జైల్లో సకల సౌకర్యాలూ కల్పించాలని, నేర నిరూపణ జరిగి దోషులుగా తేలినవారు.. నేరారోపణలు ఎదుర్కొంటూ నిందితులుగా వున్నవారూ న్యాయస్థానాల్ని ఆశ్రయించడం సహజమే. కొన్ని సందర్భాల్లో కొందరికి జైళ్ళలో 'ప్రత్యేక సౌకర్యాలు' సమకూరుతూ వుంటాయి. కొన్ని కోర్టుల ద్వారా, మరికొన్ని పలుకబడి ద్వారా సాధ్యమవుతాయి. ఇది జగమెరిగిన సత్యం.
ముంబై మారణహోమానికి సంబంధించి సజీవంగా పట్టుబడ్డ తీవ్రవాది కసబ్, జైల్లో సకల సౌకర్యాల్నీ ఆశించాడు. ఆ స్థాయిలో సౌకర్యాల సంగతెలా వున్నా, అతని భద్రత కోసం మాత్రం కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. 'కొత్తల్లుడి' తరహాలో గొంతెమ్మ కోర్కెలు కోరేవాడు కసబ్. ఇప్పుడిదంతా ఎందుకంటే, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ కూడా, తనకు జైల్లో సకల సౌకర్యాలూ కావాలంటున్నారు.
ఇంతకీ, శశికళ కోరిన సౌకర్యాలేంటో తెలుసా.? ఏసీ.. 24 గంటలు వేడి నీళ్ళు.. ఓ టీవీ.. మినరల్ వాటర్.. ప్రత్యేకంగా ఓ మంచం.. తనకు సహాయకారిగా ఓ మహిళ.. వీటన్నితోపాటు ఇంటి భోజనం.. ఇవీ శశికళ కోరిన కోర్కెలు. సరిపోతాయా.? అనడక్కండి, ఇంకా ఆమె కోరుకున్న కోర్కెల చిట్టాలో ఏమేం వున్నాయో ముందు ముందు తెలుస్తుంది.
ఒకవేళ శశికళ తాను అనుకున్నట్లుగా ముఖ్యమంత్రి అయి వుంటే, ఆ తర్వాత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలినా, ఆమెను 'వీఐపీ ఖైదీ'గా పరిగణించి ప్రత్యేక సౌకర్యాలకు న్యాయస్థానం అనుమతించేదేనేమో.! కానీ, ఇప్పుడామె ఓ పార్టీకి అధినేత్రి మాత్రమే. దాంతో, శశికళ గొంతెమ్మ కోర్కెలు తీరే అవకాశాలు చాలా తక్కువన్నది న్యాయ నిపుణుల వాదన.
అయినా చట్టం ముందు అందరూ సమానమే కదా.? మరి, ఖైదీలందు వీఐపీ ఖైదీలు ఎందుకు వేరు.. అనేదే కదా మీ డౌట్.? ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా.