ఉడ్తా హైద్రాబాద్‌: గీ ట్విస్టు ఏంది కేసీయారూ.?

తెలంగాణ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది డ్రగ్స్‌ వ్యవహారాన్ని. 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు పంపిన తెలంగాణ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 'సిట్‌', సుమారు 20 మందిని అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. సినీ ప్రముఖుల విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 8 మందిని విచారించింది కూడా. మరికొందరు సినీ ప్రముఖులకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారనీ, కొన్ని అరెస్టులూ తప్పవన్న సంకేతాలు వెలువడ్తున్న వేళ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఈ డ్రగ్స్‌ వ్యవహారాన్ని కొత్త మలుపు తిప్పేశారు. 

డ్రగ్స్‌ కేసుకి సంబంధించి ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై నివేదిక అందించారు. ఈ సమావేశంలో డ్రగ్స్‌ వాడినవారు బాధితులవుతారు తప్ప, నేరస్తులు కారని తేల్చేశారు కేసీఆర్‌. డ్రగ్స్‌ సరఫరాదారులు, వ్యాపారులు మాత్రమే నేరస్తులని కేసీఆర్‌ సెలవిచ్చారు. ఇది నిజంగానే షాకింగ్‌ విషయం. ఎందుకంటే, డ్రగ్స్‌ వాడినా నేరస్తులేనంటూ మొన్నీమధ్యనే తెలంగాణ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ స్పష్టం చేశారు. 

ఇంతకీ, ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ చెప్పింది నిజమా.? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పింది నిజమా.? ఇప్పుడీ అంశం ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. 

కొసమెరుపేంటంటే, సినీ పరిశ్రమపై వేధింపులు వుండవనీ, డ్రగ్స్‌ని తరిమివేసేందుకోసమే విచారణ జరుగుతోందనీ, విచారణ ఎదుర్కొంటున్న సినీ ప్రముఖుల్ని బాధితులుగానే చూస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెలవిచ్చారట. ఇంకేముంది, ఖేల్‌ ఖతమ్‌ దుకాణ్‌ బంద్‌.! అంతన్నాడింతన్నాడే గంగరాజు.. అన్నట్టు తయారయ్యింది వ్యవహారమిప్పుడు. అంతేనా, తెలంగాణలో డ్రగ్స్ తీవ్రత అంతగా లేదని కేసీఆర్ చెప్పడం మరో విశేషం.

Show comments