గోదావరి నేతలకు బాబు క్లాస్ ?

గోదావరి జిల్లాల తెలుగుదేశం నేతలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్లాస్ పీకినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గడచిన ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలు తెలుగుదేశానికి అండగా నిలిచాయి. అందులో వెస్ట్ గోదావరి అయితే ఫుల్ స్వీప్ చేసారు. అలాంటిది ఇప్పుడు రెండుజిల్లాల్లో పరిస్థితిలో తేడా వచ్చిందని ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం అందించడంతో బాబు తనను ఏ గోదావరి జిల్లా నాయకుడు కలిసినా క్లాస్ పీకుతున్నారట. దీంతో ఇప్పటికిప్పుడు బాబుగారి సముఖానికి ఏదైనా పనిమీద వెళ్లడానికి ఆ జిల్లాల నాయకులు జంకుతున్నారట.

ఈస్ట్ గోదావరిలో  ముద్రగడ పద్మనాభం ప్లస్ కాపుల ఉద్యమం ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా తుని సంఘటన తరువాత కాపుల అరెస్టులు, కనీసం అయిదారు మండలాల్లో కాపు ఉద్యమ ఉధృతి కారణంగా తెలుగుదేశం ఓటు బ్యాంకు కు చిల్లు పడుతోందని ఇంటిలిజెన్స్ అంచనా అని వినికిడి. మరోపక్క పట్టిసీమ పై కనిపించని వ్యతిరేకత రైతుల్లో వుందని కూడా ఇంటిలిజెన్స్ వర్గాలు తెలియచేసాయట. గోదావరి జలాల తరలింపుపై పైకి ఎటువంటి స్పందన కనిపించకున్నా, ఇక్కడ జలాలు, అవి మిగులు జలాలే అని ప్రభుత్వం చెబుతున్నా, తరలించడంపై రైతులు కాస్త కినుకతో వున్నారట. అందుకే తక్షణం జిల్లాలో చిన్న, మధ్య సాగునీటి కాల్వలు, ప్రాజెక్టులు ఏవున్నా చకచకా పూర్తి చేయాలని బాబు ఆదేశించారట.

ఇక వెస్ట్ గోదావరిలో జగన్ కాస్త హల్ చల్ చేస్తున్నారు. ఆక్వా పుడ్ పార్క్ సమస్య పెద్ద దుమారమే లేపింది. ఇప్పుడు కోటగిరి తనయుడిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా వెలమ వర్గానికి కూడా జగన్ స్వాగతం పలికినట్లయింది. జిల్లాలో కాపులు, క్షత్రియులతో వెలమలు కూడా బలమైన వర్గమే. వారిని ఆకట్టుకునే ఎత్తుగడ, కాపుల్లో రగులుకుంటున్న అసంతృప్తి కలిసి ఈసారి జిల్లాను ఫుల్ స్వీప్ నుంచి దూరంగా జరుపుతున్నాయని ఇంటిలిజెన్స్ వర్గాలు బాబుకు విన్నవించినట్లు తెలుస్తోంది.

దీంతో ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులకు, మంత్రులకు పరిస్థితులు చేజారకుండా చూడమని బాబు ఆదేశాలిచ్చారట. కిందిస్థాయిలో పనులు ఏం జరుగుతున్నాయో, ఏం పనులు కావాలో తనకు నివేదికలివ్వాలని నాయకులను బాబు కోరినట్లు వినికిడి. మొత్తం మీద ఉభయ గోదావరి జిల్లాలు బాబుగారి మదిలో కాస్త అలజడి సృష్టిస్తున్నట్లు వుంది.

Show comments