ట్రంప్ ను డమ్మీగా మార్చేస్తున్నారా!

సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా అనిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అక్కడి న్యాయస్థానాల్లో చుక్కెదురవుతోంది. ఏడు ఇస్లామిక్ దేశాల శరణార్థులపై, అక్కడి పౌరులు అమెరికాలో అడుగు పెట్టకుండా జారీ చేసిన నిషేధాజ్ఞలను ఇప్పటికే న్యాయస్థానం ఎత్తేసింది! మళ్లీ శరణార్థుల ప్రయాణాలు మొదలయ్యాయి. ఎక్కడిక్కడ స్ట్రక్ అయిపోయి, ఆందోళన చెందిన వారు ఇప్పుడు ఆనంద భాష్పాలతో అమెరికాలో అడుగుపెడతున్నారు.

ముందుగా ట్రంప్ నిర్ణయాన్ని కట్టుదిట్టంగా అమలు చేసిన అమెరికన్ అధికారులు ఇప్పుడు కోర్టు తీర్పునూ అదే స్థాయిలో అమలు చేస్తున్నారు. ఇప్పటికే న్యాయవ్యవస్థపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశాడు. ఒక జిల్లా జడ్జి తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రూలింగ్ ఇవ్వడంపై ట్రంప్ మండి పడుతున్నాడు. ఏదైనా జరిగితే ఆ న్యాయమూర్తినే అనండని.. ట్వీట్ పోస్టు చేశాడు. అయితే ట్రంప్ ఈ విధంగా న్యాయమూర్తిపై నోరు పారేసుకోవడంపై అక్కడి న్యాయ వ్యవస్థ ఆక్షేపిస్తోంది.

ఇదిలా ఉంటే.. హెచ్ వన్ బీ వీసా చట్టం సవరణల ప్రతిపాదనలపై ఏకంగా వందకు పైగా టెక్ కంపెనీలు ఫెడరల్ కోర్టులను ఎక్కాయి. వివిధ న్యాయస్థానాల్లో ఇవి తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, ఈ విషయంలో ట్రంప్ దూకుడుకు కళ్లెం వేయాలని కోర్టులను కోరుతున్నాయి. ఇలా కోర్టుకు ఎక్కిన కంపెనీల్లో ఫేస్ బుక్, ఈబే, ట్విటర్ , ఇంటెల్ వంటి ఇంటర్నెట్, లెక్ ధిగ్గజాలతో పాటు.. వివిధ ఉత్పాదక వ్యవస్థలు కూడా ఉన్నాయి. 

ట్రంప్ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధం అని, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ, సృజనాత్మకత, సౌభాగ్యానికి వలస ప్రజల శక్తి యుక్తులు ఎంతగానో ఉపయోగపడ్డాయని, పడుతున్నాయని.. ఇలాంటి విషయంలో ట్రంప్ ప్రతిపాదనలు సరికావని కంపెనీలు వాదిస్తున్నాయి. 

మరి ఇస్లామిక్ దేశాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమలుకు అక్కడి న్యాయస్థానాలు సమ్మతించలేదు, ఆ విషయంలో ఆయనను డమ్మీగా మార్చేశాయి. మరి కంపెనీల న్యాయపోరాటంతో.. వలస ఉద్యోగుల విషయంలో కూడా ట్రంప్ ను కోర్టులు డమ్మీగా మార్చేస్తాయేమో చూడాలి!

Show comments