మీడియాలో బాబు..జనంలో జగన్

అలా అంటే తెలుగుదేశం అభిమానులకు సర్రున బీపీ పెరిగి కోపం రావడం సహజం. కానీ ఇది వేరే విషయం. రెగ్యులర్ గా బాబు కూడా జనాలతో మమేకం అయితే అవుతూ వుండవచ్చు. కానీ ఇక్కడ విషయం అది కాదు. రాయలసీమ కరువు విషయం ఇది. నెల క్రితం వున్నట్లుండి ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ వెళ్లారు. అప్పుడు బాబు అనకూల మీడియా హడావుడి ఇంతా అంతా కాదు. 

ఒక్కసారి నెలక్రితం పత్రికలు తిరగేస్తే వుంటుందీ..రాత్రికి రాత్రి చంద్రబాబు కరువును విసిరి సరిహద్దు అవతల విసిరిన రేంజ్ లో వుంటుంది వార్తల వంటకం. రెయిన్ గన్స్ ద్వారా తడి అందించడం, పంటలను బాబు తన మేథో శక్తితో కాపాడడం, చెరువుల్లో నీరు టాంకర్లతో నింపడం ఇలా ఒకటేమిటి? అబ్బో చాలా వుంది కథ. కానీ బాబు వెళ్లిన మర్నాడే చెరువుల సంగతి వదిలేసారని అప్పట్లోనే కొన్ని పత్రికల్లో కథనాలు వస్తే, కిట్టని కథనాలు అని ఎవరూ పట్టించుకోలేదు. 

కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి వుంది. ఈ కథనాలు అన్నీ రాయలసీమకు బయట వున్న వారు పట్టించుకుని వుంటే వుండొచ్చు.  ఎందుకంటే వారికి అక్కడ వాస్తవపరిస్థితి తెలియదు కాబట్టి. అబ్బో బాబు సూపర్.కరువును రాత్రికి రాత్రి వెళ్లగొట్టాడు అని అనుకుంటే అనుకుని వుండొచ్చు. కానీ అక్కడ సమస్య అనుభవిస్తున్న వారికి తెలుసు కదా అసలు సమస్య.  కరువు వాళ్లను ఏ విధంగా పీల్చి పిప్పి చేస్తోందో తెలుసు కదా? కరువు లేదని తెలుగుదేశం మంత్రులు ఏకరవు పెట్టినంత మాత్రాన సరిపోదు కదా?

అందుకే కావచ్చు, జగన్ నేరుగా అక్కడికే నెల తరువాత వెళ్లాడు. జనం భయంకరంగా తరలి వచ్చి స్వాగతం  పలికారు అంటే అర్థం ఏమిటి? నిజంగా కరువు లేకపోతే, జగన్ దగ్గరకు జనం ఎందుకు వెళ్తారు. నిజంగా కరువు లేకపోతే,  జనం జగన్ దగ్గరకు వెళ్లరు అని తెలిస్తే, చంద్రన్న దండు అని పేరు పెట్టుకుని, తెలుగుదేశం జనాలు జగన్ యాత్రకు ఎందుకు అడ్డం పడతారు. 

ఇక్కడ తెలుగుదేశం అనుకూల పత్రికలు ఒక ఏరియా సమస్యలను మరొక ఏరియాలో కప్పి పుచ్చ గలరు కానీ, ఎక్కడి సమస్యలు అక్కడి జనాలకు తెలియడానికి మీడియా తోడు అక్కరలేదు. జనం గుండెల బాధ జనానికి ఏ మీడియా చెప్పనక్కరలేదు. అందుకే జగన్ మీడియాను కన్నా జనాన్నే ఎక్కువగా నమ్ముకుంటున్నట్లు కనిపిస్తోంది. 

Show comments