మీడియా మొత్తాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుని తానా అంటే తందానా అని వాటి చేత ఆడించుకుంటూ సొంత డబ్బా మోగించుకుంటున్న చంద్రబాబుకు సోషల్ మీడియా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏమీ లేని దానికే ఏదేదో జరిగిపోతోందన్నఅరివీర భీకర బిల్డప్పులకు బ్రేకులు వేసింది.
చిన్నపాటి వర్షానికే వెలగపూడి సచివాలయం, అసెంబ్లీ భవనాలు నీట ముగనడంపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. తమ క్రియేటివిటీనంతా రంగరించి పోస్టులు, కార్టూన్లతో బాబు సర్కారును ఇష్టానుసారం ఆడుకుంటున్నారు సోషల్ యాక్టివిస్టులు.
సరదాగా సచివాలయంలో ఈతకు వెళ్తున్నా వస్తావా.. అని ఒకడు.. సచివాలయం వర్షానికి కారలేదు. ఎండల నుంచి ఉపశమనం కోసం బాబు గారు విదేశీ టెక్నాలజీ సహాయంతో ఏర్పాటు చేసిన జలపాతం అది.. అని మరొకడు.. ఇలా పంచ్‌లు, చెణుకులతో బాబును చెడుగుడు ఆడుకుంటున్నారు.
చంద్రబాబు పాలనలో వర్షం పడదని ఇన్ని రోజులూ ఆడిపోసుకున్నారుగా ఇప్పుడు చూడండి ఏకంగా అసెంబ్లీ హాలు, సచివాలయ హాలులో కూడా వర్షం పడుతోంది.. బాబుకు ఓ సోషలిస్టు సానుభూతి. భవిష్యత్తులో నిర్మించబోయే రాజధానిలో బాహుబలి జలపాతం నిర్మాణం.. మరొకాయన పంచ్.
సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలనేది బాబు గారి ఉపేదశం అందుకే సచివాలయంలో కాగిత పడవల కుటీర పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం.. ఒక సోషల్ యాక్టివిస్ట్ చురక. ప్రతిపక్ష నేత చాంబర్‌లో వర్షం కురవడం వెనుక జగన్ కుట్ర ఉంది.
దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలి.. ఇంకొకాయన ఎగతాళి. ఏందయ్యా కాంట్రాక్టరూ ఇలా కట్టావు.. లేదు సార్ మేం కూడా మోసపోయాం సార్.. మీరు ఉన్న చోట వర్షాలు పడవని అధికారులు చెప్పారు. అందుకే ఇలా కట్టాం. అయినా ప్రభుత్వం ముందే చెప్పిందిగా అవి తాత్కాలిక బిల్డింగ్‌లు అని.. వాటిని శాశ్విత భవనాలుగా భావించి అంత గాభరా పడడం అనవసరం.. ఒకాయన వెటకారం.
ఇలా బాబు గారి మీద పడుతున్న పంచ్‌లను రాసుకుంటూ పోతే వంద జీబీ మెమొరీ సరిపోదు. బాబుగారి విజనరీని విస్తరాకుల కట్టతో పోల్చుతూ సాగుతున్న విమర్శల జడివానను ఎలా అడ్డుకోవాలో తెలియక టీడీపీ సోషల్ మీడియా విభాగం తలలు పట్టుకుంటోంది.