దాసరి ఇంకా వెంటిలేటర్‌పైనే..

దర్శకరత్న దాసరి నారాయణరావు ఇంకా వెంటిలేటర్‌పైనే కృత్రిమ శ్వాస పొందుతున్నారు. ఇంకో మూడు రోజులపాటు ఆయన్ను వెంటిలేటర్‌పైనే వుంచుతామని ఆయనకు వైద్య చికిత్స అందిస్తోన్న 'కిమ్స్‌' వైద్యులు ప్రకటించారు. తాజాగా నేడు సాయంత్రం దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్‌ వైద్యులు 'మెడికల్‌ బులెటిన్‌'ని విడుదల చేశారు. 

ఐదు రోజుల క్రితం దాసరి నారాయణరావు, తీవ్ర అస్వస్తతో హైద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే. అన్నవాహికలో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో, ఆయనకు సర్జరీ కూడా నిర్వహించారు వైద్యులు. కిడ్నీల పనితీరు మందగించడంతో డయాలసిస్‌ సపోర్ట్‌ కూడా అందించామని వైద్యులు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం దాసరికి డయాలసిస్‌ నిలిపివేశారు. నిన్నటి నుంచీ డయాలసిస్‌ నిలిపివేయగా, ఈ రోజు ఉదయం పరిస్థితిని బట్టి వెంటిలేటర్‌ని కూడా తొలగించాలనుకున్నారు. 

మరోపక్క, దాసరిని పరామర్శిస్తున్న సినీ ప్రముఖులు కొందరు, దాసరికి వెంటిలేటర్‌ తొలగించారంటూ మీడియా ముందుకొచ్చి ప్రకటన చేయడం, అంతలోనే దాసరి ఇంకా వెంటిలేటర్‌పైనే వున్నారని వైద్యులు వెల్లడించడం గమనార్హం. వెంటిలేటర్‌పైనే వున్నా, దాసరి క్రమక్రమంగా కోలుకుంటున్నారనీ, చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నారనీ డాక్టర్లు ప్రకటించారు. 

ఇదిలా వుంటే, దాసరి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు సినీ నటుడు, నిర్మాత, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ చెప్పారు. ఆయనే, దాసరికి వెంటిలేటర్‌ తొలగించారనీ, రెండు మూడు రోజుల్లో సాధారణ వార్డుకి తరలించనున్నారనీ చెప్పారు. Readmore!

Show comments