దాన్ని లెక్క చేయనంటున్న చిరంజీవి!

కాపుల రిజర్వేషన్ల అంశంపై మెగా స్టార్ చిరంజీవి స్పందిస్తున్న తీరుపై కొన్ని విమర్శలు ఉన్న మాట వాస్తవమే. తెలుగు ప్రేక్షకులు కులాలకు, మతాలకు అతీతంగా ఆయనను హీరోగా ఆదరిస్తే ఇప్పుడు కేవలం ఒక కులం అది కూడా తన కులం రిజర్వేషన్ల అంశంపై స్పందిస్తున్న వారిలో చిరంజీవి ముందున్నాడు. కాపులకు తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్ల ఆశ జూపి ఉండవచ్చు గాక, తీరా అధికారం సంపాదించుకున్న తర్వాత మొండి చేయి చూపుతూ ఉండవచ్చు గాక.. అయితే ఏ సమస్య విషయంలోనూ స్పందించని చిరంజీవి కేవలం ఈ ఒక్క అంశం మీద మాత్రమే రెస్పాండ్ అవుతుండటం, ఈ రిజర్వేషన్ల పోరాటంటో.. కాపు ల పెద్దగా చెలామణి అవుతుండటం పై పెదవి విరుపులు ఎక్కువగానే ఉన్నాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. రైతుల సమస్యలు.. రుణమాఫీ.. నిరుద్యోగ యువత.. వంటి అంశాలన్నీ కూడా చంద్రబాబు ఎన్నికల హామీతో ముడి పడి ఉన్నవే, అయితే మెగాస్టార్ వాటిలో ఏ అంశం మీద కూడా స్పందించడం లేదు. సినీ నేపథ్యం నుంచి వచ్చిన రాజకీయ నేతగా, కాంగ్రెస్ ఎంపీగా ఉన్న ఆయన వీటిపై రెస్పాండ్ కావడం లేదు.

కేవలం కాపు రిజర్వేషన్ అంశం మీదే ఆయన రియాక్ట్ అవుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిరంజీవిని “అందరివాడు’’ కాదు ‘కొందరువాడే’  అంటోంది మీడియా. దీనిపై చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యాడు.

ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు.. అని మెగాస్టార్ తేల్చేశాడు. తనను అందరివాడు కాదు, కొందరి వాడే అని అన్నా.. తను లెక్కజేయను, ఈ అంశం మీద పోరాటం సాగుతుంది అని మెగాస్టార్ స్పష్టం చేశాడు! మరి ముసుగులో గుద్దులాట లేకుండా, తనను ‘కొందరివాడు’ అంటూ పదే పదే గేలి చేయాల్సిన అవసరం లేకుండా.. చిరంజీవి ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టున్నాడు. మరి కాపు రిజర్వేషన్ల అంశానికి అనుకూలంగా లేని.. మెగాస్టార్ అభిమానుల స్పందన ఎలా ఉంటుందో ఇప్పుడు! 

Show comments