బాలీవుడ్‌ చేతులెత్తేసినట్టేనా.?

'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమాతో సాధారణ కమర్షియల్‌ సినిమాల్ని పోల్చి చూడకూడదని బాలీవుడ్‌ సినీ జనం తేల్చేస్తున్నారు. త్వరలో 'ట్యూబ్‌లైట్‌' సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న దరిమిలా, ఈ సినిమా సాధించే విజయంపై బాలీవుడ్‌ సినీ జనం అంచనాలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. 

'ఏమో, ట్యూబ్‌లైట్‌తో బాహుబలి వసూళ్ళను దాటేస్తానేమో.. ఏ సినిమా ఏ రికార్డుల్ని కొల్లగొడ్తుందో ఊహించడం కష్టం.. ఆ సమయానికి అప్పుడున్న ఈక్వేషన్స్‌ని బట్టి ఆయా సినిమాలు సాధించే విజయాలు ఆధారపడి వుంటాయి..' అంటూ మొన్నీమధ్యనే సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే. 'ట్యూబ్‌లైట్‌' సినిమాపై భారీ అంచనాలున్నాయి. సల్మాన్‌ఖాన్‌ గత రెండు చిత్రాలూ వరుసగా భారీ విజయాల్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో 'ట్యూబ్‌లైట్‌' సినిమా రికార్డుల్ని కొల్లగొట్టేస్తుందని బాలీవుడ్‌ సినీ జనం భావిస్తున్నారు. 

అయితే, 'దంగల్‌' రికార్డుల్ని దాటేస్తుందేమోగానీ, 'బాహుబలి ది కంక్లూజన్‌' రికార్డుల్ని దాటేయడం అంత సులువు కాదని బాలీవుడ్‌ ట్రేడ్‌ పండితులు లెక్కలు కడ్తుండడం విశేషమే మరి. నిజానికి, 'బాహుబలి' లాంటి సినిమాలు చాలా చాలా అరుదుగా వస్తాయి. సినిమాలోని కంటెంట్‌ గొప్పతనం పక్కన పెడితే, మార్కెటింగ్‌ వ్యూహాలు అన్నిసార్లూ అంత పక్కాగా కలిసొస్తాయని అనుకోలేం. 'బాహుబలి' ఓ ప్రభంజనం. ఈ విషయాన్ని బాలీవుడ్‌ ట్రేడ్‌ పండితులే ఒప్పేసుకుంటున్నారు. 

సల్మాన్‌ఖాన్‌ అన్నట్టు, ఏమో.. రికార్డులు కొల్లగొట్టేయొచ్చేమో. కానీ, అదంత వీజీ కాదు. అలాగని, అసాధ్యమూ కాదు.

Show comments