13 రోజులు.. ఏం సాధించినట్లు.?

పార్లమెంటు లేదా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయట.. 

ఔనా, ఎప్పట్నుంచి.? 

ఫలానా తేదీ నుంచి.. 

ఏమో, మన సమస్యలకి ఈ సమావేశాల్లో పరిష్కారం దొరుకుతుందేమో.! 

ఇది ఒకప్పుడు జన బాహుల్యంలో చట్ట సభల గురించిన జరిగే చర్చ. కానీ, ఇప్పుడంతగా ఎవరూ చట్ట సభల గురించి ఆలోచించడంలేదు. ఎన్నికల్లో ఓట్లు వేయడంతోనే ప్రజల పని 'అయిపోతోంది'. ఆ తర్వాత, ప్రజల అవసరాలు, ఆలోచనలు, సమస్యలతో ప్రజా ప్రతినిథులకు పనేమీ వుండదు. చట్ట సభలకు వెళతారు, పదవుల్లో కూర్చుంటారు. అంతే, అంతకు మించి జరిగేది శూన్యం. 

ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు మరీ దారుణంగా జరుగుతున్నాయి. అసలు జరుగుతున్నాయి.. అని ఒప్పుకోడానికే దేశంలో ఎవరూ ఇష్టపడని పరిస్థితి. పార్లమెంటు సమావేశాల్ని విపక్షాలు నడవనివ్వడంలేదన్నది అధికార పక్షం ఆరోపణ. అధికార పక్షమే, సభను అడ్డుకుంటోందన్నది విపక్షాల వాదన. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం. సభ నుంచి అధికార, విపక్షాలు రెండూ పారిపోతున్నాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. 

విపక్షాలు ప్రశ్నించాలి.. అది వారి హక్కు. ప్రభుత్వం సమాధానం చెప్పాలి.. అది వారి బాధ్యత. కానీ, ఇక్కడ హక్కులకు దిక్కు లేదు.. బాధ్యత అన్న మాటకి అర్థమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టసభలు ఇలా కాక, ఇంకెలా జరుగుతాయి.? మామూలుగా అయితే చట్ట సభల్లో పరిస్థితి అదుపులో లేకపోతే, ఏ బిల్లులూ పాస్‌ అయ్యేందుకు వీలుండదు. కానీ, ఇప్పుడలా కాదు.. సమాధానం చెప్పడానికి సభ అదుపులో లేదని తప్పించుకునే అధికార పక్షం, బిల్లుల్ని మాత్రం హ్యాపీగా పాస్‌ చేయించేసుకుంటోంది. 

ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దుపై జరిగే చర్చలో పాల్గొనాలన్నది విపక్షాల డిమాండ్‌. నేటికి 13 రోజులు.. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయి. హాస్యాస్పదంగా అన్పిస్తుంటుంది, ఇన్ని రోజులు ప్రధాని పెద్ద నోట్ల రద్దుపై చట్ట సభల సాక్షిగా ప్రజలకు వివరణ ఇవ్వలేకపోవడమంటే. ఈ రోజు లోక్‌సభకు ప్రధాని హాజరయ్యారు.. మొన్న ఓ సారి రాజ్యసభకు హాజరయ్యారు. ఏం లాభం.? చర్చకు ఆస్కారం లేదని తెలిస్తేనే ప్రధాని చట్ట సభలకు వస్తున్నారు. 

'అదిగో వచ్చారు, మాట్లాడలేదేం..' అని అధికార పక్షం అతి తెలివి ప్రదర్శిస్తోంటే, అసలు చర్చ ఎక్కడ జరగనిచ్చారు.? అసలు సభ ఎక్కడ జరగనిచ్చారు.? వాయిదా వేసుకుని పారిపోతున్నారు కదా.. అంటూ విపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

ఎవరి వాదనలు వారివే.. మధ్యలో ప్రజలే వెర్రి వెంగళప్పలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఇటీవల ప్రకటించిన ప్రత్యేక సాయంపై పలువురు ఏపీ ప్రజా ప్రతినిథులు పార్లమెంటులో ప్రస్తావించారు. దానికి సమాధానం చెప్పాలి కదా.? ప్చ్‌, చెప్పలేదాయె. మిత్రపక్షం టీడీపీ అడిగినాసరే, సమాధానం చెప్పేందుకు ఎన్డీయే ప్రభుత్వానికి నోరు రావడంలేదు. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇంకా సవాలక్ష సమస్యలపై కేంద్రానిది ఒకటే వైఖరి.. పారిపోవడం. 

ఈ మాత్రందానికి కోట్లు ఖర్చు చేసి పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం అవసరమా.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.

Show comments