ప్యాకేజీకి చట్టబద్ధత.. ఇదో మోసం.!

హక్కుగా సంక్రమించాల్సిన వాటిని కేంద్రం, బిచ్చమేస్తామంటోంది. కేవలం ఇది ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే పరిమిదితం. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్‌లో పలు జాతీయ రహదారి ప్రాజెక్టులు సహా 'రహదారి ప్రాజెక్టుల' పేరుతో తన డిపార్ట్‌మెంట్‌ నుంచి అటూ ఇటూగా 65 వేల కోట్ల రూపాయల విలువైన 'ప్యాకేజీ' ప్రకటించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమేనా.? అంటే, పొరుగునున్న తమిళనాడుకి రెండు లక్షల కోట్ల పైన ప్రాజెక్టులు ఇలాంటివే ప్రకటితమయ్యాయి. తెలంగాణకీ 50 వేల కోట్ల పైన రహదారి ప్రాజెక్టులు ప్రకటితం కాగా, దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ ఈ ప్రాజెక్టులున్నాయి. 

కానీ, చిత్రంగా అదేదో ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం అన్నట్లు, రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయల ప్యాకేజీలో రహదారి ప్రాజెక్టుల్నీ చేర్చేశారు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీ. పోలవరం ప్రాజెక్టునే తీసుకుంటే, దాదాపు 30 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్ట్‌ ఇది. దీన్ని కూడా ప్యాకేజీలో పారేశారు. నిజమే మరి, పారేశారు.. అనాల్సిందే. ఎందుకంటే, విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా చేర్చారు. అంటే, అది ఆంధ్రప్రదేశ్‌ హక్కు. దాన్ని కూడా ప్యాకేజీలో చేర్చేశారు. చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. 

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఐఐఎంలు వున్నాయి, ఐఐటిలు వున్నాయి, ఇంకా చాలా చాలా వున్నాయి. అవేవీ ఆంధ్రప్రదేశ్‌లో నిన్న మొన్నటిదాకా లేవు. ఇప్పుడిప్పుడే ఏర్పాటవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వాటిని ఏర్పాటు చేయాలని విభజన చట్టం చెబుతోంది. కానీ, కేంద్రం వాటిని కూడా ప్యాకేజీలో కలిపేసింది. 

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం అనేదొకటి ఏడ్చింది. దాని ప్రకారమే కదా, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. మళ్ళీ మధ్యలో ఈ ప్యాకేజీ మాయ మాటలేంటి.? అని ప్రశ్నిస్తే, 'పదేళ్ళలోపు చెయ్యమన్నారు.. రెండేళ్ళలోనే చేసేస్తున్నాం.. అదేదో మా తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారా..' అని ఎదురు ప్రశ్నిస్తారు వెంకయ్యనాయుడు కామెడీగా. ప్రత్యేక హోదా ఏమయ్యిందయ్యా వెంకయ్యా? అనడిగితే, రెండేళ్ళు నాన్చి, అంతా హంబక్‌ అని తేల్చేశారాయన. పోనీ, రైల్వే జోన్‌ సంగతి తేల్చుతారా.? అంటే, అప్పుడే కాదంటున్నారు. రెండేళ్ళు సరిపోలేదు రైల్వే జోన్‌కి. రాజధాని ఎక్కడుందయ్యా? అనడిగితే నో ఆన్సర్‌. అద్దె భవనాల్లో కొన్ని జాతీయ సంస్థల్ని నడిపేస్తూ, బిచ్చం వేశాం.. పండగ చేసుకోండి.. అన్నది వెంకయ్య వాదన. 

తాజాగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మీడియాకి క్లాసులు పీకుతున్నారు. ప్యాకేజీ చాలా గొప్పదనీ, దానికి చట్టబద్ధత కల్పిస్తున్నారనీ, మీడియా ప్యాకేజీ విశేషాల్ని ప్రజలకు తెలియజెప్పాలనీ, ప్రజల్ని ఎడ్యుకేట్‌ చేయాలనీ సుజనా చౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఊకదంపుడు ప్రసంగం దంచేశారు. రోజూ వింటూనే వున్నాం కదా, వెంకయ్యగారి పాఠం. మళ్ళీ కొత్తగా మీడియాని ఎంటర్‌టైన్‌ చెయ్యాలని సుజనాకి ఎలా అన్పించిందో ఏమో.! పైగా, మీడియా పూర్తిగా టీడీపీ కనుసన్నల్లోనే వుంది. బీజేపీ ఆడిందే ఆట, పాడిందే పాట. బీజేపీకి చంద్రబాబు భజన చేస్తోంటే, మీడియా దాదాపుగా టీడీపీ - చంద్రబాబు భజన చేసేస్తోంది. ఇంకా కొత్తగా, మీడియా ప్యాకేజీపై ప్రచారం చేయాలంటే, పత్రికలు పాంప్లెట్లులా, న్యూస్‌ ఛానళ్ళు పార్టీల మైక్‌ల్లా మారిపోయి, మిగతా వార్తల్ని పూర్తిగా ఆపెయ్యాలేమో.! 

అయినా, కేంద్రం ప్యాకేజీ ఇస్తామని ఒక్క మాట అయినా అధికారికంగా చెప్పిందా.? లేదు కదా.! 'స్పెషల్‌ అసిస్టెన్స్‌' అని మాత్రమే అంటోంది. అచ్చంగా తెలుగులో చెప్పాలంటే అది ప్రత్యేక సాయం మాత్రమే. నిష్టూరమే అయినా నిజం చెప్పాలంటే, అది నూటికి నూరుపాళ్ళూ బిచ్చమే. '100 కోట్లు ఇస్తే బిచ్చమంటారా.? 1000 కోట్లు అంటే ముష్టి అంటారా.? అలాగైతే, ఎవరిస్తారో చెప్పండి, నేను బిచ్చమడుక్కుంటా..' అని వెంకయ్య నిన్న ఆవేశంతో ఊగిపోయారు. 

వంద కోట్లు, వెయ్యి కోట్లు, లక్ష కోట్లు అయినా దానికి ప్యాకేజీ పేరు చెబితే, అసిస్టెన్స్‌.. అని కథలు చెబితే.. అది నూటికి నూరుపాళ్ళూ బిచ్చమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, రాష్ట్రానికి దక్కాల్సినవన్నీ దక్కడం అనేది న్యాయం. ఆ చట్టం ద్వారా సంక్రమించిన హక్కుని కాల రాసి, సాయం చేస్తామంటే అది బచ్చం కాక ఏమవుతుంది.? ప్రత్యేక హోదాతోపాటుగా, విభజన చట్టం అమలయి తీరాలి. అదీ హక్కు అంటే. హక్కుకీ, బిచ్చానికీ తేడా తెలియకుండా, బిచ్చమేసి పండగ చేసుకోమంటోన్న సోకాల్డ్‌ మేధావులు రాజకీయాల్లో తగలడ్డారు కాబట్టే, ఆంధ్రప్రదేశ్‌ దుస్థితి ఇలా తయారైంది. ఎనీ డౌట్స్‌.?

Show comments