతకు ముందు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని టీడీపీ ఎలా కాపాడింది.? సమైక్యాంధ్రప్రదేశ్‌ ఉద్యమానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఎలా అప్లయ్‌ చేశారు.? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు కొత్తగా చర్చనీయాంశమవుతున్నాయి. 

రేపు పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా బిల్లు (కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు) ఓటింగ్‌కి రానున్న దరిమిలా, టీడీపీ నేతల ప్రకటనలు, చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తోంటే, ఇక్కడా చంద్రబాబు తనదైన రాజకీయం ప్రదర్శించి, ఆంధ్రప్రదేశ్‌ని మళ్ళీ నట్టేట్లో ముంచేస్తారనే అనుమానాలు వెల్లువెత్తడంలో వింతేముంది.? 

తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్‌, 'గొంగలి పురుగునైనా ముద్దాడతాను..' అంటూ ప్రకటించిన విషయం విదితమే. లక్ష్యం చాలా పెద్దదైనప్పుడు, అందర్నీ కలుపుకుపోవాల్సినప్పుడు ఏ నాయకుడైనా ఇలాగే చెయ్యాలి. కానీ, అలా చేస్తే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.? రెండేళ్ళ నుంచీ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు సాధించింది ఏమీ లేదు. ఇంకోపక్క, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ఇఫ్పుడీ దుస్థితిలో కొట్టుమిట్టాడుతుందంటే దానికి కాంగ్రెస్‌ కారణమని అందరికీ తెల్సిన విషయమే. అదే కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా మాట్లాడుతోంది. అలాగని, కాంగ్రెస్‌ని ఇప్పుడు తప్పుపట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కి లాభమేంటో తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి. 

అయితే, ఇక్కడ చంద్రబాబుకి తన సొంత రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. అందుకే, కేంద్రంలో బీజేపీని కాపాడాలనే నిర్ణయానికి వచ్చేశారు. 'ఎక్కడన్నా ప్రైవేటు బిల్లు చట్టరూపం దాల్చిందా.?' అని అమాయకంగా ప్రశ్నించేశారు చంద్రబాబు. అంటే, ఇక్కడ విషయం క్లియర్‌. కేవీపీ ప్రత్యేక హోదా బిల్లు వీగిపోవడం ఖాయమని. కానీ, టీడీపీ మద్దతిస్తే, జాతీయ స్థాయిలో వివిధ పార్టీల్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కలుపుకోగలిగితే, పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ నూటికి నూరుపాళ్ళూ ఇరకాటంలో పడ్తుంది. కేవీపీ బిల్లు వీగిపోయినా, బీజేపీపై ఒత్తిడి పెరిగి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. కానీ, అది చంద్రబాబుకి ఇష్టం లేనట్లుగానే కన్పిస్తోంది. 

తాజాగా పార్లమెంటులో ఈ రోజు ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ ప్రస్తావించారు. ఏమని.? కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌ని అడ్డగోలుగా విభజించేసిందని చెబుతూ, బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తుందనే నమ్మకం వుందని సెలవిచ్చారు. మామూలుగా అయితే ఇక్కడ కాంగ్రెస్‌ పేరుని ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. కానీ, ప్రస్తావించారంటే.. ఇక్కడ కుట్ర కోణం సుస్పష్టం. చంద్రబాబు డైరెక్షన్‌లో పక్కాగా ఈ కుట్రని టీడీపీ ఎంపీలు అమలు చేస్తున్నారన్నమాట. ఇవే మరి, చావు తెలివితేటలంటే. 

రాజ్యసభలోనూ, లోక్‌సభలోనూ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడకుండా చేయగలిగితే, బీజేపీ సింపుల్‌గా తప్పించుకోడానికి ఛాన్సుంది. ఆ క్రమంలో, టీడీపీకి బీజేపీ పూర్తిగా సహకరించనుండడం ఖాయమే. ఓటింగ్‌ విషయంలోనూ గందరగోళం సృష్టించడం జాతీయ పార్టీలకు కొత్తేమీ కాదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సందర్భంగా పార్లమెంటులో ఏం జరిగిందో చూశాం. ఇలాంటప్పుడే ప్రాంతీయ పార్టీలు చాకచక్యం ప్రదర్శించాలి. పైగా, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పక్షం, కేంద్రంలో మిత్రపక్షం వుంది గనుక.. ఈ ఎపిసోడ్‌ వరకూ టీడీపీ ప్రవర్తన అత్యంత కీలకం. 

చంద్రబాబు చావుతెలివితేటలు ప్రదర్శించకుండా వుంటే, బిల్లు సంగతెలా వున్నా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. కానీ, చంద్రబాబు చావు తెలివితేటలు ప్రదర్శించకుండా వుండగలరా.? ఛాన్సే లేదు.

Show comments