ఖాన్ కాటుకి చెప్పుదెబ్బ.!

అసలు ఖాన్‌లకు ఏమయ్యింది.? సూపర్‌ స్టార్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్న బాలీవుడ్‌ 'ఖాన్‌' త్రయం ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని ఎందుకు కొనితెచ్చుకుంటున్నారు.? సున్నితమైన విషయాల్లో ఎందుకిలా నోరు జారేస్తున్నారు.? అభిమానులకు ఏం సంకేతాలు పంపదలచుకుంటున్నారు.? అసలు దేశం పట్ల, సమాజం పట్ల ఈ 'ఖాన్స్‌'లో ఎందుకింత వక్రబుద్ధి.? ఇలా సదటు భారతీయుడి ఆలోచనలు గిరగిరా తిరుగుతున్నాయి.. ప్రశ్నలు వేధిస్తున్నాయి.. సమాధానాలు మాత్రం దొరకడంలేదు. 

షారుక్‌ఖాన్‌కి వివాదాలు కొత్త కాదు. అయితే తెలివిగా ఆ వివాదాలనుంచి తప్పించుకుంటుంటాడు. మిగతా ఖాన్స్‌తో పోల్చితే షారుక్‌ఖాన్‌ కాస్త బెటర్‌ అంతే. అసహనం విషయంలో ఏదో మాట్లాడి వివాదాస్పదుడిగా వార్తల్లోకెక్కి, అంతలోనే సారీ చెప్పి తప్పించుకున్నాడు. 

ఇక, అమీర్‌ఖాన్‌.. ఎప్పుడూ కామ్‌గా వుంటాడు. అప్పుడప్పుడూ వివాదాల్లోకెక్కుతుంటాడు. 'అసహనం' అమీర్‌ఖాన్‌ని నిండా ముంచేసింది. దేశంలో అసహనం వుందో లేదోగానీ, అమీర్‌ఖాన్‌ మాత్రం అసహనంతో రగిలిపోయాడు, దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు కూడా. అప్పట్లో సారీ చెప్పాడు, ఆ తర్వాత తీరిగ్గా.. బుకాయించాడనుకోండి.. అది వేరే విషయం. అప్పటికీ ఇప్పటికీ అమీర్‌ఖాన్‌ని అభిమానించే అభిమానగణంలో స్పష్టమైన తేడా కన్పిస్తోంది. సోషల్‌ మీడియాలో 'హేటర్స్‌' ఎక్కువగా వున్నది అమీర్‌ఖాన్‌కే. 

ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ హవా నడుస్తోంది. పాజిటివ్‌గా కాదు, నెగెటివ్‌గా. 'రేప్‌' గురించి చేసిన వ్యాఖ్యలతో సల్మాన్‌ఖాన్‌ పాపులర్‌ అయ్యాడు. 'నాయక్‌ నహీ.. ఖల్‌ నాయక్‌ హూ మై..' అంటూ వివాదాల్లోకెక్కాడు. నెటిజన్లు కడిగి పారేస్తున్నారు. సభ్య సమాజం 'ఛీ' కొడుతోంది. అయినా, కలుగులో ఎలకలా దాక్కున్నాడే తప్ప, చేసిన దిక్కుమాలిన వ్యాఖ్యలపై ఇంకా సల్మాన్‌ఖాన్‌ స్పందించలేదు. పైగా, కొందరు అభిమానులు సల్మాన్‌ఖాన్‌ని వెనకేసుకొస్తున్నారు. వారికీ తలంటు పడ్తోంది సోషల్‌ మీడియాలో. 

తాజాగా, సల్మాన్‌ఖాన్‌కి తలంటు పోసింది ఓ మహిళ. పైగా అత్యాచార బాధితురాలు. 'నేను అత్యాచార బాధితురాల్ని..' అని చెప్పుకోడానికి ఆమె సంశయించదు. ఎందుకంటే, అలా చెప్పుకోవడం నామోషీ కాదనీ, ఓ పశువు పశుత్వానికి తాను బలైపోయానని చెబుతుందామె. ఆమె ఎవరో కాదు, సునీతా కృష్ణన్‌. మొన్నీమధ్యనే పద్మశ్రీ పురస్కారం లభించిందామెకి. అత్యాచార బాధితుల్లో ధైర్యం నింపి, వారికి అండగా నిలవడం.. ఆమె జీవితాన్ని మార్చేసింది. ఈ పోరాటంలో ఆమె ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు, నిలిచి గెలిచారు. ఆమె రాసిన లేఖ, సల్మాన్‌ఖాన్‌ చదివితే ఇంకేమన్నా వుందా.? 

ఇక, ఆమె రాసిన లేఖలో సల్మాన్‌ఖాన్‌ పేరుని ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆ పేరు చెప్పడానికే తనకు జుగుప్సాకరంగా వుందని ఆమె పేర్కొన్నారంటే సల్మాన్‌ఖాన్‌ని ఆమె ఎంతగా ధ్వేషిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సినిమా కబుర్లు చెప్పడానికి ఇంటర్వ్యూలంటూ మీడియా ముందుకొస్తారు తారలు. అలా వచ్చినప్పుడు సినిమా విశేషాలు చెప్పక, అత్యాచార బాధితురాలైన మహిళతో తనను తాను పోల్చుకోవడమేంటి.? సల్మాన్‌ఖాన్‌ చేసిన ఈ చెత్తపనిని సునీతా కృష్ణన్‌ కడిగి పారేశారు. 

ఏ స్థాయిలో కడిగి పారేశారు.? అంటే, సల్మాన్‌ఖాన్‌ చదివినా, ఆయన చెవిలో ఆమె రాసిన లేఖ వివరాలు ఎవరన్నా వేసినా.. ఇక అంతే సంగతులు. ఒక్క మాటలో చెప్పాలంటే, కుక్క కాటుకి చెప్పుదెబ్బ అనాల్సిందే. 

ఖాన్‌లు మాత్రమేనా.? ఇంకెవరూ వివాదాల్లోకి ఎక్కడంలేదా.? అంటే, బాలీవుడ్‌లో తిరుగులేని ఫాలోయింగ్‌ వున్నది ఈ ఖాన్స్‌కి మాత్రమే. ఇక్కడ మతం కాదు ముఖ్యం. అంతటి పొజిషన్‌లో వున్న వ్యక్తులు, ఇంత చీప్‌గా బిహేవ్‌ చేస్తోంటే.. ఆ మచ్చ 'ఖాన్‌ త్రయానికి' కాక ఇంకెవరికి ఆపాదించగలం.?

Show comments