స్విస్‌ ఛాలెంజ్‌.. రోజా ఛాలెంజ్‌.!

స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ మహిళా నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిని అంగీకరించబోమనీ, అవసరమైతే స్విస్‌ ఛాలెంజ్‌ని ఛాలెంజ్‌ చేస్తూ, కేంద్రానికి నిరసన తెలుపుతామని రోజా హెచ్చరించారు. 

అమరావతి నిర్మాణానికి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిని వాడాలని చంద్రబాబు సర్కార్‌ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో పారదర్శకత ఎక్కువగా వుంటుందని చంద్రబాబు సర్కార్‌ చెబుతున్నా, ఈ పద్ధతిపై కేంద్రం గతంలోనే పెదవి విరిచింది. అదే విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రస్తావిస్తోందిప్పుడు. రెండేళ్ళు నాన్చి నాన్చి.. ఇప్పుడు హడావిడిగా స్విస్‌ ఛాలెంజ్‌ అంటూ రాజధాని నిర్మాణానికి చంద్రబాబు సర్కార్‌ 'తప్పటడుగులు' వేస్తోంది. 

ఇక, సింగపూర్‌ కంపెనీలకు మొత్తంగా 52 శాతం వాటా ఇచ్చేసి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేవలం 48 శాతం వాటాతో సరిపెట్టుకోవడమూ వివాదాస్పదమవుతోంది. దానికి తోడు, అప్పనంగా సింగపూర్‌ కంపెనీలకు భూ కేటాయింపులు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణం విషయంలో కేంద్రం నుంచి సూచనలు తీసుకుని, అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకుంటే మంచిదనీ, అది పక్కన పెట్టి సింగపూర్‌పై చంద్రబాబు మమకారం చూపడమేంటని సాధారణ ప్రజానీకం నుంచీ వాదనలు తెరపైకి వస్తున్నాయి. 

అధికార పార్టీ మాత్రం, అమరావతి - స్విస్‌ ఛాలెంజ్‌ని ఎవరు ప్రశ్నించినా, వారంతా అమరావతి వ్యతిరేకులేనంటూ ఎదురుదాడితో సరిపెడుతోంది. జాతీయ స్థాయిలో అమరావతి - స్విస్‌ ఛాలెంజ్‌పై పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించిన దరిమిలా, ఇప్పుడు అధికార పార్టీ వ్యూహాలెలా వుంటాయో.. కేంద్రమే స్విస్‌ ఛాలెంజ్‌పై అనాసక్తి ప్రదర్శిస్తున్న దరిమిలా, ఈ విధానంపై బీజేపీ తాజా వైఖరి ఏంటో వేచి చూడాల్సిందే. Readmore!

Show comments

Related Stories :