చిన్ని డాక్టరూ ఎందుకు చచ్చిపోతున్నావ్‌.?

ఆత్మహత్య మహాపాపం.. ఇది అందరూ చెప్పే మాట. కానీ, యువతరం ఆత్మహత్యలతో నిర్వీర్యమయిపోతూనే వుంది. లోపమెక్కడ.? అసలేం జరుగుతోంది.? ఇలాగే ఆత్మహత్యలు కొనసాగుతూ వుంటే, మనది యువ భారతం కాదు, ఆత్మహత్యల భారతమవుతుంది. దురదృష్టవశాత్తూ దేశంలో ఆత్మహత్యల సంఖ్య ఏడాదికేడాదీ సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే వుంది. 

ఇక, అసలు విషయానికొస్తే దురదృష్టవశాత్తూ వైద్య విద్యార్థులూ ఆత్మహత్యలతో వార్తల్లోకెక్కుతున్నారు. గడచిన ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా నలుగురు వైద్య విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 152వ ర్యాంక్‌ సాధించి, వైద్య విద్యలో చేరిన ఓ విద్యార్థి, తనకు మెడిసిన్‌ చదవడం ఇష్టం లేదని పేర్కొంటూ ఆత్మమత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమైన విషయం. చాలా సందర్భాల్లో తట్టుకోలేనంత ఒత్తిడి, చిట్టి మెదళ్ళను తొలిచేస్తూ, ఆ ఒత్తిడిలోనూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

ఏదో ఆషామాషీగా తీసుకునే విషయం కాదు. వైద్య విద్యనభ్యసించాలంటే కోట్లు తగలెయ్యాలిప్పుడు. ఎంతో ప్యాషన్‌ వుంటే తప్ప, వైద్య విద్యవైపు యువత చూడదు. అలాంటిది, వైద్య విద్యనభ్యసిస్తోన్న యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. వైద్య విద్య మీద మమకారంతో కష్టపడి చదివి, సీటు సాధించిన విద్యార్థులు, ఆ కష్టాన్ని మర్చిపోయి, సింపుల్‌గా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమే. ప్రాణం తీసుకోవడమంటే చిన్న విషయం కాదు కదా. ఎంతో బలమైన కారణమే వుండాలి. దురదృష్టవశాత్తూ చాలా ఆత్మహత్యల్లో 'సాదా సీదా కారణాలే' ఎక్కువగా వుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 

ఒత్తిడి కారణంగా, చిన్న సమస్య కూడా చాలా చాలా పెద్దదిగా కన్పిస్తుంటుంది. అదే చాలా ఆత్మహత్యలకు ప్రధాన కారణమవుతోంది. 'ఆత్మహత్యలు వద్దు.. చచ్చి సాధించేది ఏమీ లేదు.. చేతనైతే బతికి సాధించు..' అంటూ ఎవరెన్ని మాటలు చెబుతున్నాసరే, యువత అర్థాంతరంగా తనువు చాలిస్తుండడం అత్యంత బాధాకరం. కన్నవారికి కడుపు కోతను మిగుల్చుతున్న ఇలాంటి ఆత్మహత్యల్ని నివారించేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి వుంటుంది. 

మెడికో విద్యార్థులే కాదు, ఈ మధ్యకాలంలో ఇంజనీరింగ్‌ విద్యార్థులూ ఆత్మహత్యల్లో పోటీ పడుతున్నారు. విద్యార్థి దశ చాలా సున్నితమైనది. ఇక్కడే సమస్యలొస్తున్నాయి. యువత దేశ సంపద. ఆ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంది. కుటుంబం, కాలేజీ యాజమాన్యం, ప్రభుత్వం, సమాజం, స్నేహితులు.. ఇలా ఒకరేమిటి.. ప్రతి ఒక్కరూ 'యువ సంపద'ను కాపాడుకోని పక్షంలో, యువ భారతం.. అని మనం గొప్పగా చెప్పుకుంటున్న మన దేశం.. ముందు ముందు నిర్వీర్యమైపోయే ప్రమాదం లేకపోలేదు.

Show comments