రేవంత్‌రెడ్డి 'వెర్రి' ఆనందం.!

కాంగ్రెస్‌ పార్టీకి తగిన శాస్తి జరిగిందంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెగ ఆనందపడిపోతున్నారు. రాజకీయాల్లో ఇంతకన్నా వెర్రి ఆనందం ఇంకేమన్నా వుంటుందా.? ఆయన ఆనందం ఎందుకో ఈపాటికి అర్థమయ్యే వుంటుంది. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు ఆపరేషన్‌ ఆకర్షని, కాంగ్రెస్‌ వైపు మళ్ళించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ వివేక్‌, మాజీ మంత్రి వినోద్‌, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో ఈ రోజు కేసీఆర్‌ సమక్షంలో చేరారు. 

ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన రేవంత్‌రెడ్డి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష ప్రయోగించినప్పుడు, కాంగ్రెస్‌ పార్టీని అప్రమత్తం చేసినా పట్టించుకోలేదనీ, అప్పుడే టీఆర్‌ఎస్‌ తీరుని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఎండగట్టి వుంటే, ఇప్పుడు కాంగ్రెస్‌కి ఈ దెబ్బ తగిలేది కాదని సెలవిచ్చారు. కాంగ్రెస్‌కి జరగాల్సిందే జరిగిందంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. 

ఎక్కడన్నా తన కొంప కొల్లేరయ్యిందని ఎవరైనా బాధపడాలి. తనతోపాటు తన పక్కనున్న కొంప కూడా తగలడిందని సంతోషించేవాళ్ళని ఏమనాలి.? రేవంత్‌రెడ్డి తీరు చూస్తోంటే ఇదే గుర్తుకొస్తోంది అందరికీ. అయితే, రేవంత్‌ అన్న మాటల్లో కొంత వాస్తవం లేకపోలేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, టీడీపీని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నప్పుడు, కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా ప్రశ్నించి వుండాల్సింది. టీడీపీ, తెలంగాణ నుంచి ఔట్‌ అయిపోతే, తామే మిగులుతామని కాంగ్రెస్‌ భావించింది. కేసీఆర్‌ దెబ్బ గతంలోనే రుచి చూసిన కాంగ్రెస్‌ పార్టీ, ఆపరేషన్‌ ఆకర్ష విషయంలో ఇదిగో ఇలా తక్కువ అంచనా వేసి బోల్తాకొట్టేసింది.

Show comments