రామ్‌గోపాల్ వర్మ సినిమాల్లో 'మర్డర్స్' చాలా రియలిస్టిక్‌గా వుంటాయి. క్రైమ్ థ్రిల్లర్స్ అంటే వర్మకి చాలా ఇష్టం. దానికి ఒక్కోసారి మాఫియాని వాడుకుంటుంటాడు.. ఇంకోసారి ఫ్యాక్షన్‌ని వాడుకుంటాడు.. మరోసారి, ఇతరత్రా 'న్యూస్'ని వాడుకుంటుంటాడు. అదే వర్మ స్పెషాలిటీ. గ్యాంగ్‌స్టర్ నయీమ్, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్.. ఇలాంటోళ్ళ జీవిత చరిత్రల మీద వర్మకి ఫోకస్ ఎక్కువ.
ఇక, వర్మ తన 'వంగవీటి' సినిమా కోసం విజయవాడ బ్యాక్ డ్రాప్‌ని వాడుకున్నాడంతే. 'రక్తచరిత్ర' సినిమాని అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాలు - హత్యలపై తీసిన వర్మ, అందులో పాత్రల పేర్లను మార్చాడు. కానీ, 'వంగవీటి'కి అలాంటి మార్పులేమీ చెయ్యలేదు. అసలు జరిగిందేంటి.? అన్న విషయం పక్కన పెట్టి, అందులోని 'మర్డర్స్'ని ఎలివేట్ చేశాడు. తానేం చేశానన్నది వర్మకి తెలుసు గనుక, తన ట్రెండ్‌కి భిన్నంగా సినిమా రిలీజ్‌కి ముందే 'కమ్మ - కాపు' పాటని తీసేశాడు. అంతేనా, సినిమా రిలీజయ్యాక, అందులోని ఓ డైలాగ్‌కీ కత్తెరేసేశాడు.
ఇదంతా ఎందుకంటే, వర్మ 'వంగవీటి'ని జస్ట్ వాడుకున్నాడంతే. సినిమా రిలీజయ్యింది. వర్మ చెప్పినంత సీన్ సినిమాలో లేదని తేలిపోయింది. కానీ, 'వంగవీటి' వివాదం మాత్రం అలాగే వుంది. వర్మ చరిత్రను వక్రీకరించారంటూ వంగవీటి రంగా తనయుడు, వంగవీటి రాధాకృష్ణ ఆందోళనబాట పట్టారు. 'వర్మ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది' అంటూ హెచ్చరించేశారు. అంతేనా, 'డబ్బు కోసమే సినిమా తీసిన వర్మ..' అంటూ విమర్శించి పారేశారు. 'డబ్బులే కావాలనుకుంటే వంగవీటి అభిమానులు, చందాలేసుకుని డబ్బులిచ్చేవారు..' అంటూ వర్మపై దుమ్మెత్తి పోశారు.
వర్మ సంచలనాలకోసమే సినిమాలు చేస్తాడన్నది అందరికీ తెల్సిన విషయమే. 'వంగవీటి'తో తాననుకున్నది వర్మ సాధించేశాడు. ఇక, వర్మ చేసే పబ్లిసిటీ స్టంట్లతో తాను సేఫ్ అయిపోతానని నిర్మాత కూడా రిస్క్ చేసేశారు. నిర్మాత సంగతేంటి.? అన్నది తర్వాతి విషయం. వర్మ మాత్రం ఫుల్ హ్యాపీ. ఇక, వంగవీటి జీవిత చరిత్ర అంటారా.? అలాంటివి వర్మ సినిమాల నుంచి ఆశించకూడదంతే. ఎందుకంటే, ఆయన తనకు మాత్రమే నచ్చింది తీస్తాడు.