విధేయతకు బహుమానమా?

రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు ఏ పదవులు దక్కుతాయో తెలియదు. పదవులు దక్కడానికి, దక్కకపోవడానికి అనేక కారణాలుంటాయి. ఎవరి అదృష్టం వారిది. పదవులు లభించడం, లభించకపోవడం అనేది ఆయా నాయకుల పట్ల పార్టీల అధినేతల అభిప్రాయాలనుబట్టి ఉంటుంది. సమర్థులకు పదవులు రాకుండా, అసమర్థులు, అవినీతి ఆరోపణలు ఉన్నవారికి పదవులు వస్తుంటాయి.

ఇందుకు సామాజిక సమీకరణాలు, ఓటు బ్యాంకు, ఇతర రాజకీయ ప్రయోజనాలు కారణమవుతాయి. రాజకీయ నాయకులకు ఓపిక, విధేయత అవసరం. ఇవి రెండూ కూడా పదవులు రావడానికి కారణమవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెండు లక్షణాలు ఉన్న వ్యక్తికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవిని సీఎం చంద్రబాబు కట్టబెట్టబోతున్నట్లు సమాచారం.

ఎమ్మెల్సీ పదవి వరించబోయే వ్యక్తి సామాన్యుడేమీ కాదు. రాజకీయ నేపథ్యం ఉన్నవాడు. స్వయంగా రాజకీయ నాయకుడు. అంతేకాకుండా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు భర్త. ఆయనే పరకాల ప్రభాకర్‌. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్‌కు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ఇందుకు ఆయనకు చంద్రబాబు పట్ల ఉన్న విధేయత, ఓపిక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఏపీ-తెలంగాణ ప్రభుత్వాల మధ్య, ఇద్దరు సీఎంల మధ్య వివాదాలు వచ్చినప్పుడు, చంద్రబాబుపై పలు ఆరోపణలు వచ్చినప్పుడు వివాదాల్లో ఏపీ తరపున వాదించడంలో, బాబుపై ఆరోపణలను తిప్పి కొట్టడంలో పరకాల కీలక పాత్ర పోషించారు. చాలా విషయాల్లో తెలంగాణకు గట్టి కౌంటర్లు ఇచ్చారు. ఇది కూడా చంద్రబాబు దృష్టిలో ఉండొచ్చు.

బాబు అన్ని విదేశీ పర్యటనల్లో పరకాల పాల్గొన్నారు. విదేశాల్లో పారిశ్రామికవేత్తలతో బాబు నిర్వహించిన సమావేశాల్లో, చేసుకున్న ఒప్పందాల్లో పరకాల ముఖ్య పాత్ర పోషించారు. విశాఖపట్టణంలో జరిగిన మహానాడులోనూ పరకాలకు బాబు ప్రాధాన్యం ఇవ్వడం నాయకులకు ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న  పరకాల మహానాడులో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. టీడీపీ రాజకీయాలతో సంబంధం లేని పరకాల తీర్మానం ప్రవేశపెట్టడమేంటని కొందరు పెదవి విరిచారు. బాబు అనుమతి లేకుండా ఆయన తీర్మానం ప్రవేశపెట్టరు కదా...!

పరకాలకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే ఆలోచన బాబుకు చాలాకాలంగా ఉందని సమాచారం. ఒక దశలో ఆయన మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు సాగాయి. కాని కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదట. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే పరకాల ప్రభాకర్‌ను సలహాదారుగా చేర్చుకున్నారు. ఈయన తండ్రి పరకాల శేషావతారం ఒకానొక కాలంలో కాంగ్రెసులో కీలక నేత. తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్‌ను పరకాల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

చంద్రబాబు సీఎం కాగానే పరకాలను ప్రభుత్వంలో చేర్చుకోవడానికి బీజేపీతో ఏర్పడిన పొత్తు కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి. పరకాలను సలహాదారుగా పెట్టుకోవడానికి బీజేపీతో పొత్తు, నిర్మలా సీతారామన్‌ భర్త కావడం అనే కారణాలతోపాటు ఆయనకు ఉన్న బీజేపీ  మూలాలు కూడా ఇందుకు దోహదం చేసుండొచ్చు. ప్రజారాజ్యం పార్టీని 'కంపెనీ'గా అభివర్ణించి, టిక్కెట్లు అమ్ముకున్నారని నానా యాగీ చేసిన ఆ పార్టీ మాజీ నాయకుడు పరకాల ప్రభాకర్‌  ప్రజారాజ్యం పార్టీలో చేరకముందు ఈటీవీలో 'ప్రతిధ్వని' కార్యక్రమం నిర్వహించిన సంగతి గుర్తుండేవుంటుంది. 

క్రియాశీలక, ఎన్నికల రాజకీయాల్లో విఫలమైన తర్వాత ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా, ప్రత్యేకించి ఈటీవీ ద్వారా బాగా షైనయ్యారు. ప్రభాకర్‌ విద్యావంతుడు, నాలుగు విషయాలు తెల్సినవాడు కాబట్టి రామోజీరావు ప్రతిధ్వని ఆయనకు అప్పగించాడు. ఆ ప్రోగ్రాం చేసినన్ని రోజులు 'స్కూలు టీచరు' టైపులో దాన్ని నిర్వహించారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టగానే అల్లు అరవింద్‌ చిన్నప్పటి స్నేహితుడైన పరకాల పార్టీలోకి ప్రవేశించాడు.

ఇందుకు అతని నాలెడ్జి, రాజకీయ నేపథ్యం ప్రధాన కారణం. ప్రజారాజ్యం పార్టీలో పరకాలకు సముచిత స్థానమే ఇచ్చినప్పటికీ అది పార్టీ కాదని, కంపెనీ అని గ్రహించాట్ట. వెంటనే నిప్పులు చెరిగాడు. ఎన్నికల సమయంలో ఆయన పోసిన నిప్పులు ప్రజారాజ్యాన్ని కొంతవరకు కాల్చాయని చెప్పవచ్చు. మొత్తం మీద పరకాల ప్రభాకర్‌ మళ్లీ రాజకీయ నాయకుడు కాబోతున్నాడు.

Show comments