చంద్రబాబు.. మీకు మరో పనేం లేదా!

నిన్న రాత్రి తొమ్మిది గంటలప్పుడు.. విజయవాడలోని పుష్కర ఘాట్ ఆకస్మిక తనిఖీకి వచ్చారట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు! బాబు గారి దీక్షాదక్షత కు ఇదే నిదర్శనం.. పుష్కరాల ఏర్పాట్ల పట్ల ఆయన ఎంత చిత్తశుద్ధి చూపుతున్నారో అర్థం చేసుకోవడానికి ఇదే తార్కాణం.. అనే సెన్స్ తో మొదలుపెట్టారు తెలుగుదేశం వాళ్లు, ఆ పార్టీ అనుకూల మీడియా!

మరి వీళ్లకు ఇలా అనిపిస్తోంది కానీ.. ఏపీ సీఎం తీరును చూస్తుంటే.. బాబుగారికి ఇప్పట్లో పుష్కరాలు తప్ప మరో పనేమీ లేదా?  అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు సగటు ఆలోచనా పరులు. ఈయన ఆంధ్రప్రదేశ్ కు సీఎంనా లేక.. పుష్కరాల ఈవెంట్ మేనేజరా? అనే సందేహం చాలా పాతదే. ఇప్పుడు బాబుగారి తీరును చూస్తుంటే.. ఈయన సీఎం కాదు, కచ్చితంగా ఈవెంట్ మేనేజరే అనుకోవాల్సి వస్తోందని  వారు అంటున్నారు.

రాష్ట్ర ప్రజల కోసం అనునిత్యం పని చేసే శ్రామికుడు, అమరావతి వంటి అద్భుత రాజధానిని సృష్టిస్తున్న వ్యక్తి.. ఇలా ఒక పుష్కర ఘాట్ చుట్టూ తిరుగుతూ.. ఏర్పాట్ల గురించి తనిఖీలు చేస్తుండటాన్ని చూస్తే.. ఈయనకు ఈయన మీదే నమ్మకం లేదా? లేక వేరే పనిలేక.. ఇలా తిరుగుతున్నారా! అంటూ సీరియస్ గా ప్రశ్నిస్తున్నారు వారు.

ఇప్పుడా… రెండు మూడు నెలల నుంచి ఎన్ని సమీక్షలు నిర్వహించి ఉంటారో లెక్కలేదు. వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు.. ప్రత్యేకంగా అధికారులను నియమించారు, వారిపై మంత్రులకు బాధ్యతలను అప్పగించారు.. మరి ఇంత వ్యవస్థ ను పెట్టినా బాబు గారు మాత్రం తమ విలువైన సమయాన్ని ఒక పుష్కర ఘాట్ లో  పరిస్థితులను చూడటానికి కేటాయిస్తున్నారు!

ఇంత వరకూ చరిత్రలో ఏ సీఎం అయినా ఇలా చేసి ఉంటారా? పుష్కరాలు తప్ప మరో పనేం లేదన్నట్టుగా వ్యవహరించి ఉంటారా? తోచనమ్మ తోడి కోడలు పుట్టింటికి వెళ్లినట్టుగా.. ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి వ్యక్తి చేయాల్సిన పనులు చేస్తున్నారు బాబుగారు. అదేమంటే.. పుష్కర ఏర్పాట్లపై ఆయనకున్న శ్రద్ధ అలాంటిది అంటారు. 

ఇంత సీరియస్ నెస్ గా బాబుగారు దగ్గరుండి జనాలకు స్నానాలు చేయిస్తున్నా.. జరిగే ఘోరాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఏపీలో కృష్ణా పుష్కర ఘాట్లలో ఈ సారి కూడా కొన్ని ప్రాణాలు పోయాయి. తొలి రోజే పిల్లాడు నీట మునిగి చనిపోయాడు.. ఇంతకు మించిన ఫెయిల్యూర్ ఏముంది? అప్పుడు 29 మంది ప్రాణాలు పోయాయి.. ఇప్పుడూ పోతున్నాయి. పాఠాలు నేర్చింది ఎక్కడ? విజయవంతం అని ప్రకటించుకునే ముందు ఆ పసివాడి ప్రాణాలు గుర్తుకురావా?

పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలు కూలడంతో పాటు.. కొన్ని చోట్ల ఆడవాళ్లు బట్టలు మార్చుకోవడానికి అవకాశం లేకపోవడంతో.. వెంట వచ్చిన బంధువులు చీరలను తెరగా పట్టుకోవాల్సిన దుర్గతి కొనసాగుతోంది. అంటే బాబుగారు నిద్రపోకుండా.. పుష్కర ఘాట్ల చుట్టూ తిరుగుతున్నా.. ఇలా ఉన్నాయి పరిస్థితులు. ఈ లెక్కన ఈవెంట్ మేనేజ్ మెంట్ లోనూ ఫెయిల్యూరే కదా!

Show comments