'సింగం-3'తో సూర్య ఏం చేస్తాడో.!

హిట్‌ సినిమాలు చేస్తున్నాడు.. ఫ్లాప్‌ సినిమాలు చేస్తున్నాడు.. ప్రయోగాత్మక సినిమాలతోనూ ఆకట్టుకుంటున్నాడు.. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్లతోనూ ఆకట్టుకుంటున్నాడు.. తమిళ హీరో సూర్య, సినిమా సినిమాతో తన స్టార్‌డమ్‌ని పెంచుకుంటూనే వున్నాడు. తమిళ సినిమా నుంచి జాతీయ స్థాయికి అతని టాలెంట్‌ ఎదుగుతోందన్నది నిర్వివాదాంశం. 

ఇక, తాజాగా సూర్య 'సింగం-3'తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. 'సింగం' సిరీస్‌ ఇప్పటికే బాలీవుడ్‌లోనూ పాపులర్‌ అయ్యింది. అయితే 'సింగం-3'ని బాలీవుడ్‌లోకి రీమేక్‌ కాకుండా, డబ్బింగ్‌ వెర్షన్‌నే డైరెక్ట్‌గా రిలీజ్‌ చెయ్యాలనుకుంటున్నారట. అది కూడా, సూర్య ఒత్తిడితోనేనట. 

అయితే, 'సింగం' సినిమా హిట్టయినా, 'సింగం-2' అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో 'సింగం-3'పైనా కాస్తో కూస్తో అనుమానాలున్నాయి. అదే సమయంలో 'సింగం-3'పై అంచనాలూ తక్కువగా ఏమీ లేవు. సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందని తమిళ సినీ ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హరి దర్శకత్వంలో రూపొందుతోన్న 'సింగం-3' దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show comments