బాబు ఛాయిస్ దగ్గర 70 కోట్లు

ఏ లేవెల్ కు తగినట్లు ఆ లెవెల్ వుంటుంది. ఫైవ్ స్టార్ హోటల్ అంటే ఫైవ్ స్టార్ హోటలే..అందులో ఆ లెవెల్ స్టాఫ్ నే వుంటారు. చంద్రబాబు అంటే ఎవరు, లక్షల కంపెనీని కోట్లాది రూపాయిల కంపెనీగా ఎదిగిలా చేయగలిగిన తెలివైన బిజినెస్ మెన్. రాజకీయాల సంగతి అలా వుంచండి. అంతటి కార్పొరేట్ దగ్గర ఎవరుంటారు. ఆ లెవెల్ కార్పొరేట్లే వుంటారు. కావాలంటే సుజన, గంటా, నారాయణ, గల్లా జయదేవ్, ఇలా చాలా పేర్లు చెక్ చేసుకోవచ్చు. 
బాబు సంగతి అలా వుంచితే తిరుపతి దేవుడు అంటే ఎవరు? కొటానుకోట్ల మందికి అభిమాన దేవుడు. కోటానుకోట్ల ఆదాయం కలిగిన వాడు. మరి ఆయన ఆలయ బోర్డు మెంబర్లంటే సాదాసీదా వాళ్లుంటారు? ఆ లెవెల్ జనాలే వుంటారు. 

మరి బాబుగారి లాంటి బిజినెస్ కమ్ రాజకీయవేత్త, తిరుపతి లాంటి గుడికి కమిటీ వేస్తే అందులో వుండేవాళ్ల లెవెల్ ఎలా వుంటుంది? ఇవ్వాళ చెన్నయ్ లో ఐటి శాఖ అధికారులు దాడి చేసిన జే శేఖర్ రెడ్డి లెవెల్ లా వుంటుంది. టీటీడీ బోర్డు మెంబర్ గా చంద్రబాబు ఎంపిక చేసి నియమించింది ఎవరిని? ఇసుక, మైనింగ్ కాంట్రాక్టులు చేస్తూ భారీగా సంపాదించిన శేఖర్ రెడ్డిని. ఈయనకు అటు తమిళనాడు రాజకీయ నాయకుల నుంచి, ఇటు కేంద్ర మంత్రి వెంకయ్య నుంచి బాబుగారికి రికమెండేషన్ జరిగినట్లు గుసగుసలు వున్నాయి. ఇప్పుడు ఈయన దగ్గర ఏకంగా 90కోట్లు నగదు (70 కోట్లు కొత్త కరెన్సీ, 20కోట్లు పాత కరెన్సీ), వంద కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

కామన్ మన్ కే కష్టాలు

పది వందలు తీసుకోవడానికో, రెండు వేల నోట్లు ఒకటి సంపాదించడానికో జనం నానా కష్టాలు పడుతున్నారు. ఎటీఎమ్ ల దగ్గర గంటల కొద్దీ కాళ్లు పీకేలా క్యూలో నిల్చుంటున్నారు. బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. కానీ ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇలా ఎక్కడ పడితే అక్కడ బడా బాబుల దగ్గరకు కోట్ల కోట్లు కొత్త నోట్లు ఇట్టే చులాగ్గా చేరిపోతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇన్ని లక్షల కోట్లు అందించాం, అన్ని వేల కోట్లు పంపించాం, డబ్బు కొరత లేనేలేదంటూ డబ్బాలు కొడుతుంది. 

తాజాగా ఇప్పుడు చెన్నయ్ లో ముగ్గురు ఆంధ్ర వ్యాపారవేత్తల నుంచి 70 కోట్లు నగదును ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారట. అదంతా కొత్త నోట్ల రూపంలో? ఇప్పటికే హైదరాబాద్ లో నలుగురు పోస్టల్ అధికారులపై సిబిఐ కేసులు నమోదు చేసింది. దేశ వ్యాప్తంగా పలువురు బ్యాంకు అధికారులపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు చెన్నయ్ 70 కోట్ల వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందో?

Show comments