ప్చ్‌.. సుమన్‌కి అలాంటోళ్ళు దొరకలేదు

సామాన్యుడిని సంతోషపెట్టే 'నాయకుడు' తనకు కనిపిస్తే, అప్పుడు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానంటున్నాడ ప్రముఖ నటుడు సుమన్‌. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సుమన్‌, గతంలో తెలంగాణ ఉద్యమానికి బాహాటంగా మద్దతిచ్చాడు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు మద్దతుగా అనేక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు. అప్పట్లో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరతారన్న ప్రచారం జరిగింది కూడా. 

అయితే, సందర్భానుసారం ఆయా రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడటం తప్ప, ఏ పార్టీలోనూ సుమన్‌ చేరలేదు. సినిమాలు కాకుండా, అడపా దడపా 'కరాటే'కి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు సుమన్‌. రాజకీయాల్లోకి రావొచ్చు కదా.. అని ఎవరన్నా అడిగితే, ప్రస్తుత రాజకీయాలు అంత క్లీన్‌గా లేవని చెబుతాడు. కానీ, రాజకీయాల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలని అంటుంటాడు సుమన్‌. 

అయినా, మంచి నాయకుడికి ప్రస్తుత రాజకీయాల్లో స్థానం లేదు. అవకాశవాద రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఛాన్స్‌ తీసుకోవాలి కదా.! సినీ రంగంలోనో, ఇతర రంగాల్లోనో పాపులారిటీ పెంచుకుంటున్నవారు, రాజకీయాల పట్ల ఇంత 'చిన్నతనం'తో కూడిన భావనలు కలిగి వుండడం కూడా సబబు కాదు. రాజకీయాల గురించి మాట్లాడతాం, కానీ రాజకీయాల్లోకి వచ్చేందుకు అనుకూల పరిస్థితులు లేవంటే ఎలా.? 

హిట్‌ సినిమా ఫార్ములాని ఫాలో అవడం సినిమాల వరకూ బాగానే వుంటుంది.. అదే ఫార్ములా రాజకీయాల్లోనూ ఫాలో అవుతామనుకుంటే ఎలా.? 

Show comments