పన్నీర్ స్కోరు .. సున్నా?!

ఒకవైపు విశ్వాస తీర్మానం నెగ్గుతాను అని ప్రకటిస్తున్నాడు కానీ.. నిజంగానే పన్నీర్ దగ్గర అంత సీనుందా? అనే సందేహం కలుగుతోంది ఇప్పుడు! కేంద్రంలో బీజేపీ సహకారం ఉన్నా, ప్రతిపక్ష డీఎంకే అండగా నిలిచినా.. పన్నీరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంత సపోర్ట్ ఉంటుంది… అనే దాన్ని బట్టే ఈయన విశ్వాస పరీక్ష నెగ్గడం, నెగ్గకపోవడం ఆధారపడి ఉంది.

ప్రస్తుత పరిస్థితిని చూస్తే తమ దగ్గర ఏకంగా 131 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని శశికళ ప్రకటించేసింది! పార్టీ వాస్తవ బలం రమారమీ 135 కాగా, వారిలో ఖాళీ ఉన్న స్థానాలను, పన్నీరును పక్కన పెడితే.. ఎమ్మెల్యేలంతా చిన్నమ్మ దగ్గరే ఉన్నట్టు! 

వీళ్లందరినీ ఇప్పటికే ఒక స్టార్ హోటల్లో శశికళ వర్గం బంధించేసిందనే మాట వినిపిస్తోంది. రాజ్యాంగపరంగా ఎమ్మెల్యేల బలం తమకే ఉందని, మెజారిటీ తనకే ఉందని.. రాష్ట్రపతి అవకాశం ఇస్తే వీళ్లందరినీ ఢిల్లీ తీసుకెళ్లి పరేడ్ నిర్వహిస్తామని శశికళ వర్గం అంటోంది! గవర్నర్ మీద వీళ్లకు పూర్తిగా నమ్మకం పోవడంతో.. బంతిని రాష్ట్రపతి కోర్టులో నెట్టడానికి వీళ్లు ప్రయత్నిస్తున్నారు.

అయితే.. రాష్ట్రపతి వీళ్లకు అవకాశం ఇస్తాడా? కేంద్రం ఆ పరిస్థితిని రానిస్తుందా? సందేహాస్పదమైన విషయం. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే.. నిన్న రాత్రేమో తమ దగ్గర ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అరవైకి పైనే.. అని పన్నీరు వర్గం ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆయన వెంట పట్టుమని నాలుగైదు మంది ఎమ్మెల్యేలు కూడా కనిపించడం లేదు.

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చాలా అలర్ట్ గా ఉన్నారని, త్రాసు ఎటు మొగ్గితే అటువైపు జంప్ చేయడానికి వీళ్లు రెడీగా ఉన్నారని.. పరిశీలకులు అంటున్నారు. మున్నార్గుడి మాఫియా వీరిని బలవంతంగా అదిమి పట్టిందని.. ఏ మాత్రం అవకాశం చిక్కినా చాలా మంది బయటపడతారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అయితే ఎంతమంది ఎమ్మెల్యేలను బంధీలుగా పెట్టుకున్నా.. గవర్నర్ శశికళ విషయంలో యాంటీగా ఉన్నాడని స్పష్టం అయిపోయింది. మరి ఆమె చేత ప్రమాణం చేయించేదెవరు? కోర్టు తీర్పు వచ్చే వరకూ గవర్నర్ ఎవరికీ అందుబాటులోకి రాడేమో!

Show comments