అక్కడ ‘బాహుబలి’ ఎవరో తెలుసా.?

'బాహుబలి' సినిమా మేనియా, రాజకీయాల్లోనూ కన్పిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి బాహుబలి త్వరలోనే వస్తాడంటూ ఆ మధ్య తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జానారెడ్డి 'బాహుబలి' జపం షురూ చేసేశాక, 'మా పార్టీలో బాహుబలులు చాలామందే వున్నారు..' అంటూ చిన్నా చితకా నేతలూ 'బాహుబలి' మేనియాలో ఊగిపోయారు. ఇంతకీ, కాంగ్రెస్‌ చెబుతోన్న ఆ బాహుబలి ఎవరు.? ఈ ప్రశ్నకు సమాధానం హరీష్‌రావు అనే అంటున్నారు చాలామంది. 

టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేనల్లుడైన హరీష్‌రావు, కాంగ్రెస్‌ పార్టీకి బాహుబలి అవడమేంటట.? ఈ ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. నిజానికి, కేసీఆర్‌ అంటే హరీష్‌రావుకి అమితమైన అభిమానం. అభిమానం కాదది, భక్తి.. అనొచ్చేమో. 'మేనమామ మాత్రమే కాదు, కేసీఆర్‌ నాకు తండ్రిలాంటి వ్యక్తి.. దేవుడితో సమానం..' అని చెబుతుంటారు హరీష్‌రావు. అయినాసరే, కుటుంబ రాజకీయాలు హరీష్‌రావుని ఒకింత ఇబ్బంది పెడుతున్నాయి ఇటీవలి కాలంలో. 

హరీష్‌రావు కన్నా వెనకొచ్చిన కేటీఆర్‌, కవితే టీఆర్‌ఎస్‌లో ఇప్పుడు దూసుకుపోతున్నారు. వారికి టీఆర్‌ఎస్‌లో విపరీతమైన ప్రాధాన్యత దక్కుతోంది. పైగా, తన తర్వాత పార్టీ బాధ్యతల్ని కేటీఆర్‌కి అప్పగించేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. మంత్రి వర్గంలోనూ హరీష్‌ ప్రాధాన్యత రోజురోజుకీ తగ్గుతూ వస్తోంది. ఇదంతా నాణానికి ఓ వైపు. ఏం చేసినా, టీఆర్‌ఎస్‌ని వదిలి హరీష్‌ ఇంకో పార్టీలో చేరతారా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 

అయితే, చిన్నపాటి అసంతృప్తి హరీష్‌రావులో ఏదో ఒక మూల కన్పిస్తోంది గనుక, దాన్ని పెద్దది చేయడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. 'కాంగ్రెస్‌లోకి వస్తే హరీష్‌రావే ముఖ్యమంత్రి అభ్యర్థి..' అనే ప్రచారాన్ని కొందరు నేతలు తెరపైకి తెస్తున్నారు. అయితే, 'కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తాం..' అంటూనే, కాంగ్రెస్‌లో చాలామంది గొప్ప నేతలున్నారనీ, వారి ముందు హరీష్‌ చిన్నవాడైపోతాడని ఇంకొందరు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. 

మొత్తమ్మీద, కాంగ్రెస్‌ పార్టీలో 'నాయకత్వ లేమి' ఇప్పుడు సుస్పష్టం. హరీష్‌ తప్ప, తమ పార్టీని బాగుచేసే నాయకుడే లేడని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భావిస్తుండడం, ఆ పార్టీ దయనీయ స్థితికి నిదర్శనం.

Show comments