హైదరా'బాధలు' పట్టని నీరో చక్రవర్తి.!

రోమ్‌ తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడట. ఇది ఒకప్పటి మాట. హైదరా'బాధలు' ఓ పక్క - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హంగులు ఇంకో పక్క. ఇది నేటి మాట. రోడ్లు నాశనమైపోయి, జనం నానా పాట్లూ పడ్తోంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, సచివాలయానికి వాస్తు దోషాలు వున్నాయి గనుక, ఆఘమేఘాల మీద దాన్ని కూల్చేసి, కొత్త సచివాలయాన్ని కట్టెయ్యడానికి సన్నద్ధమవుతున్నారు. 

ప్రస్తుత సచివాలయం పుణ్యమా అని ఎవడూ బాగుపడలేదట. ఇదెక్కడి లాజిక్‌. చంద్రబాబు రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు.. అదీ ఏకధాటిగా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎవరూ ఊహించని విధంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా చాలానే జరిగాయి. సచివాలయం అంటే, పరిపాలనా కేంద్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్ళింది మరి గతంలో.. అదీ సచివాలయ కేంద్రంగానే. 

కుక్కని చూపించి, ఇది కుక్క కాదు నక్క.. అని కేసీఆర్‌ చెబితే, అంతా 'అవును, అది నక్క..' అని తీరాల్సిందే అన్నట్లుందికదూ.! అంతే మరి, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా తాత్కాలిక సచివాలయం కట్టుకుంది గనుక, తెలంగాణకీ కొత్త సచివాలయం వచ్చి తీరాల్సిందేనన్నది కేసీఆర్‌ ఆలోచనలు కావొచ్చుగాక. అయినా, ఈ వాస్తు పిచ్చి పాలకులకు పడితే, అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటుండదు. చంద్రబాబునీ ఈ విషయంలో తప్పు పట్టాల్సిందే. 

సరే, సచివాలయం కొత్తగా కట్టాలనే నిర్ణయాన్ని తప్పు పట్టడం పక్కన పెడదాం. రోడ్ల దుస్థితి కారణంగా ప్రాణాలు పోతున్నాయి కదా. ఆ లెక్కన, ముందుగా బాగు చెయ్యాల్సింది రోడ్లే కదా.! అప్పుడెప్పుడో చాలా రోజుల క్రితం భారీ వర్షాలు పడి, నగరంలోని రోడ్లు సర్వనాశనమైపోయాయి. 'చచ్చిపోతున్నా, కాసిని నీళ్ళు నోట్లో పొయ్యండిరా..' అని ఒకడేడుస్తోంటే, ముహూర్తం సరిగా లేదన్నాడట వెనకటికొకడు. రోడ్లు బాగుచెయ్యాలంటే దసరా వెళ్ళాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం చెబుతుండడం అలాగే వుంది మరి.! 

దసరా వెళ్ళింది, దీపావళి కూడా వచ్చేస్తోంది. ఏదీ ఎక్కడ.? రోడ్లు చూస్తే నిత్య నరకంగా తయారైపోయాయి. ఆసుపత్రుల్లో ఇతర రోగాల కన్నా, రోడ్ల కారణంగా పుట్టుకొస్తున్న కొత్త రోగాలతో సతమతువుతున్న పేషెంట్లే ఎక్కువైపోయారు. ఇదేం ఖర్మ మొర్రో.? అంటూ జనం నెత్తీ నోరూ బాదుకోవాల్సి వస్తోంది. విశ్వనగరం సంగతి దేవుడెరుగు, విశ్వనరకం అంటే ఏంటో హైద్రాబాద్‌ రోడ్లు చూపిస్తున్నాయన్నది జనం వాదన. 

భారీ వర్షాలతో హైద్రాబాద్‌లో 10 శాతం రోడ్లే పాడయ్యాయని అప్పట్లో కేసీఆర్‌ చెప్పుకున్నారు. ఆయన నేల మీదకు దిగి, రోడ్ల మీద ప్రయాణిస్తే.. అది 10 శాతమో, 90 శాతమో అర్థమవుతుంది.

Show comments